భాగవత మహా పురాణము
20 - బ్రహ్మగారి సృష్టిని వర్ణించుట
శౌనక ఉవాచ ।
శౌనక మహర్షి ఇట్లు పలికెను -- ఓ సూత మహర్షీ! స్వాయంభువ మనువు సకలప్రాణులకు ఆధారమగు భూమిని పొంది, తరువాతి కాలములో పుట్టబోయే ప్రాణుల సృష్టి కొరకు ఏ ఉపాయముల ననుష్ఠించెను?
గొప్ప భగవద్భక్తుడగు విదురుడు. శ్రీకృష్ణుని పరమప్రేమకు పాత్రుడగు మిత్రుడు. శ్రీకృష్ణుని విషయములో అపరాధమును చేసిన దుర్యోధనాదులను, వారిని సమర్థించిన అన్నగారగు ధృతరాష్ట్రుని ఆయన విడిచి పెట్టి వెళ్లిపోయెను.
ద్వైపాయన మహర్షి పుత్రుడగు విదురుడు గొప్పదనములో ఆయ నకు తీసిపోవువాడు కాదు. ఆయన సర్వప్రకారములుగా శ్రీకృష్ణుని శరణు జొచ్చి, ఆయన భక్తులను సేవించెడివాడు.
పుణ్యతీర్థములను సేవించుట వలన నశించిన దోషములు గల విదురుడు హరిద్వారములోనున్న, తత్త్వవేత్తలలో శ్రేష్ఠుడగు మైత్రేయ మహర్షిని సమీపించి ఏమి ప్రశ్నించెను?
ఓ సూతా! వారిద్దరు నిశ్చయముగా శ్రీహరి పాదపద్మములకు సంబంధించిన పవిత్రమగు గాథలను ప్రస్తావించియుందురు. ఆ గాథలు శ్రీహరి పాదపద్మములనుండి పుట్టిన గంగాజలముల వలె పాపములను కడిగివేయును.
కీర్తించదగిన గొప్ప లీలలు గల శ్రీహరియొక్క ఆ 'గాథలను మాకు వినిపించుము. నీకు మంగళమగు గాక! రసజ్ఞుడెవడు శ్రీహరి యొక్క లీలలు అనే అమృతమును త్రావుతూ తృప్తిని చెందును?
నైమిషారణ్యవాసులగు మహర్షులు ఈ విధముగా ప్రశ్నించగా, సూత మహర్షి తన మనస్సును భగవానునిపై నిలిపి, వినుడు అని వారితో ఇట్లు పలికెను.
సూత ఉవాచ :
సూత మహర్షి ఇట్లు పలికెను --- శ్రీహరి తన మాయాశక్తిచే వరా హరూపమును దాల్చి, భూమిని పాతాళమునుండి పైకి తీసి, హీరణ్యాక్షుని అవలీలగా సంహరించెను. ఈ లీలను విని భరతవంశీయుడగు విదురుడు హర్షించి, మైత్రేయ మహర్షితో నిట్లనెను.
విదుర ఉవాచ ।
విదురుడు ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! ప్రజాపతులకు తండ్రియగు బ్రహ్మగారు ప్రజల సృష్టిలో భాగముగా ప్రజాపతులను సృష్టించి, తరువాత దేనిని ఆరంభించెను? నీవు భగవద్విషయములను, పరోక్ష విషయములను కూడ తెలిసినవాడవు. నాకీ విషయమును చెప్పుము.
మరీచి మొదలగు మహర్షులు, స్వాయంభువ మనువు బ్రహ్మగారి ఆదేశముచే ఈ జగత్తును ఏ విధముగా సృష్టించిరి?
వారు భార్యలతో కూడి ఈ జగత్తును సృష్టించరా? లేక, స్వతంత్ర ముగనే సృష్టించరా? లేక, అందరు కలిసి సృష్టించారా?
మైత్రేయ ఉవాచ ।
జీవుల కర్మగతిని ఊహించుట శక్యము కాదు. ఆ కర్మగతి, ప్రకృతికి అధ్యక్షుడగు పురుషుడు, కాలము అనే మూడు హేతువులచే భగవానుని త్రిగుణాత్మికయగు మాయాశక్తియందు వైషమ్యము కలిగి మహత్తత్త్వము ప్రకటమయ్యెను.
భగవానుని ప్రేరణచే రజోగుణప్రధానమగు మహత్తునుండి సాత్త్విక రాజస తామస భేదముచే అహంకారము పుట్టెను. అదియే పంచ భూతములకు కారణము. దానినుండి అయిదు తన్మాత్రలు, అయిదు స్థూల భూతములు, అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియములు, అయిదైదు అధిష్టాన దేవతలు ప్రకటమయ్యెను.
