శ్రీ మద్భాగవతము - ద్వితీయ (2వ) స్కందము

2 - ద్వితీయోధ్యాయః

శ్రీశుకమహర్షి ఇట్లు పలికెను: పూర్వము సృష్ట్యాదియందు బ్రహ్మకు జగత్స్వరూపము గురించి స్మరణము లేకుండెను. అపుడాయన పైన చెప్పిన విధముగా పరమేశ్వరుని మనస్సులో ధారణ చేయగా, ఆయన సంతసించెను. అపుడు బ్రహ్మకు స్మృతి తిరిగి లభించి, అమోసు మగు జ్ఞానము గలవాడాయెను. అపుడా బ్రహ్మ సృష్టి స్వరూపము విను ములో ఖచ్చితమగు అవగాహన గలవాడై పూర్వకల్పములో ఉన్న విధము గనే ఈ జగత్తును సృష్టించేను.

శబ్దాత్మకమగు వేదము కర్మఫలమును బోధించే ప్రక్రియలో భాగ ముగా స్వర్గాదిలోకములను ప్రస్తావించును. కాని, ఈ లోకములు నామమా త్రములే గాని, యథార్థతత్త్వములు గావు. మానవుని బుద్ధి అట్టి అనిత్యము లగు లోకములను ధ్యానించుచుండును. జీవుడు అజ్ఞాననిద్రలో నున్నవాడై, భోగాసక్తిచే ఆ మిథ్యాభూతమగు మార్గమునందు గిర గిర తిరుగుతూ, అనగా చావు పుట్టుకల చక్రభ్రమణములో తగులుకోని, యథార్థమగు పరబ్ర హ్మతత్త్వమును పొందజాలడు.

కావున, నిత్యానిత్యవస్తువివేకము గల సాధకుడు నామమాత్రము లగు భోగములనుండి కేవలము తన దేహమును నిలబెట్టుకొనుట కొరకై ఎంతటి ప్రయోజనము ఆవశ్యకమో, అంత మాత్రమే స్వీకరించ వలెను. తాను స్వీకరించిన ఆ అల్పమునందు కూడ తీవ్రమగు ఆసక్తి లేనివాడై, ఆతడు కేవలము పురుషార్థనిశ్చయము గలవాడై ఉండవలెను. దేహనిర్వా హము మొదలగు అల్పప్రయోజనము కూడ తాను శ్రమించకుండగనే సిద్ధించే పక్షములో, అట్టి శ్రమ వ్యర్థమనే సత్యమును గ్రహించినవాడై, తనకు అనాయాసముగా లభించిన దానికంటే అధికము కొరకు ప్రయత్న మును చేయరాదు.

            పరుండుటకు భూమి ఉండగా శయ్యలతో పని యేమి? సహజసి. దమైన చేయి ఉండగా తలగడతో ఏమి ప్రయోజనము? దోసిలి ఉండగా పలు రకముల అన్నపాత్రలతో పని యేమి? దిక్కులు, చెట్టు బెరడు, నారబ ట్టలు మొదలగునవి ఉండగా పట్టువస్త్రములతో పని యేమి?

            దారిలో గుడ్డ పేలికలు పడి లేవా? (ఉన్నవి). ఇతరప్రాణులను తమ ఫలములతో పోషించే చెట్లు భిక్షను ఇచ్చుట లేదా? (ఇచ్చుచున్నవి). నదులు ఎండి పోయినవా? (లేదు). పర్వతగుహలు నివాసమునకు వీలు కొకుండగా అడ్డుకొన బడినవా? (లేదు). భగవానుడు తనను శరణు జొచ్చి నవారిని రక్షించుట లేదా? (రక్షించుచున్నాడు). థనగర్వముతో కళ్లు మూసుకొని పోయి ఉన్నవారిని వివేకవంతులు ఏల సేవించెదరు? ( సేవిం

