భాగవత మహా పురాణము
22 - దేవహూతి కర్దముల వివాహము
మైత్రేయ ఉవాచ :
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- కర్దమ మహర్షి ఈ విధముగా మను చక్రవర్తియొక్క సకల గుణముల మరియు కర్మల ఉత్కర్షను వర్ణించి విరమించెను. అపుడా మనువు సిగ్గు పడుతున్నట్లుగా ఆయనతో నిట్లనెను.
మనురువాచ :
వేదమూర్తియగు బ్రహ్మగారు తన వేదవిగ్రహమును లోకములో ప్రవర్తిల్లజేయాలనే కోరికతో, తపస్సు విద్య మరియు యోగములతో కూడిన మిమ్ములను తన ముఖమునుండి సృష్టించెను. మీకు భోగములయందు ఆసక్తి లేదు.
అనంతములగు పాదములు గల విరాట్ పురుషుడు బ్రాహ్మణు లను రక్షించుట కొరకై తన అనంతములగు భుజములనుండి క్షత్రియులను సృష్టించెను. ఆ విరాట్ పురుషునకు బ్రాహ్మణుడు హృదయమనియు, క్షత్రియుడు భుజమనియు మహర్షులు చెప్పుచున్నారు గదా!
కావుననే, బ్రాహ్మణుడు క్షత్రియుడు తనను తాను రక్షించుకొను టయే గాక, ఒకరిని మరియొకరు కూడ రక్షించెదరు. వాస్తవములో అవినా శి, కార్యకారణరూపుడు అగు ఆ శ్రీహరియే అందరినీ రక్షించుచున్నాడు.
నిన్ను చూచినంతనే నా సందేహములన్నియు తొలగిపోయినవి. ఏలయనగా, ప్రజలను రక్షించగోరే నాకు పూజ్యుడవగు నీవు స్వయముగా రాజధర్మములను వర్ణించి చెప్పితివి.
మనోజయము లేనివారికి నీవు కానరావు. దైవవశముచే నీవు నాకు కనబడితివి. నేను దైవవశముచే పూజ్యుడవగు నీ మంగళకరమగు పాదధూ ళిని తలపై దాల్చితిని.
దైవవశముచే నీవు గొప్ప అనుగ్రహమును చూపి నాకు ధర్మ మును ఉపదేశించితివి. నేను దైవవశముచే చెవులను అప్పజెప్పి నీ మనో హరములగు మాటలను వింటిని.
ఓ మహర్షీ! అట్టి నీవు దీనుడనగు నా విన్నపమును దయతో వినద గుదువు. కుమార్తెయందలి ప్రేమచే నా మనస్సు వ్యాకులమై యున్నది.
ఈమె నా కుమార్తె; ప్రియవ్రత ఉత్తానపాదులకు సోదరి. ఈమె వయస్సు శీలము గుణములు మొదలగు వాటిలో తనకు తగిన భర్తను పొందగోరుచున్నది.
నీ శీలము విద్య రూపము వయస్సు గుణములను గురించి ఈమె నారదుని వద్ద విన్నప్పటినుండియు, నిన్నే భర్తగా పొందాలనే నిశ్చయ మును చేసుకున్నది. .
ఓ బ్రాహ్మణ శ్రేష్టా! నీకు గృహస్థాశ్రమ కర్మలయందు ఈమె అన్ని విధములుగా యోగ్యురాలు. నేనీమేను నీకు శ్రద్ధతో సమర్పించుచున్నాను. కావున, ఈమెను నీవు స్వీకరించుము.
తనంత తానుగా సంప్రాప్తమైన భోగమును నిరాకరించుట విరక్తున - కైననూ శోభనీయదు. భోగములయందు ప్రీతి గలవానికి అట్లు చేయుట మంచిది కాదని వేరుగా చెప్పవలయునా?
ఎవడైతే తనంత తానుగా సంప్రాప్తమై, భోగమును కాదని తరు వాత లుబ్దుని యాచించునో, వాని ఉజ్జ్వలమగు కీర్తి నశించును; అవమాన ముచే వాని అభిమానము వినష్టమగును.
ఓ విద్వాంసుడా! నీవు వివాహమునకు ప్రయత్నము చేయుచు న్నావని నేను వినియుంటిని. అనగా, నీవు బ్రహ్మచర్యమును విడిచి పెట్టి గృహాశ్రమములోనికి అడుగు పెట్టబోవుచున్నావు. కావుననే, నా కుమార్తెను నీకిచ్చి వివాహమును చేసెదను; స్వీకరించుము.
ఋషిరువాచ ।
కర్దమ మహర్షి ఇట్లు పలికెను --- నిజమే; నేను వివాహమును చేసుకోవాలనే అనుకుంటున్నాను. మీ అమ్మాయికి మరియొకనితో వివా హము నిశ్చయము కాలేదు గనుక, మా యిద్దరి ఈ వివాహము యోగ్య ముగా నుండును. వివాహములలో బ్రాహ్మ వివాహము (పెద్దలు నిశ్చయించిన పెళ్లి) మొదటిది, శ్రేష్టమైనది.
