భాగవత మహా పురాణము
4 - చతుర్విధ ప్రళయములు
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! పరమాణువుతో మొదలు పెట్టి బ్రహ్మదేవుని ఆయుర్దాయమైన రెండు పరార్దముల వరకు గల కాలమును, యుగముల కొలమానమును కూడ నీకు చెప్పితిని. కల్పమును, ప్రళయమును గురించి కూడ చెప్పెదను. వినుము.
ఓ పరీక్షిన్మహారాజా! వేయి చతుర్యుగములు బ్రహ్మదేవుని పగలు అని మహర్షులు చెప్పిరి. అదియే ఒక కల్పము. దానిలో పధ్నాలుగు మంది మనువులు ఉండెదరు.
ఆ కల్పము అంతమైనప్పుడు అంతే కాలము ప్రళయము. అదియే బ్రహ్మదేవుని రాత్రియని మహర్షులు చెప్పెదరు. అప్పుడు ఈ ముల్లోకములు నిశ్చయముగా విలీనమగును.
ఇది నైమిత్తిక (బ్రహ్మదేవుని నిద్ర అనే నిమిత్తముగా వచ్చినది) ప్రళయమనబడును. దీనియందు జగత్తును సృష్టించిన స్వయంభువుడగు బ్రహ్మదేవుడు జగత్తును తనలో విలీనము చేసుకొని శయనించును. అనంతశయనుడగు నారాయణుడు కూడ శయనించును.
సర్వోత్తముడైన బ్రహ్మదేవుని ఆయుర్దాయమైన రెండు పరార్ధములు గడువగానే, పంచతన్మాత్రలు, అహంకారము, మహత్తత్త్వము అనే కారణతత్త్వములు విలీనమగుటకు సంసిద్ధమగును.
ఓ పరీక్షిన్మహారాజా! ప్రళయమునకు కారణమగు కాలము ఉపస్థితము కాగానే, పంచభూతముల సమ్మేళనమైన బ్రహ్మాండకోశము కారణతత్త్వ ములయందు విలీనమగును. కావుననే, ఇది ప్రాకృతికప్రళయమనబడినది.
పరీక్షిన్మహారాజా! మేఘుడు భూమిపై వంద యేళ్లు వర్షించడు. అప్పు డాహారము లేకుండుటచే జనులు నిశ్చయముగా ఒకరినొకరు తినెదరు.
కాలముచే ఉపద్రవమును పొంది పీడితులైన జనులు మెల్లగా వినాశమును పొందెదరు. ప్రళయకాలమునకు చెందిన సూర్యుడు భయంకరములగు కిరణములలో సముద్రము, దేహము, భూమి అనువాటి నీటినంతనూ ఆవిరి చేసి, సుతరాము వరమునీయడు. తరువాత, ఆది శేషుని పడగలనుండి ప్రళయకాలమునకు చెందిన అగ్ని పుట్టగలదు.
తరువాత వాయువుయొక్క వేగముచే ప్రజ్వరిల్లిన అగ్ని ప్రాణులు లేని పాతాళము మొదలగు లోకములను దహించును. తరువాత, అగ్నియొక్క జ్వాలలచే మరియు సూర్యుని రశ్ములచే పైన, క్రింద అంతటా బ్రహ్మాండము దహించివేయబడును. అపుడది కాల్చబడిన గోమయపిండము వలె భాసించును.
తరువాత ప్రళయకాలమునకు చెందిన బలమైన గాలి పెద్ద శబ్దము చేస్తూ వంద సంవత్సరముల కాలము దాటి వీచును. ఆకాశము ధూళిచే కప్పివేయబడి బూడిదరంగుగా అగును.
పరీక్షిన్మహారాజా! తరువాత అనేకములైన రంగు రంగుల మేఘముల గుంపులు తీవ్రముగా గర్జనలతో నినదిస్తూ వంద యేళ్లు వర్షించును. అప్పుడు బ్రహ్మాండము లోపల మధ్యలోనుండే జగత్తు ఎటు చూచినా నీరు ఒక్కటే ఉండును.
అప్పుడు జగత్తు అంతయు నీటిచే ముంచివేయబడగా, జలములు పృథివియొక్క గంధమనే గుణమును తమలో కలుపుకొనును. గంధగుణము విలీనము కాగా, పృథివి విలీనమగుటకు యోగ్యము అగును.
తరువాత జలములయొక్క రసగుణమును అగ్ని గ్రసించగా, రసము లేని ఆ జలములు అగ్నియందు విలీనమగును. అగ్నియొక్క రూపగుణమును వాయువు గ్రహించగా, రూపము లేని అగ్ని వాయువులో విలీనమగును. ఆకాశము వాయువుయొక్క స్పర్శగుణమును గ్రహించును.