చరు),

వినాశరహితుడగు శ్రీహరి భగవానుడు ప్రాణుల అలంకరణములో ఆత్మరూపుడై సహజముగనే నెలకొనియున్నాడు. కేవలం రూపుడగు ఆయన మాత్రమే ఈ సృష్టిలోని సత్యవస్తువు. ఆత్మరూపుడు కనుక, ఆయన అత్యంతప్రీతిపాత్రుడు కూడ అగుచున్నాడు. సాధకుడు పురుషార్ధ నిశ్చయము గలవాడై, పైన చెప్పిన విధముగా విరక్తుడై ఈశ్వగ స లోని ఆనందమును గ్రోలుతూ ఆయనను సేవించవలెను. ఈ జనన మరణ చక్రరూపమగు సంసారమునకు కారణమగు అవిద్య ఆ పరమేశ్వరుని గజనమునందు వినాశమును పొందును.

             యమపురియొక్క మార్గములో నుండే వైతరణి వలె ప వాహమగు ఈ సంసారములో పడి జీవుడు తాను చేసిన కర్మలు దుఃఖములను అనుభవించుచున్నాడు. అట్టి స్థితిని చూచుచు ఆ పరమాత్మయొక్క స్మరణమును ప్రక్కన పెట్టి మిథ్యారూపము నాగుముట చింతను చేయువాడు ఎవ్వడు గలడు? కేవలము 

పూర్ణుడగు పరమేశ్వరుడు ముల్లోకములతో కూడిన బ్రహ్మాండమే దేహముగా గలవాడయ్యు, మానవుని దేహము మధ్యలో జుత్తెడు నిడివి గల హృదయాకాశమునందు నివసించుచున్నాడు. నాలుగు భుజములలో పద్మము, చక్రము, శంఖము మరియు గదలను ధరించియున్న ఆ శ్రీమహా విష్ణువును కొందరు మనస్సులో ధారణ చేసి స్మరించుచున్నారు.

ప్రసన్నమగు మోము గలవాడు, పద్మముల వలే విశాలమైన కన్నులవాడు, కడప పువ్వు కేసరముల వలె పచ్చని వస్త్రములను దాల్చిన వాడు, ప్రకాశించే గొప్ప మణులు పొదిగిన అంగదములు, కిరీటము మరియు కుండలములు గలవాడు అగు శ్రీహరిని వారు స్మరించెదరు.

            యోగి శ్రేష్ఠులు తమ హృదయపద్మముల మధ్యలో ఆ శ్రీహరి యొక్క సున్నితమగు పాదములను స్థిరముగా భావన చేయుచుందురు. ఆయన వక్షఃస్థలముపై లక్ష్మీదేవి రేఖారూపముగా విరాజిల్లును. మెడలో వ్రేలాడే కౌస్తుభమాణిక్యముతో మరియు వాడని శోభలు గల అడవి పువ్వుల మాలతో ఆయన నిండుగా నుండును. అట్టి శ్రీహరిని భక్తులు స్మరించుచుందురు.

            బంగరు మొలత్రాడు, ఉంగరములు, మిక్కిలి విలువైన పెండేర ములు, కంకణములు మొదలగు ఆభరణములను ఆయన అలంకరించు కోని యుండును. దట్టని స్వచ్చమైన నల్లని చుట్లు తిరిగిన జుట్టుతో ప్రకా శించే ఆయన ముఖమునందు అందమగు చిరునవ్వు అలరారుచుండును.

శ్రీహరి ఉదారమగు లీలారూపమైన చిరునవ్వుతో చూస్తూ కనుబొ మల విరుపుల ద్వారా భక్తులపై గొప్ప అనుగ్రహవర్షమును కురిపించుచుండును. మనస్సు ఈ విధమగు ధారణయందు నిశ్చలమగు వరకు సాధకుడు ఈ రూపమును మనోవృత్తులలో నింపుకొని దర్శించుచుండవలెను.