ఓ మహారాజా! ఈ నీ కుమార్తె వేదములో ప్రసిద్ధమైన విధానములో వివాహమాడవలెనని కోరుచున్నది. నీవు కూడ అటులనే కోరుచున్నావు. ఆ కోరిక తీరుగాక! నీ కుమార్తె తన శోభతో లక్ష్మీదేవిని మించి యున్నది. ఆమెను వివాహమాడుటకు ఎవడు కాదనును?
ఈమె ప్రాసాదమునకు పైభాగమునందు బంతిని ఆడుచుండెను. ఆమె పాదములు నూపురముల ధ్వనితో గూడి శోభిల్లెను. ఆమె చూపులు బంతి వెనుక పరుగెడుతూ చాల వ్యాకులముగా నుండెను. ఆకాశములో విమానమునుండి గంధర్వుడు అట్టి ఈమె సౌందర్యమును చూచి సమ్మోహితుడై, స్పృహ తప్పి క్రింద బడెను.
స్త్రీలకే అలంకారమనదగిన ఈమెను లక్ష్మీదేవి పాదములనారా ధించనివారు కనలేరు. మనువుయొక్క ముద్దుల పట్టీ, ఉత్తానపాదుని సోద రియగు ఈమే ఏరి కోరి స్వయముగా వచ్చినది. అట్టి ఈమెను తెలివైన వాడు ఎవడు అంగీకరించకుండును?
కావున, ఈ సాధ్విని నేను స్వీకరించెదను. కాని, ఒక నీయమము గలదు. నేను ఈమెతో సంతానము కలుగువరకు గృహాశ్రమమును నెరపెదను. తరువాత, సన్న్యాసమును స్వీకరించి ఆ ఆశ్రమధర్మములను పాటించే దను. హింసతో సంబంధము లేని ఆ శమదమాది ధర్మములను భగవా నుడే స్వయముగా ఉపదేశించెను.
అనేకభేదములతో కూడిన ఈ జగత్తు ఆ అనంత భగవానునినుండి ప్రకటమై, ఆయనయందే స్థితిని కలిగి, ఆయనయందే విలీనము కాగలదు. ప్రజాపతులకు కూడ ప్రభువగు ఈ భగవానుడే నాకీ విషయములో ప్రమా ణము. నేను ఆయన ఆదేశమును మాత్రమే పాటించుచున్నాను.
మైత్రేయ ఉవాచ :
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఓ విదురా! ఆ కర్దముడు ఇంతమాత్రమే పలికి మిన్నకుండి, పద్మనాభుని మనస్సులో ధ్యానించు చుండెను. చిరునవ్వుతో శోభిల్లే ఆయన ముఖము దేవహూతి హృదయ మును దోచివేసెను.
ఆ మనువు తన భార్యను, కుమార్తెను సంప్రదించి వారి స్పష్టం - మగు అంగీకారమును పొంది గొప్పగా ఆనందించేను. కర్దముడు సకలస ధుణములకు నిలయము. దేవహూతి కూడ అంతే, మనువు ఆమెను ఆయ నకిచ్చి వివాహమును జరిపించెను.
మహారాణియగు శతరూప ఆ కొత్త దంపతులకు మిక్కిలి విలువైన భూషణములను, వస్త్రములను, ఇంటి సామగ్రిని పెళ్లికానుకలుగాప్రేమతో ఇచ్చెను.
మను చక్రవర్తి కుమార్తెను యోగ్యుడగు వరునకిచ్చి వివాహమును చేసి నిశ్చింతగా నుండెను. కాని, విరహోత్కంఠచే వ్యాకులమైన మన స్సుతో ఆయన కుమార్తెను రెండు చేతులతో కౌగిలించుకొనెను.
మను చక్రవర్తి కుమార్తెయొక్క విరహమును సహించలేకపోయే ను. ఆయన అదే పనిగా కన్నీటిని విడుచుచుండెను. తల్లీ! అమ్మాయీ! అంటూ ఆయన ఆమె కేశములను తన కన్నీళ్లతో తడిపి వేసెను.
మను చక్రవర్తి ఆ మహర్షిని అడిగి సెలవు తీసుకొని తన భార్య, అనుచరులు వెంటరాగా రథముపై తన నగరమునకు బయలు దేరెను.
సరస్వతీనదిని మహర్షులు సేవించుచుందురు. దాని సుందరమగు రెండు తీరముల వెంబడి ప్రకృతిసంపదతో శోభిల్లే నివృత్తిపరాయణులగు మహర్షుల ఆశ్రమములు గలవు. మను చక్రవర్తి వాటి శోభను తిలకిస్తూ పయనించేను.
ఆ మహారాజు వచ్చుచున్నాడనే విషయము తెలిసి జనులు గొప్ప హర్షమును పొందినవారై, బ్రహ్మావర్తమునుండి గీతములు స్తోత్రములు వాద్యములతో ఆయనకు ఎదురేగిరి.
