10 - జడభరతుని రహూగణుడు అవమానించుట

శ్రీశుక ఉవాచ

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- తరువాత ఒకనాడు సింధుసౌవీరదేశములకు ప్రభువగు రహూగణుడు ఇక్షుమతీ నదీతీరమున పల్లకీలో వెళ్లుచుండెను. పల్లకీ మోతగాండ్ర నాయకుడు పల్లకీని మోసే ఒక మనిషి కొరకు వెదుకుచుండెను. గొప్ప బ్రాహ్మణుడగు జడభరతుడు విధివిధానముచే ఆతని కంట బడెను. ఈ యువకుడు కుదురైన అవయవములతో దిట్టముగా నున్నాడనియు, ఎద్దువలె గాడిదవలే బరువును మోయగలడనియు, ఆతడు ఈయనను బలాత్కారముగా పల్లకీని మోసే పనికి కుదిర్చే ను. ఆ మహానుభావునకు పల్లకీని మోసే పని చేతకాదు, అయిననూ, అంతకు పూర్వమునుండి పల్లకీని మోయుచున్న కూలీలతో కలిసి ఆయన కూడ పల్లకీని మోసెను.

తన కాలి క్రింద ఏ ప్రాణియైననూ. నలిగిపోరాదనే భావనతో ఆ గొప్ప బ్రాహ్మణుడు తన ముందు మూరెడు నేలను చూచుకుంటూ నడచు చుండెను. దాని వలన పల్లకీని మోసే ఇతరవ్యక్తుల నడకకు ఈయన నడక సరిపడలేదు. అప్పటు అడ్డదిడ్డముగా ఊగుచున్న తన పల్లకిని చూచి రహూగణుడు మ్రోతగాండ్లతో నిట్లనెను --- ఓరీ, పల్లకీని మోసే మీరు సరిగా మేయుడు. పల్లకీ ఇటునటు ఊగుచుండుటకు కారణమేమి?

రాజు ఈ విధముగా నిందాపూర్వకముగా పలికిన మాటను విన్న ఆ వాహకులు రాజు తమను దండించునేమోయని భయపడి, ఆయనతో ఇట్లు విన్నవించుకొనిరి.

మహారాజా! మీ ఆజ్ఞను పాలించే మేము అజాగరూకులమై లేము. మేము సరిగానే మోయుచున్నాము. కాని, ఈతడు ఇప్పుడు మాత్రమే మోయుటకు నియుక్తుడైననూ, వేగముగా నడచుట లేదు. ఈతనితో కలిసి మోయుట. మా వలన కానే కాదు, అని వారు పలికిరి.

రజోగుణముచే వ్యాప్తమైన బుద్దిగల రహూగణ మహారాజు పెద్దలను సేవించినవాడే. కాని, ఈ సందర్భములో స్వభావమునకే పైచేయి కలుగుటచే, ఆయనలో కొంచెము కోపము పొడసూపినది. పల్లకీని మోసే వాహకులు దీనముగా చెప్పిన మాటను విని ఆయన, గుంపులో ఒక్కడు తప్పు చేసినా దాని చెడు ఫలితము గుంపులోని వారందరికీ సంక్రమించు నని నిశ్చయించుకొనెను. అప్పుడాయన నివురు గప్పిన నిప్పు వలె స్పష్టముగా ప్రకటము కాని బ్రహ్మవర్చస్సు గల జడభరతునితో నిట్లనెను.