అవి విడివిడిగా బ్రహ్మాండమును సృష్టించలేక పోయినవి. అవి భగ వంతుని శక్తిచే ఒకదానితో మరియొకటి కలిసి తేజోమయమగు అండమును సృష్టించినవి.
ఆ బ్రహ్మాండము ప్రళయసముద్రజలములలో సుమారు (నిండా) వేయి సంవత్సరములు నిశ్చేతనముగా పడియుండెను. అపుడు దాని యందు భగవానుడు ప్రవేశించెను.
ఆ భగవానుని నాభినుండి వేయి సూర్యులతో సమానమైన గొప్ప కాంతి గల పద్మము పుట్టెను. సకలప్రాణివర్గములకు నివాసస్థానమదియే. దానియందు సాక్షాత్తుగా బ్రహ్మగారు పుట్టిరి.
ప్రళయజలములలో శయనించే నారాయణుడు ప్రవేశించి ప్రేరేపించగా, బ్రహ్మగారు పూర్వకల్పములో తనచేతనే నిర్ధారించబడిన నామ రూపాత్మకమగు వ్యవస్థకు అనురూపముగా లోకములను నిర్మించెను.
ఆయన ముందుగా నీడ (అజ్ఞానము) నుండి తామిస్రము, అంధ తామిస్ము, తమస్సు, మోహము, మహాతమస్సు అనే అయిదు విభాగ ములు గల అవిద్యను సృష్టించేను.
తమస్సు (ఆజ్ఞానము) ప్రధానముగా గల ఆ దేహము ఆయనకు నచ్చక, దానిని విడిచి పెట్టెను. అదియే రాత్రి ఆయెను. ఆకలి దప్పికలు దానినుండియే పుట్టెను. దానిని యక్షులు, రాక్షసులు స్వీకరించిరి.
ఆ యక్షరాక్షసులు ఆకలి దప్పికల బాధకు తాళలేక, ఆ బ్రహ్మగారిని తినుటకై ఆయన వైపునకు పరుగు తీసిరి. ఈయనను రక్షించనక్కర లేదు; ఈయనను తినివేయుడు, అని వారు పలికిరి. కావుననే, వారు రాక్ష సులు (రక్షించని వారు), యక్షులు (తినివేయువారు) అయిరి.
బ్రహ్మగారు భయపడి వారితో నిట్లనెను: అరే యక్షరాక్షసులారా! మీరు నా సంతానము. నన్ను తినివేయకుడు; నన్ను రక్షించుడు.
బ్రహ్మగారు తన సాత్త్వికప్రకాశముచే విరాజిల్లుతూ దేవతలను సృష్టించెను. బ్రహ్మగారిచే విడిచి పెట్టబడిన ఆ ప్రకాశము పగలు ఆయెను. ఆ దేవతలు క్రీడిస్తూ ఆ పగలు రూపములోని ప్రకాశమును స్వీకరించిరి.
బ్రహ్మగారు నడుము భాగమునుండి మిక్కిలి భోగలాలసులగు అసురులను సృష్టించేను. వారు భోగలంపటులగుటచే భోగము కొరకై బ్రహ్మగారి దగ్గరకు వెళ్లిరి.
తరువాత ఆ బ్రహ్మ భగవానుడు ముందుగా వారిని చూచి నవ్వు కొనెను. కాని, వారు సిగ్గు లేకుండగా ఆయనను తరుముకొచ్చిరి. ఆపుడా యన కోపించి, భయపడి పారిపోయెను.
శ్రీహరి శరణాగతులకు వరములనిచ్చి, ఇడుములను బాపే దైవము. ఆయన భక్తులననుగ్రహించుట కొరకై వారి భావనకు తగ్గ రూపములో ప్రకటమగును. ఆ బ్రహ్మగారు అట్టి శ్రీహరి వద్దకు వెళ్లి ప్రార్థించెను.
ఓ పరమాత్మా! నీ ప్రేరణచే నేను ప్రాణులను సృష్టించితిని. ప్రభూ! కాని నాచేతనే సృష్టించబడిన పాపులగు వీరు నన్ను భోగించుటకు తరుముకొచ్చుచున్నారు. నన్ను కాపాడుము.
కష్టములలోనున్న వారి కష్టములను పోగొట్టువాడవు నీవు ఒక్కడివే. నీ పాదములను ఆశ్రయించని ప్రాణులకు వారి కర్మలకనురూపముగా దుఃఖమును కలిగించువాడవు నీవు ఒక్కడివే.