గదాధారియగు శ్రీహరియొక్క మూర్తిని పాదములతో మొదలు పెట్టి చిరునవ్వు వరకు గల అవయవములను వరుసగా ఒక్కటి ఒక్కటిగా మనస్సును నిలిపి ధ్యానించవలెను. ఇట్లు చేయగా చేయగా అంతఃకర ణము పరిశుద్ధమై మనస్సు ఒక్కొక్క స్థానముపై స్థిరముగా నిలిచే స్థితి కలుగును. అపుడు ఆ స్థానము జయించబడినదని తెలియవలెను. తరు వాత దాని పైనుండే స్థానముపై మనస్సును నిలుపవలెను. ఈ విధమగు క్రమములో ధ్యానించవలెను.

జగత్కారణమగు ప్రకృతి గాని, కార్యరూపమగు జగత్తు గాని జగ న్నాథుడగు శ్రీహరి కంటే భిన్నముగా లేవు. ఆ పరమపురుషుడే సకలప్రా ణుల దేహేంద్రియమనస్సంఘాతమును దర్శించే క్షేత్రజ్ఞుడై యున్నాడు. అట్టి శ్రీహరియందు మనస్సు లగ్నమై పరమప్రేమరూపమగు భక్తి స్థిరప డునంతవరకు, సాధకుడు నిత్యజీవితములోని పనులను పూర్తి చేసుకున్న తరువాత ఆయనయొక్క స్థూలమగు విరాడ్రూపమును నియమబద్దముగా ధ్యానించవలెను.

            ఓ రాజా! యోగనిష్ట గల సాధకుడు ఈ లోకమును విడిచి పెట్టవ లెనని కోరినచో, అపుడు ఆతడు స్థిరమైన సుఖకరమగు (సిద్ధాసనము మొదలగు) ఆసనమును వేసి, సంకల్పపూర్వకముగా ప్రాణాయామమును చేసి, ఇంద్రియములను విషయములనుండి ఉపసంహరించ వలెను (ప్రత్యాహారము). ఆతడు మనస్సును దేశకాలములపై లగ్నము చేయరాదు.

            వివేకియగు సాధకుడు పరిశుద్ధమగు తన బుద్ధితో మనస్సును నియంత్రించి, ఆ బుద్ధిని బుద్ధిసాక్షియగు ద్రష్టయందు విలీనము చేయవలె ను. ఆతడు ద్రష్ట (అహంకారము) ను శుద్ధచైతన్యము (ప్రత్యగాత్మ) నందు, ఆ ప్రత్యగాత్మను పరబ్రహ్మయందు ఏకము చేసి, ఆత్మానందమును పొందును. ఆ తరువాత చేయదగినది లేదు గావున, ఆతడు ప్రయత్నము నుండి విరమించ వలెను.

దేవతలకు కూడ నియామకమగు కాలము ఆ ఆత్మస్వరూపమును తన పరిధి లోనికి గోని రాలేదు (మిథ్యాభూతమగు కాలముయొక్క అస్తి త్వము ఆత్మయందు మాత్రమే గలదు). దేవతలు లోకములను శాసించు వారే అయిననూ, ఆ ఆత్మస్వరూపమును శాసించ సమర్థులు కారని వేరే చెప్పవలయునా? ఆ ఆత్మ సత్త్వరజస్తమోగుణములకు అతీతమైనది. ఆత్మ-అభిన్నమగు పరబ్రహ్మయందు ప్రకృతి, మహత్తత్త్వము, అహంకా రము అను జగత్కారణములగు తత్త్వములు కల్పించ బడుచున్నవి.

జిజ్ఞాసువులు పరబ్రహ్మకంటె భిన్నముగా భాసించే సర్వమును, ఇది వస్తువు (యథార్థ తత్త్వము) కాదు, ఇది వస్తువు కాదు అని పరిత్య జించ గోరువారై, అనాత్మలగు దేహాదులయందలి ఆత్మభావమును విడిచి పెట్టెదరు. వారు పూజనీయుడగు శ్రీహరియొక్క సత్యజ్ఞానానంత స్వరూ పమును ప్రతిక్షణమునందు హృదయముచే ఆలింగనము చేసుకొని, ఇత రము సర్వమునందు ఆసక్తి లేనివారై ఉండెదరు. ఆ విధముగా సర్వని షే ధావధియగు ప్రత్యగాత్మతత్త్వమే వైష్ణవపరమపదము (సర్వోత్కృష్టము, పరమగమ్యము అగు పరబ్రహ్మ) అని వేదములను ఉటంకిస్తూ మహర్షులు చెప్పుచున్నారు.