ఓయీ పరీక్షిన్మహారాజా! ఆ స్పర్శ లేని) వాయువు ఆకాశములో విలీనమగును. తరువాత ఆకాశముయొక్క గుణమైన శబ్దమును తామహంకారము విలీనము చేసుకొనును. అప్పుడు ఆకాశము ఆ తామహంకారములో విలీనమగును. రాజసాహంకారము కూడ ఇంద్రియములను వాటి వాటి శక్తులతో సహా విలీనము చేసుకోనును. ఇంద్రియాధిష్ఠానదేవతలు సాత్త్వికాహంకారమునందు విలీనమగుదురు.
ఓ పరీక్షిన్మహారాజా! అహంకారము (అనేకము కావాలనే ఈశ్వర సంకల్పము) మహత్తత్త్వము (ఈశ్వరచేతన) లో, మహత్తత్త్వము సత్త్వ రజస్తమోగుణములలో విలీనమగును. కాలముచే ప్రేరితమైన మాయా శక్తిలో గుణములు విలీనమగును (గుణములలో సామ్యావస్థ కలుగును).
కాలము యొక్క అవయవములైన గంట, రోజు మొదలగువాటి నిమిత్తముగా ఆ మాయాశక్తియందు పరిణామము మొదలైన భావవికారములు (పదార్థములలో కాలముచే కలిగే మార్పులు) లేవు. ఆది-అంతములు లేని మాయాశక్తి ఇంద్రియగోచరము కాదు. అది కాలాతీతము, అవినాశియగు జగత్కారణము.
ఆ మాయాశక్తియందు వాక్కులు, మనస్సు, సత్త్వరజస్తమోగుణములు (వాటి వైషమ్యము), ఈ మహత్తత్త్వము-అహంకారము మొదలైన తత్త్వములు, ప్రాణములు, బుద్ధి, ఇంద్రియములు, వాటి దేవతలు లేరు. దానికి భూరాదిలోకములను పోలిన ఆకార (రచనా) విశేషమేదియూ లేదు.
అప్పుడు జాగ్రత్స్వప్నసుషుపులు గాని, పృథివ్య స్తేజోవాయ్వాకాశములు గాని, సూర్యచంద్రులు గాని లేవు. అది గాఢనిద్రవలె, శూన్యము వలె ఊహకు అందనిది. అదియే జగత్కారణతత్త్వమని మహాత్ములు చెప్పుచున్నారు.
ఈ విధముగా హిరణ్యగర్బునియొక్క మరియు ప్రకృతియొక్క సత్త్వాదిశక్తులు కాలముచే చలింపజేయబడి కాలమునకు వశమై విలీనమగును. దీనిని ప్రాకృతికప్రళయమని అందురు.
ఒకే చైతన్యము బుద్దిగా, చూపు మొదలైన ఇంద్రియమలుగా, వాటిచే గ్రహించబడే రూపొదివిషయములుగా భాసిస్తూ, ఈ గ్రాహ్యగ్రాహకభేదమునకు అధిష్టానమగుచున్నది. అదియే సత్యము. జగత్తు దృశ్యము. పైగా, జగత్తు తన కారణమైన జ్ఞానబ్రహ్మకంటే వేరుగా లేదు. కావున, ఈ విధముగా ఆరంభము-అంతము గల జగత్తు మిథ్యయే గాని, యథార్థవస్తువు కాదు.
దీపము, చూపు, రూపము కూడ ప్రకాశముకంటె వేరుగా లేవు. ఇదే విధముగా బుద్ది, వినికిడి మొదలగు ఇంద్రియములు, శబ్దాది విషయములు సదహ్మకంటె వేరుగా లేవు. కాని, సదహ్మ వాటికంటే విలక్షణము.
ఓ పరీక్షిన్మహారాజా! జాగ్రత్స్వప్నసుషుప్తులనే అవస్థలు బుద్ధికి మాత్రమేనని మహాత్ములు చెప్పుచున్నారు. ఈ నానాత్వము (అవస్థా భేదము, జగత్తు) వ్యక్తీకు అంతరతమమగు పరమాత్మయందు అజ్ఞానము చే కల్పించబడినది మాత్రమే (ఆత్మ మాత్రమే సత్యము, జగత్తు మిథ్య.