అయ్యో! పాపము, చాల కష్టము వచ్చి పడినది! సోదరా! నీవు చాల అలసిపోయినావని స్పష్టముగా కనబడుచునే యున్నది! చాల దూరము నీవు ఒక్కడివే చాల సేపు మోసినావు! నీ ఇతరసహచరులు మోయనే లేదు! నీవు చాల బలిసి లేవు! నీకు దృఢమగు అవయవములు లేవు సుమా! మిత్రమా! నీవు ముసలితనముచే నీరసపడి యున్నావు! అంటూ రహూగణుడు జడభరతుని చాల వెటకారము చేసెను. అయిన నూ, ఆయన మౌనముగనే ఉండెను. మిథ్యాభూతమగు ఈ శరీరము సత్త్వ రజస్తమోగుణములనుండి పుట్టినది. ఇది పంచభూతముల కలయిక తయారైనది. అవిద్యయొక్క ప్రభావముచే జీవుడు దీనిని పొంది మరల కర్మలను చేయుచుండును. కాని, అది జడభరతునకు ఆఖరి శరీరము. పర బ్రహ్మస్వరూపుడై యున్న జడభరతునకు కేవలము విశిష్టమైన ఆకారము (నామరూపములు) మాత్రమే అయి ఉన్న శరీరమునందు, ఇది నేను అని గాని, ఇది నాది అని గాని, మిథ్యాభిమానము లేదు. కావుననే, ఆయన మౌనముగా పల్లకీని పూర్వమునందు వలెనే మోయుచుండెను.

తరువాత మరల పల్లకీ ఎగుడు దిగుడుగా ముందుకు సాగుచుండె ను. దానితో రహూగణుడు చాల కోపించి ఇట్లు పలికెను --- ఓరీ! ఇది యేమి? నీకు బ్రతికియుండగనే చావు మూడినది. ప్రభువునగు నన్ను తిరస్కరించి నా శాసనమును ఉల్లంఘించినావు. మృత్యుదండము చేతియందుండే యముడు జనులకు చేయు విధముగా, నేను చాల గర్వించియున్న నీకు చికిత్స శాస్తి చేసెదను. అప్పుడు మరల నీవు ఒళ్లు దగ్గర పెట్టుకొని మోసెదవు.

తాను రాజుననే అభిమానముతో రహూగణుడు ఈ విధముగా అనేకములైన అయోగ్యములగు మాటలను పలుకుచుండెను. రజస్తమోగుణముల ప్రభావముచే పేచ్చు పెరిగిన గర్వముతో ఆయన భగవానుని అనన్యభక్తుడగు జడభరతుని నిందించుచుండెను. తాను పండితుడనని మిడిసిపడే ఆయనకు మహాయోగుల చేష్టలను గురించి చెప్పుకోదగ్గ అవగాహన లేదు. పూజనీయుడు, బ్రాహ్మణుడు, పరబ్రహ్మస్వరూపుడు అగు ఆ జడభరతుడు తన హృదయములో సకలప్రాణుల హితమును మాత్రమే చింతిల్లు చుండును. లేశమైననూ, గర్వము లేని ఆయన చిరునవ్వుతో అట్టి రహూగణుని ఉద్దేశించి, ఇట్లు పలికెను.

బ్రాహ్మణ ఉవాచ

జడభరతుడిట్లు పలికెను --- ఓ వీరుడా! నీవు చెప్పినది సత్యమే. బరువును మోసేది దేహమే గాని, నేను కాదు. దారిలో నడిచి గమ్యమును చేరేది దేహమే గాని, నేను కాదు. కావున, నాకు శ్రమ లేదు అంటూ నీవు చేసిన ప్రసంగములో వెటకారమేమియు లేదు. బలిసి ఉన్నది కూడ పంచభూతముల ప్రోవు మాత్రమే. ఆత్మానాత్మవివేకము గలవారు ఈ తీరున మాటలాడరు.

ఓ రాజా! నీవు కొనియాడ దగినవాడవే. మార్పులను చెందుతూ ఉండే దేహము మొదలగు కార్యములకు పుట్టుక మరణములు అనివార్యములని మనకు అనుభవములో నున్నది. కావున, అట్టి దేహాదులు జీవించి యుండగనే మరణించినవానితో సమానమే. ప్రభువు, సేవకుడు అనే స్థితి స్థిరమైనచో, ప్రభువు ఆజ్ఞాపించుట మరియు సేవకుడు దానిని పాలించుట అనే స్థితి కూడ సమంజసముగ నుండును.(కాని ఇట్టి ప్రభు సేవకసంబంధము స్థిరమైనదని చెప్ప వలను పడదు).