యస్య = యజ్ఞ వరాహమూర్తియొక్క, రోమాణీ = రోమములు, న్యపతన్ =పడినవో.
అన్ని సంపదలతో నిండిన బర్హిష్మతీ నగరము మనువుయొక్క ప్రసిద్ధమైన రాజధాని. యజ్ఞ వరాహమూర్తి తన శరీరమును విదల్చిన ప్పుడు ఆయన రోమములు అక్కడ పడినవి.
ఆ రోమములే అన్ని కాలములలో పచ్చగా ఉండే దర్బలు, రెల్లు ఆయెను. మహర్షులు వాటితో యజ్ఞమునకు విఘ్నమును కలిగించే రాక్షసు లను తరిమికొట్టి యజ్ఞమును చేసి, శ్రీహరిని ఆరాధించిరి.
పూజ్యుడగు మనుచక్రవర్తి వరాహ భగవానునినుండి భూమి అనే నివాసస్థానమును పొంది, ఈ స్థానములో దర్భలు రెల్లుతో కూడిన ఆసన మును పరిచి, యజ్ఞపురుషుడగు శ్రీహరిని ఆరాధించెను.
ఆ స్థానమే బర్హిష్మతీ నగరము. దానియందే మనుప్రభువు అప్పటి నుండియు నివసించుచుండెను. ఇప్పుడు ఆయన ఆ నగరమును చేరుకో నీ, మూడు విధముల తాపమును పోగొట్టే తన భవనమును ప్రవేశించెను.
ఆ మనుచక్రవర్తి అచట తన భార్యతో పిల్లలతో గూడి ధర్మార్థమో క్షములకు విరోధము లేని విధముగా భోగములననుభవించెను. ఆయన సత్కీర్తిని అప్సరసలు, గంధర్వులు చక్కగా గానము చేసెడివారు. కాని, ఆయన ప్రాతఃకాలములయందు భక్తితో నిండిన హృదయముతో శ్రీహరి యొక్క గాథలను వినెడివాడు.
కావుననే, తన ఇచ్ఛచే భోగములను సృష్టించుటయందు నిపుణు డైననూ మననశీలుడగు స్వాయంభువ మనువు భగవత్పరాయణుడుగనే యుండెను. ఆయనను భోగములు కొంచెమైననూ చలింప జేయుటకు సమర్థములు కాలేదు.
ఆయన శ్రీహరియొక్క గాథలను వింటూ, చెప్తూ, శ్రీహరినే ధ్యాని సూ, శ్రీహరిని సేవిస్తూ ఉండెడివాడు. ఈ విధముగా ఆయన మన్వంతరములోని జాములు అన్నీ ఆయనకు సఫలములే అయినవి.
ఆ మనువు ఈ విధముగా వాసుదేవుని ప్రసంగముచే జాగ్రత్తు స్వప్నము సుషుప్తి అనే మూడు అవస్థలను, ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదై వికములనే మూడు తాపములను జయించి, సత్త్వరజస్తమోగుణములకు అతీతమైన స్థితిని పొందెను. ఆయన ఈ విధముగా తన మన్వంతర కాల మగు డెబ్బది ఒక్క మహాయుగములను గడిపివేసెను.
వ్యాసపుత్రుడవగు ఓ విదురా! జ్వరము మొదలగునవి శరీరము నకు చెందిన క్లేశములు. శోకము మొదలగు క్లేశములు మానసికములు. అనావృష్టి మొదలగునవి ఆధిదైవిక క్లేశములు. ఒకప్పుడు శత్రువులు క్లేశ ములను కలిగించెదరు. పాము కాటు మొదలగునవి ఆధిభౌతిక క్లేశములు. ఇవి అన్నీ శ్రీహరిని శరణు జొచ్చినవానిని ఎట్లు బాధించును?
మనువు అన్ని వేళలా సకలప్రాణుల హితమును కోరేడివాడు. మునులు ప్రశ్నించగా, ఆయన సకలమానవులకు మరియు వర్ణములకు ఆశ్రమములకు సంబంధించిన అనేకవిధములైన ధర్మములను బోధించెను. ఈ ధర్మములు మానవులకు శుభమును కలిగించును.
మనువు మొట్టమొదటి చక్రవర్తి. అద్బుతమగు ఆయన చరిత్ర వర్ణించదగినది. దానిని నేను వర్ణించి చెప్పితిని. ఇప్పుడు ఆయన కుమార్తె యగు దేవహూతియొక్క మహత్త్వమును గురించి వినుము.
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో ఇరువది రెండవ అధ్యాయము ముగిసినది .
Summary of chapter 22 of the Bhāgavata Mahā Purana is as follows:
Svāyambhuva Manu arrives at Kardama Muni's hermitage along with Queen Shatarūpā and Princess Devahūti, offering his daughter's hand in marriage in accordance with divine providence. Kardama accepts Devahūti with the agreement that he will remain in household life until they have offspring, after which he will renounce the world for spiritual perfection, and the royal parents return home filled with joy after performing the sacred wedding rituals.