జిజ్ఞాసువు ఈ విధముగా శాస్త్రమునుండి గురువు ద్వారా లభిం చిన జ్ఞానముయొక్క బలముచే నశింప జేయబడిన భోగవాసనలు గలవాడై ఫలహేతువులగు కర్మల నుండి విరమించి ఆత్మజ్ఞాననిష్ఠయందు ఉండవలెను. మరియు, ఆతడు దేహత్యాగసమయమునందు బడలికను త్రోసిపు చ్చి, కాలి మడమతో గుదమును నొక్కి పెట్టి, తరువాత ప్రాణశక్తిని స్వాధిష్ఠా న (పొత్తి కడుపు)-మణిపూర (నాభి)-అనాహత (గుండే)-విశుద్ధి (కంఠము). ఆజ్ఞా (కనుబొమల నడుమ)-సహస్రారము (బ్రహ్మరంధ్రము) లనే ఆరు స్థానముల (చక్రముల) గుండా పైకి తీసుకు రావలెను.

మననశీలుడగు యతి నాభియందలి మణిపూరచక్రమునందున్న ఆ ప్రాణశక్తిని హృదయమునందలి అనాహతచక్రమును ఆరోహింప జేసి, అచ్చటనుండి ఉదానవాయుసంచారమార్గము గుండా కంఠమునకు క్రింద నుండే విశుద్ధి చక్రములోనికి తీసుకు రావలెను. మనోజయము గల యతి తరువాత దానిని బుద్దితో అనుసంధానము చేసి, మెల్లమెల్లగా కొండ నా లుక వద్దకు గొని రావలెను.

            స్వర్గాది లోకములయందు అపేక్ష లేని యతి రెండు ముక్కులు, రెండు కళ్లు, రెండు చెవులు మరియు నోరు అనే ఏడు ప్రాణసంచారమార్ధ ములను మూసివేసి, ప్రాణశక్తిని కొండ నాలుక వద్దనుండి కనుబొమల మధ్యలోని ఆజ్ఞాచక్రములోనికి తీసుకొని రావలెను. తరువాత ఆ యతి తనకు లక్ష్యమగు మోక్షము (ప్రత్యగభిన్న బ్రహ్మము) నందు స్థిరముగా బుద్దిని నిలిపి (విలీనము చేసి), ఆ స్థితిలో ఇంచుమించు అరగంట సేపు ఉండవలెను. అపుడా యతి బ్రహ్మరంధ్రమును భేదించుకొని పరమాత్మ యందు ఐక్యమగును.

ఓ రాజా! సాధకుడు బ్రహ్మలోకమునకు, లేదా అణిమ మొదలగు ఎనిమిది ఐశ్వర్యములతో కూడిన ఆకాశసంచారులగు సిద్దుల విహారస్థాన మునకు, లేదా బ్రహ్మాండములో మరెక్కడి కైననూ వెళ్లబోయే పక్షములో, మనస్సు మరియు ఇంద్రియములతో, అనగా సూక్ష్మశరీరముతో కూడుకొనియే వెళ్లవలెను.

ఉపాసన, భగవద్ధర్మానుష్ఠానము, అష్టాంగయోగము మరియు సమ్యగ్-జ్ఞానము అనే సాధనములను సిద్ధింప జేసుకున్న యోగివర్యులు వాయువు వలె సూక్ష్మమగు శరీరమును కలిగి యుందురు. వారు బ్రహ్మాం డము లోపల మాత్రమే గాక, బయట కూడ యథేచ్ఛగా సంచరించ గలరు. ఇట్టి స్థితిని మానవుడు కర్మల వలన పొందలేడు.