రాజా! ప్రభువు, సేవకుడు అనే భేదబుద్ది లోకవ్యవహారమునందున్ననూ, వాస్తవములో అట్టి భేదమునకు అవకాశము లేశమైననూ మాకు కానరాదు. అట్టి స్థితిలో, ప్రభువు ఎవరు? సేవకుడు ఎవరు? సరే, కానిండు. మీకు నేనేమి చేయాలి? చెప్పండి, చేస్తాను.

ఓ వీరుడా! పిచ్చివాడు, మత్తెక్కినవాడు, జడుడు వలె ఉండే నేను ఆత్మనిష్ఠుడను. నాకు చికిత్సను చేయుట వలన ఏమి ప్రయోజనముండును? మత్తెక్కియున్న జడునకు శిక్షను వేయుట పిష్ట పేషణమే (వ్యర్థమే).

శ్రీశుక ఉవాచ

శాంతస్వభావము గల జడభరతుడు ఆత్మనిష్ఠులలో అగ్రేసరుడు. దేహమే ఆత్మ అనే ధోరణను కలిగించే అజ్ఞానము ఆయననుండి తొలగిపోయినది. రాజు చెప్పినదానికి సమాధానమునిచ్చుట కొరకు మాత్రమే ఆయన ఈ మాటలనైననూ పలికెను. ఆయన తన ప్రారబ్ధకర్మను క్షీణింపజేయువాడై రాజుగారి పల్లకిని పూర్వమునందు వలెనే మోయుచుండెను.

పాండువంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! సింధుసౌవీరదేశములకు ప్రభువగు రహూగణుడు సాత్త్వికమగు శ్రద్దతో చక్కగా ఆత్మతత్త్వమును విచారము చేసి, ఆత్మజ్ఞానమునకు యోగ్యతను సంపాదించినవాడే. గొప్ప బ్రాహ్మణుడగు జడభరతుడు హృదయములోని అజ్ఞానమనే ముడిని విప్పే మాటను పలికెను. అన్ని యోగశాస్త్రగ్రంథములలో చెప్పిన దానికి అనురూపముగా నున్న ఆ మాటను జాగ్రత్తగా విన్న వెంటనే, ఆయనకు తాను చక్రవర్తిననే గర్వము దూరమయ్యెను. ఆయన వెంటనే పల్లకీ దిగి, తన అపరాధమును క్షమించవలెననే కోరికతో, ఆ జడభరతుని పాద ములకు తలవంచి నమస్కరించి, ఇట్లు పలికెను.

రహస్యముగా తిరుగుచున్న నీవు ఎవరివి? బ్రాహ్మణుల జందేమును దాల్చియున్న నీవు అవధూతలలో ఒకరివా? నీవు ఎవరిపోడవు ? ఎక్కడివాడవు? ఇక్కడ ఏల ఉన్నావు? మా క్షేమము కొరకే ఉన్నావా? అటైనచో, నీవు సత్త్వమూర్తియగు కపిల భగవానుడవు కావు గదా?.

నేను దేవరాజగు ఇంద్రుని వజ్రమునకు గాని, ముక్కంటి శూలము నకు గాని, యముని మృత్యుదండమునకు గాని, అగ్ని సూర్యుడు చంద్రుడు వాయువు కుబేరుల అస్త్రములకు గాని భయపడను. కానీ, నేను బ్రాహ్మణులకు (బ్రహ్మవేత్తలకు) అవమానము జరుగునేమోయని చాల భయపడుచుందును.

ఓ మహాత్మా! సంసారాసక్తి లేని నీవు అవధులు లేని నీ జ్ఞానప్రభా వము బయట పడకుండా తిరుగుతున్నావు. కావున, నీవెవరివో చెప్పుము. జ్ఞానము (ఈశ్వరుని చేరే ఉపాయము) తో గూడియున్న నీ పలుకుల తత్త్వమును అరయుట మాకు ఊహలోనైననూ సంభవము కాదు.