ఆకాశమునందు మేఘములు ఒక కాలములో వచ్చి మరియొక కాలము లో అంతర్ధానమగును. అదే విధముగా అనేకముల కలయిక, కార్యము అగు ఈ జగత్తు అధిష్టానమగు బ్రహ్మయందు ఒక కాలములో ప్రకటమై, మరియొక కాలములో విలీనమగును (కావున, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా).
ఈ లోకములో అవయవములు గల సంఘాతములు సత్యము గావని, వాటి అవయవములే సత్యమని చెప్పబడినది. ఏలయనగా, సంఘాతము (కార్యము) లేకుండా అవయవములు తెలియబడుచున్నవి. కాని, అవయవములు (కారణము) లేకుండా సంఘాతములు లేవు. ఉదాహరణకు, దారములు లేకుండా వస్త్రము లేదు. కాని, వస్త్రము లేకున్నా దారములు గలవు.
లోకములో సామాన్యవిశేషభావము (మట్టి సామాన్యము, కుండ విశేషము) గలదు. అదియే కారణకార్యభావముగా స్వీకరించబడును. వాటియందు భేదమును, వస్తుత్వమును జనులు భావించెదరు. అదంతా భ్రమ. ఎందుకంటే, సామాన్యవిశేషములు (కారణకార్యములు) అన్యోన్యాశ్రయములు. అంటే, ఒకటి ఉన్నప్పుడే మరియొకటి ఉండును. అంటే, అవి సాపేక్షములే గాని నిరపేక్షములైన యథార్థతత్త్వములు గావు. పుట్టి గిట్టే సర్వము ఏది గలదో, అది యథార్థము కాదు (మిథ్యయే).
కార్యజగత్తు తెలియబడుచుండును (దృశ్యము). అయినప్పటికీ, వ్యక్తికి అంతరతమమగు ఆత్మ చైతన్యము లేకుండా జగత్తు ఉన్నదని అణుమాత్రమైననూ నీరూపీంచ శక్యము కానిది. ఆత్మనిరపేక్షముగా జగత్తు ఉన్నదన్నచో, అట్టి జగత్తు ఆత్మవలె స్వయంప్రకాశము కావలసి వచ్చును (కాని, అట్లు లేదు). లేదా, జగత్తు స్వయంప్రకాశమై స్వయం ప్రకాశమగు ఆత్మకంటే అభిన్నమే యగును (అద్వయమే సత్యము).
సత్యవస్తువు (పరమాత్మ) నందు అనేకత్వము (జీవేశ్వరభేదము ఇత్యాది) లేదు. కాని, అజ్ఞానులు ఏకమునందు అనేకమును చూచెదరు. ఉదాహరణకు, ఆకాశము ఒక్కటే అయినా, ఘటాకాశమరొకాశాది భేదమును, తేజస్సు ఒక్కటే అయినా చిన్న- పెద్ద తేజస్సులను, గాలి ఒక్కటే అయినా శరీరము లోపలి గాలి, బయట గాలి అనే భేదమును జనులు అజ్ఞానముచే స్వీకరించెదరు.
జనులు ఒకే బంగారమును పలు రూపములుగా మలచి అనేకముగా తెలియుచుందురు. అదే విధముగా, జనులు ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరము కాని శ్రీహరి భగవానునియందు ఘటపటాది లౌకికనామము లను, ఇంద్రవరుణాది వైదికనామములను ఆరోపించి వర్ణించుచున్నారు.
సూర్యుని వలన పుట్టి సూర్యునిచే ప్రకాశింపజేయబడే మేఘము సూర్యుని అంశయైన (సూర్యుడు అధిష్ఠానదేవతగా గల) చూపును కప్పి వేయును. ఇదే విధముగా, అహంవృత్తి పరబ్రహ్మనుండి ఆవిర్భవించి, పరబ్రహ్మచే ప్రకాశింపజేయబడి, పరబ్రహ్మయొక్క అంశయైన జీవుని స్వరూపసాక్షాత్కారమునకు ఆటంకము అగుచున్నది.
సూర్యుని వలన పుట్టిన మేఘము చెల్లాచెదరు కాగానే కన్ను తనకు అనుగ్రాహకమగు సూర్యదేవతను దర్శించును. ఇదే విధముగా, ఆత్మస్వరూపమును కప్పివేసే అహంకారము ఆత్మవిచారముచే వీనష్టమైనప్పుడు, నిశ్చయముగా ఆత్మసాక్షాత్కారము కలుగును.