ఓ రాజా! తేజోమయమగు సుషుమ్నా నాడి బ్రహ్మలోకప్రాప్తికి మార్గము. యోగి ఆ మార్గముగుండా శరీరము బయటకు వచ్చి, ఆకాశమార్గము గుండా అగ్ని దేవతను పొందును. అచట ఆయనయందు మిగిలి యున్న దోషములు నశించి పోవును. తరువాత ఆ యోగి అగ్నిలోకమునకు పైన ఉండే, శ్రీహరికి సంబంధించిన శిశుమారునియొక్క జ్యోతిర్మండల మును చేరుకొనును.

            శ్రీహరికి సంబంధించిన ఆ శిశుమారచక్రము విరాట్పురుషుని నాభి వంటిది. దోషములు లేని మిక్కిలి సూక్ష్మమగు దేహముతో కూడి యున్న ఆ యోగి ఒక్కడే దానిని అతిక్రమించి, సర్వులచే నమస్కరించబడే మహర్లోకమును పొందును. అది సగుణబ్రహ్మోపాసకులు పొందే లోకము. అచట ప్రళయము వరకు ఆయుర్దాయము గల దేవతలు రమించు చుందురు.

తరువాత కల్పాంతమునందు ఆ యోగి ఆది శేషుని పడగలనుండి బయల్వెడలే అగ్నిజ్వాలలలో మాడి మసి అగుచున్న క్రింది లోకములను పరికించి బ్రహ్మలోకమును చేరుకొనును. అచట గొప్ప సిద్ధపురుషులు విమానములలో విహరించు చుందురు. అచట వారు రెండు పరార్ధముల కాలము నివసించెదరు. వేయి మహాయుగములు ఒక కల్పము. అట్టి రెండు కల్పములు బ్రహ్మకు ఒక దినము, ఆ మానములో ఏభై సంవత్సర ములు ఒక పరార్దమనబడును.

ఈ విధమగు పరమేశ్వరధ్యానమునెరుంగని ప్రాణులు నీచయోను లలో జన్మించి అంతము లేని దుఃఖమును అనుభవించుచుందురు. వారిని కనినప్పుడు బ్రహ్మలోకములోని ఈ సిద్ధపురుషులకు దయాగుణము గల వారగుటచే మనస్సునకు క్లేశము కలుగును. దానిని మినహాయించి, వారికి అచట మరియొక కారణముగా మానస దుఃఖము లేనే లేదు. వారికి అచట ముసలి తనము గాని, మరణము గాని, శరీరబాధలు గాని, మానసికమగు ఆందోళనలు గాని ఉండవు.

తరువాత భయమునెరుంగని ఆ సిద్ధపురుషుడు తన సూక్ష్మశరీర ముతో పృథివీతత్త్వమును పొంది, దానిని జలతత్త్వమునందు ప్రవిలాపము చేసి, జలస్వరూపుడై, అదే విధముగా దానిని అగ్నితత్త్వమునందు ప్రవే శ పెట్టి తేజోమయుడై ఉండును. తరువాత కొంత కాలమునకు ఆయన తొందర లేనివాడై, తన అగ్నిస్వరూపమును వాయువునందు ప్రవిలాపము చేసి, దానిని మరల పరమాత్మయొక్క మూర్తియగు (పరమాత్మయొక్క అనంతత్వమును ప్రకటించే) ఆకాశతత్త్వమునందు విలీనము చేయును.

ఆ యోగి ఘ్రాణేంద్రియమును గంధతన్మాత్ర (సూక్ష్మపృథివి) యందు, రసనేంద్రియమును రసతన్మాత్ర (సూక్ష్మజలము) నందు, నేత్రం ద్రియమును రూపతన్మాత్ర (సూక్ష్మాగ్ని), త్వగింద్రియమును వాయుతన్మా తయగు స్పర్శయందు, శ్రోత్రేంద్రియమును ఆకాశతన్మాత్రయగు శబ్దమునందు, మరియు ఆయా కర్మేంద్రియములను ఆయా క్రియలయందు విలీ నము చేయును.