శ్రీహరికి ఇతరుల మనస్సు కరతలామలకము. ఆయనకు బ్రహ్మ గారి దైన్యము స్పష్టముగా తెలిసేను. కామముచే కలుషితమైన ఈ దేహ మును విడువుము అని ఆయన చెప్పగా, బ్రహ్మ అటులనే చేసెను.
ఓ విదురా! బ్రహ్మగారు విడిచిన దేహము ఒక స్త్రీమూర్తి ఆయేను. మత్తుతో నిండిన చంచలమగు కన్నులు గల ఆమె పద్మములవంటి పాదములతో నడుచుచుండగా, కాలి అందెలు గణగణలాడుచుండెను. ఆమె నడుము చుట్టూ చీరను కట్టి దానిని ప్రకాశించే మొలనూలు సరములతో అలంకరించెను. ఒకదానితో మరియొకటి ఒత్తుకొని ఎత్తైన అంతరము లేని స్తనములు గల ఆమె ప్రేమతో నిండిన చిరునవ్వుతో విలాసగా చూచు చుండెను. చక్కని ముక్కు మంచి పలు వరుసలు గల ఆమె సిగ్గు వలన చీర చెరగుతో తనను తాను కప్పుకొనుచుండెను. దట్టని నల్లని కురులు గల ఆమెను చూచి అసురులందరు పూర్తిగా మోహమును పొందిరి.
ఏమి ఈమె రూపము! అహో! ఏమి ధైర్యము! ఆహా! ఈమెది అద్బుతమైన యౌవనము! కామించే మన మధ్యలో ఈమె కామన లేని దానివలె సంచరించుచున్నది.
సంధ్యాకాలమే ఆ విధముగా స్త్రీరూపమును దాల్చియుండెను. దుష్టబుద్ది గల ఆ అసురులు ఆమెను గురించి పలురకముల ఊహలను చేసిరి. వారామెను చక్కగా మర్యాద చేసి, చనువుతో ఇట్లు ప్రశ్నించిరి.
ఓ సుందరీ! నీవు ఎవరివి? ఎవరి దానవు? ఇక్కడ నీకు పని యేమి? ఓ భామామణీ! నీవు నీ రూపము అనే అమూల్యమగు వస్తువుతో అభాగ్యులమగు మమ్ములను విశేషముగా బాధించుచున్నావు.
ఓ అబలా! నీవు ఎవరివి అయిననూ అగుగాక! మాకు నీ దర్శ నము భాగ్యముచే కలిగినది. నీవు బంతిని ఆడుతూ నిన్ను చూస్తూ ఉన్న మా మనస్సులను కలిచి వేయుచున్నావు.
ఓ సుందరీ! పైకి ఎగురుతున్న బంతిని నీవు అరచేతితో కొట్టుచుం డగా, నీ పద్మములవంటి పాదములు ఒకచోట నిలబడుట లేదు. విశాల మగు స్తనముల భారము వలన నీ కృశించియున్న నడుము భయపడుచు న్నదా యన్నట్లు ఉన్నది. స్వచ్చమగు నీ దృష్టి సొలసినట్లు కానవచ్చుచు న్నది. నీ కేశపాశము అందముగా నున్నది.
సాయంకాల సంధ్య ఆ విధమగు రూపమును దాల్చి, వారిని ప్రలోభ పెట్టెను. ఆమే వాస్తవముగా యువతియని భావించి మోహితులైన అసురులు ఆమెను పట్టుకొనిరి.
బ్రహ్మ భగవానుడు గంభీరమగు భావము కలుగునట్లుగా నవ్వి, సౌందర్యముతో ప్రకాశించే తన మూర్తితో గంధర్వులు మరియు అప్సరసల గణములను సృష్టించేను. ఆయన మూర్తి తన సౌందర్యమును తానే ఆస్వా దించుచున్నదో యన్నట్లుండెను.
బ్రహ్మగారు సౌందర్యముతో కూడిన ఆ శరీరమును కూడ విడిచి పెట్టెను. అదియే వెన్నెల ఆయెను. దానిని విశ్వావసువు మొదలగు గంధ ర్వులు ప్రీతితో స్వీకరించిరి.
బ్రహ్మ భగవానుడు తన మందత్వమునుండి భూతపిశాచములను సృష్టించేను. అవి దిగంబరముగా జుట్టు విరబోసుకొనియుండగా చూచి, ఆయన కళ్లను మూసుకొనెను.