సాక్షాత్తు శ్రీహరి జ్ఞానశక్తిచే కపిలునిగా అవతరించినాడు. ఆ యోగేశ్వరుడు ఆత్మతత్త్వమునెరింగి ఆత్మనిష్ఠులైయున్న మహాత్ములకు పరమగురువు. ఈ సంసారములో శరణు పొందదగినది యేది? అనే విషయమును ఆయనను అడిగి తెలుసుకొనుటకై నేను బయలు దేరినాను.

ఆ కపిల భగవానుడవు నీవేనా? లోకమును చూచుట కొరకై గుర్తు పట్టుటకు వీలు లేని విధముగా సంచరించుచున్నావా యేమి? అజ్ఞానముతో నిండిన బుద్ధి కలిగి లోకవ్యవహారములయందు ఆసక్తుడై యున్న నావంటివాడు యోగేశ్వరుల మహిమను ఎట్లు దర్శించగల్గును?

పని చేసినప్పుడు దేహమునకు (నాకు) శ్రమ కలుగుట అనుభవములోనున్నది. కావున, బరువును మోస్తూ నడిచినప్పుడు తమకు కూడ నిశ్చితముగా శ్రమ కలిగియుండునని నేను ఊహించుచున్నాను. ఈ వ్యావహారిక ప్రపంచము మనకు ఏ రూపములో అనుభవమునకు వచ్చునో, అదే రూపములో అది సత్యమేనని నా అభిప్రాయము. ఏలయనగా, కుండ మొదలగు పదార్దములు సత్యము కావన్నచో, వాటితో నీటిని తెచ్చుట మొదలగు పనులు సంభవము కాకూడదు.(కాని, సంభవమగుచున్నవి).

గిన్నెను నిప్పులపై పెట్టినప్పుడు గిన్నె వేడెక్కి, ఆ వేడి గిన్నెలోని నీటికి సంక్రమించును. ఆ నీటి వేడి వలన నీటిలోని బియ్యపు గింజల లోపల కూడ ఉడుకును. అదే విధముగా, ఆత్మ చైతన్యమునకు దేహము, ఇంద్రియములు, ప్రాణములు, అంతఃకరణములతో సంబంధము ఉన్నది. దాని వలన వాటి సుఖదుఃఖములు ఆత్మకు కూడ సంక్రమించును.

రాజు ప్రజలకు సేవకుడు. అట్టి రాజు దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించుట పిష్టపేషణము (వ్యర్థమగు పని) కాదు. ఇది నిశ్చయము. రాజు ఈ విధముగా తన ధర్మమును పాలించుట శ్రీహరిని ఆరాధించుటయే యగును. దాని వలన రాజునకు పాపముల సమూహమునుండి విముక్తి కలుగును.

            ఓ మహాత్మా! నేను చక్రవర్తిననే అభిమానముతో గర్వించి సత్పురుషులలో శ్రేష్ఠుడవగు నిన్ను తిరస్కరించితిని. నీవు దుఃఖితులకు బంధుడవు. కావున, నన్ను నీవు ప్రేమతో చూడదగును. నీవు అట్లు చూచినచో, సత్పురుషుని అవమానించిన పాపమునుండి నేను గట్టెక్కెదను.

నీవు సకలప్రాణులకు హితమును చింతించే మిత్రుడవు. దేహాభిమానమును విడిచి, సమచిత్తమును కలిగియుండుటచే, మానావమానములు నీలో వికారమును కలిగించవు. అయిననూ, మహాత్ములను అవమానించిన నావంటి వ్యక్తి, సాక్షాత్తుగా శూలపాణియగు రుద్రుడే అయిననూ, శీఘ్రముగా నాశమును పొందును గదా!

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి పంచమస్కంధములో జడభరతుని రహూగణుడు అవమానించుట అనే పదవ అధ్యాయము ముగిసినది (10).