             ఆ యోగి పంచమహాభూతముల తన్మాత్రలను తామసాహంకార మునందు, ఇంద్రియములను రాజసాహంకారమునందు, మనస్సును మరియు ఇంద్రియాధిష్టాన దేవతలను సాత్త్వికాహంకారమునందు విలీ నము చేయును. ఇవి అన్నియు అహంకారముయొక్క కార్యములే గదా! ఇదే విధమగు విలీనప్రక్రియచే ఆ యోగి అహంకారమును సమష్టిబుద్ది (మహత్తత్త్వము) యందు, దానిని సత్త్వరజస్తమోగుణముల లయస్థాన మగు మాయాశక్తియందు విలీనము చేయును.

ఓ రాజా! ఆనందస్వరూపుడగు ఆ సిద్దపురుషుని సూక్ష్మశరీరము ప్రకృతియందు విలీనమైన తరువాత ఆతనికి ఉపాధి సంబంధము అంతము గును. అపుడాతడు ఆ ప్రకృతితో సహా వికారములు లేనిది, ఆనందఘన ము అగు పరమాత్మయందు విలీనమగును. ఈ విధముగా భగవంతునితో ఐక్యమును పొందిన జ్ఞాని మరల ఈ లోకములో జన్మించడు; అనగా, ఆతనికి పునరావృత్తి లేదు.

             ఓ రాజా! సనాతనములైన ఈ రెండు మోక్షమార్గములు (సద్యో ముక్తి, క్రమముక్తి) వేదమునందు కీర్తించబడినవి. నీవు సామాన్యకార ముగా ప్రశ్నించినది వీటి గురించియే. పూర్వము బ్రహ్మ వాసుదేవ భగవా నుని ఆరాధించి ప్రశ్నించగా, ఆయన వీటిని గురించి బ్రహ్మకు చెప్పినాడు.

ఏ ఉపాయము వలన ఈ సంసారములో పడియున్న మానవునకు వాసుదేవ భగవానునియందు భక్తి కుదురునో, అంతకంటే మంగళకరమగు మార్గము మరియొకటి లేనే లేదు,

బ్రహ్మభగవానుడు నిర్వికారముగా మూడు సార్లు వేదమును పరి శీలించి తన బుద్దితో నిశ్చయించినదేమనగా, దేనిచే ఆత్మస్వరూపుడగు శ్రీహరియందు ప్రీతి (భక్తి) కలుగునో, అదియే సర్వోత్తమమగు ధర్మము.

            శ్రీహరి భగవానుడు సకలప్రాణులలో ప్రత్యగాత్మ రూపముగా సాక్షి చైతన్యస్వరూపుడై వెలుగొందుచున్నాడు. బుద్ధి, ఇంద్రియములు మొదలగు సాక్షిభాస్యములగు ఉపాధులు తమ ద్వారా ప్రకటమయ్యే. ఆ చైతన్యతత్త్వమును మన ఊహకు గోచరింప జేయుచున్నవి.

ఓ రాజా! కావున, మానవులు సర్వదేశములలో సర్వకాలములలో ఏకాగ్రమైన మనస్సుతో శ్రీహరి భగవానుని గురించి శ్రవణము చేయవలె ను. ప్రవక్త లేకున్నచో, నలుగురితో కలిసి కీర్తించ వలెను. ఇతరులు లేనిచో, ధ్యానించవలెను.

మహాత్ములు సకలప్రాణుల ఆత్మరూపుడగు శ్రీహరియొక్క గాథలు అనే అమృతమును పంచి పెట్టుచుందురు. ఎవరైతే ఆ అమృత మును చెవులు అనే దొన్నెలయందు నిండుగా నింపుకోని పానము చేయుదురో, వారు భోగవాసనలచే కలుషీకృతమైన తమ అంతఃకరణములను శుద్ధము చేసుకొని, ఆ పరమేశ్వరుని పాదపద్మముల చెంతకు చేరెదరు. 

శ్రీమద్భాగవత మహాపురాణములోని రెండవ స్కంధములో రెండవ అధ్యాయము ముగిసినది.