జగత్ప్రభువగు బ్రహ్మగారు ఆవులింతను విడిచి పెట్టెను. ఆ ఆవులింత అనే శరీరమును భూతములు పిశాచములు గ్రహించినవి. అదియే ప్రాణులలో ఇంద్రియములు వివశమయ్యే నిద్రారూపముగా ప్రకటమగుచున్నది. జనులు అపవిత్రులై యున్నప్పుడు భూతాదులు వారిని ఆవేశించి మోహితులను చేయును. దానికి ఉన్మాదమని పేరు. అది కూడ బ్రహ్మ గారు విడిచి పెట్టిన మందత్వరూపమగు శరీరముయొక్క ధర్మమే.
పూజ్యుడగు బ్రహ్మ తాను బలవంతుడనని భావన' చేసి తన అదృ శ్యరూపము ద్వారా సాధ్యగణములను, పితృగణములను సృష్టించెను.
ఆ పితృదేవతలు తమకు జన్మనిచ్చిన ఆ అదృశ్యరూపమును స్వీకరించిరి. విద్వాంసులు దానిని నిమిత్తముగా చేసుకొనియే, సాధ్యులకు పితృదేవతలకు శ్రాద్ధాదికర్మలలో హవ్యకవ్యములను సమర్పించెదరు.
ఆ బ్రహ్మగారు తన అంతర్దానశక్తిచే సిద్దులను, విద్యాధరులను సృష్టించి, అద్భుతమగు ఆ అంతర్ధానశక్తిని వారికి ఇచ్చెను.
జగతభువగు ఆ బ్రహ్మ తన ప్రతిబింబమును చూచి, దానిని తానే మెచ్చుకొని, దానిచే కిన్నరులను, కింపురుషులను సృష్టించెను.
బ్రహ్మగారు విడిచి పెట్టిన ఆ ప్రతిబింబరూపమును కిన్నర కింపురుషులు స్వీకరించిరి. కావుననే, వారు ప్రాతఃకాలమునందు స్త్రీపురుషుల జంటలుగా ఏర్పడి, బ్రహ్మగారి చేష్టలను గానము చేయుచుందురు.
సృష్టి విస్తారమును చెందని కారణముగా పలువిధములుగా చింతిస్తూ బ్రహ్మగారు కాళ్లను చాచుకొని పరుండెను. ఇంతలో, ఆయనకు కోపము వచ్చి ఆ దేహమును విడిచి పెట్టెనట.
ఓ విదురా! ఆ దేహమునుండి కేశములు జారిపడి పాములు పుట్టెను. కాళ్లను చేతులను చాపుతూ కదులుతున్న దేహమునుండి క్రూరస్వభావము గల విషసర్పములు, పడగచే విస్తరించిన మెడలు గల త్రాచుపా ములు పుట్టెను.
స్వయంభువుడగు బ్రహ్మగారు, తాను కృతార్థుడనైనానని తలపో సి, అప్పుడు ఆఖరున మనస్సుతో ప్రాణులను వర్ధిల్లజేసి లోకములను పాలించే మనువులను సృష్టించెను.
బుద్దిశక్తిప్రధానుడగు బ్రహ్మ పురుషాకారములోనున్న తన దేహ మును మనువులకు విడిచి పెట్టెను. మనువులకంటే ముందే సృష్టించబడిన దేవతలు మొదలగు వారు మనువులను చూచి బ్రహ్మగారిని కొనియాడిరి.
జగత్తును సృష్టించిన ఓ బ్రహ్మా! నీవు చేసిన ఈ సృష్టి చాల బాగు న్నది! దీనిని ఆశ్రయించి యజ్ఞాది కర్మలు ఉన్నవి. వాటి వలన మేము హవి ర్బాగములను భోగించెదము.
ఇంద్రియ విజేత, మొదటి ఋషి అగు బ్రహ్మగారు తపస్సు, జ్ఞానము, ఉపాసన, చిత్తైకాగ్రతతో కూడిన యోగము అనువాటితో కూడినవాడై తనకు ప్రియమైన సంతానమగు మహర్షులను సృష్టించేను.
బ్రహ్మ సమాధియోగమును, అణిమాది సిద్దులను, తపస్సును, ఉపాసనను, వైరాగ్యమును, జ్ఞానమును ఆ ఉపాధితో కలిగియుండెను. ఆయన ఆ ఉపాధియొక్క ఒక్కొక్క అంశమును ఆ మహర్షులకు ఇచ్చెను.
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో ఇరువదియవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 20 of the Bhāgavata Mahā Purana is as follows:
Continuing his narration, Maitreya describes how Lord Brahmā proceeded with the further creation of various species of living beings, including demons, spirits, demigods, and human beings, assigning each their body and nature. Maitreya explains how Brahmā gave up several subtle bodies during this process, which transformed into twilight, night, moonlight, and day, demonstrating the vast spectrum of living forms that populate the cosmic structure.