ఓ పరీక్షిన్మహారాజా! అజ్ఞానరూపమైన అహంకారమే ఆత్మస్వరూప మును కప్పివేయును. ఎప్పుడైతే సాధకుడీ విధముగా ఈ ఆత్మానాత్మ వివేకమనే ఆయుధముతో ఆ బంధమును ఛేదించునో, అప్పుడా జ్ఞాని పరిపూర్ణ మైన ఆత్మానుభవము కలిగి పరబ్రహ్మరూపుడై నిలిచి యుండును. అదియే ఆత్యంతిక ప్రళయమని మహాత్ములు చెప్పెదరు.
అంతశ్శత్రువులను తపింపజేయు ఓ పరీక్షిన్మహారాజా! బ్రహ్మదేవుడు మొదలుగా గల సకలప్రాణులు ఎల్లవేళలా పుట్టి గిట్టుచునే యుండునని సూక్ష్మ మైన పరిజ్ఞానము గల కొందరు చెప్పుచున్నారు.
పరిణామము చెందే పదార్థములయొక్క ఆయా అవస్థలను బట్టి సర్వకాలములయందు అవి పుట్టి గిట్టుచున్నవని తెలియుచుండును. కాలప్రవాహముయొక్క వేగముచే లాగుకొనిపోబడుచున్న దేహాదుల బాల్యాద్యవస్థలను బట్టి అవి నిత్యము పుట్టి గిట్టుచున్నవని స్పష్టమే.
ఆకాశములోని జ్యోతిర్మండలములు నిరంతరముగా కదులుతున్నా స్థిరముగా ఉన్నట్లు కన్పట్టును. అదే విధముగా, ఆద్యంతములు లేని ఈశ్వరరూపమైన కాలముచే దేహాదులయందు కలిగే అవస్థలు కానరావు. దేహాదులయందు సర్వదా ఉత్పత్తి ప్రళయములు కలుగుచునే యున్నవి.
నిత్య-నైమిత్తికి-ప్రాకృతిక-ఆత్యంతిక ప్రళయములను గురించి చేప్పితిని. కాలము యొక్క గతి యిట్టిది.
కురువంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! జగత్తును సృష్టించిన నారాయణుడు సకలప్రాణులకు ఆశ్రయము. ఆయనయొక్క లీలలకు చెందిన ఈ గాథలను నేను నీకు సంక్షేపముగా చెప్పితిని. సమగ్రముగా చెప్పుటకు స్వయంభువుడగు బ్రహ్మదేవుడైననూ సమర్థుడు కాడు.
మానవుడు పలు రకముల దుఃఖములనే కార్చిచ్చుచే పీడించబడుచున్నాడు. అట్టి మానవుడు సంసారమనే సముద్రమును దాట గోరినచో, పురుషోత్తమ భగవానుని లీలల గాథలు అనే రసమును సేవించవలెను. సుతరాము దాట శక్యము కాని సంసారసముద్రమును దాటుటకు అంతకు మించి మరియొక పడవ (సాధనము) ఉండదు.
ప్రాచీనగాథల సంకలనమైన ఈ భాగవతపురాణమును పూర్వము సనాతనుడైన నారాయణ మహర్షి నారదుని కొరకు, ఆయన వ్యాస మహర్షి కొరకు చెప్పెను.
ఓ పరీక్షిన్మహారాజా! పూజనీయుడగు ఆ వ్యాస మహర్షి నా యెడల ప్రీతి జెంది, వేదములతో సమానమైన ఈ భాగవతసంహితను నాకు ఉపదేశించెను.
కురువంశీయులలో శ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! నైమిషారణ్యస్థానములో దీర్ఘకాలము సత్రయాగము జరుగును. అప్పుడు అక్కడ , శౌనకుడు మొదలైన మహర్షులు సాదరముగా ప్రశ్నించగా, ఈ సూతమహర్షి ఈ పురాణమును ఉపదేశించగలడు.
శ్రీమద్బాగవత మహాపురాణము పన్నెండవ స్కంధములో చతుర్విధ ప్రళయములను వర్ణించే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).
Summary of chapter 4 of the Bhāgavata Mahā Purana is as follows:
Śrī Śukadeva Gosvāmī provides a comprehensive Vaidika exposition on the nature of universal time and cosmic dissolution, categorizing *Pralaya* into four distinct levels: Nitya (continuous, moment-by-moment physical decay of bodies and matter); Naimittika (periodic dissolution occurring at the end of a single day of Lord Brahmā, when the lower worlds are submerged in waters during his night); Prākṛtika (elemental dissolution occurring at the end of Brahmā's 100-year lifespan, when all gross and subtle elements collapse in reverse order into unmanifest Prakṛti and merge into Mahā-Vishṇu); and Ātyantika (absolute liberation, wherein an individual Ātmā cuts through the knot of false ego through spiritual wisdom and achieves permanent, unalloyed residence in the spiritual world).