భాగవత మహా పురాణము
8 - భరతుడు మృగమై జన్మించుట
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఒకనాడు భరతుడు ఆ గండకీ నదియందు స్నానమును చేసి, ప్రతిదినము తప్పక చేయదగిన సంధ్యావం దనాది నిత్యకర్మను పూర్తి చేసుకొనెను. అప్పుడాయన నది ఒడ్డున సుమారు రెండు గంటల కాలము ఓంకారమును జపిస్తూ కూర్చుండెను.
ఓ పరీక్షిన్మహారాజా! అపుడచట ఒక లేడి దప్పికతో ఒంటరిగా నది దగ్గరకు వచ్చెను.
ఆ లేడి చాల ఆసక్తితో నీటిని త్రాగుచుండగనే, ఇంతలో దగ్గరలోనే సింహము జనులకు భయమును గొల్పే పెద్ద నాదమును చేసెను. ఆ నాదము అంతటా ప్రతిధ్వనించెను.
లేడికి సహజముగనే కలవరపాటు ఎక్కువ. బెదిరే కన్నులు గల ఆ ఆడు లేడి హృదయము సింహము వలన భయముతో నిండి వ్యాకులమ య్యెను. దానికి ఇంకా దాహము తీరనేలేదు. అయిననూ, అది భయముతో ఇటునటు కంగారుగా చూస్తూ, ఒక్క ఉదుటున ఎగిరి గెంతు వేసెను.
ఆ లేడి గర్బిణి, అతిశయించిన భయముతో అది పైకి ఎగరగానే, దాని గర్భము జారి, బయటకు వచ్చి, నదీప్రవాహములో పడెను.
ఆ విధముగా పైకి ఎగురుట వలన ప్రసవము అగుటచే భయపడి యున్న ఆ ఆడులేడికి చాల ఖేదము కలిగెను. అప్పటికే తన గుంపునుండి విడిపోయిన ఆ లేడి ఒక పర్వతగుహలో నేలగూలి మరణించెను.
ఆ లేడిపిల్ల తల్లి మరణించగా గుంపుకు దూరమై దీనముగా నదీ ప్రవాహములో కొట్టుకొని పోతూ ఉండగా, రాజర్షియగు భరతుడు దానిని చూచెను. ఆయనకు దానిపై జాలి కలిగెను. ఆయన దానిని ఆత్మబంధువు వలె చేతిలోకి తీసుకొని, తన ఆశ్రమమునకు గొనిపోయెను.
ఈ లేడిపిల్ల పై ఆ భరతునకు, ఇది నాది అనే అతిశయించిన అభి మానము దృఢముగా ఏర్పడెను. ఆయనకు ప్రతి దినము దానికి ఆహార మును సమగూర్చుట, క్రూరమృగములనుండి రక్షణను కల్పించుట, దానిని లాలించుట, దానికి ప్రీతిని కలిగించుట అనే పనుల చింతయే ఉండే డిది. దానివలన, ఆయనలో అహింస మొదలగు యమములు, శౌచము మొదలగు నియమములు, ఈశ్వరపూజ మొదలగు నిత్యకర్మలు క్రమ ముగా ఒక్కటొక్కటిగా దూరము కాజొచ్చెను. కొన్ని రోజులు గడచునాటికి అవి అన్నీ కూడ ఆయనలో లుప్తమయ్యెను.
ఆశ్చర్యము! అయ్యో! వేగముగా పరిభ్రమించే కాలచక్రము దీన మగు ఈ లేడిపిల్లను తన గుంపులోని మిత్రులనుండి, బంధువులనుండి విడదీసి, నా వద్దకు చేర్చినది. ఇది నన్నే శరణుగా పొంది, నన్నే తల్లిదండ్రు లుగా, సోదరులు, బంధువులుగా, తన గుంపులోనివారుగా భావించుచు న్నది. దీనికి నేను తప్ప మరియొకరు తెలియదు. పైగా, దీనికి నాపై విశ్వా సము మెండు. కావుననే, నన్ను శరణు పొందిన దీనిని పెంచుటలోని ఇబ్బందులను సరకు చేయకుండా, నేను దీనిని పోషించి రక్షించి లాలించి, ప్రీతిని కలిగించవలెను. శరణు జొచ్చినవారిని ఉపేక్షించుట తప్పు అని నాకు తెలియును. కావున, ఇది నా కర్తవ్యము.
ఏలయనగా, శిష్టాచారసంపన్నులగు సాధుపురుషులు శాంతస్వ భావులై దీనులకు ఉపకారము చేయుదురు. వారు ఇట్టే పరోపకార సందర్భ ములో మిక్కిలి విలువైన స్వంత ప్రయోజనములను కూడ ప్రక్కన బెట్టెద రు. ఇది నిశ్చయము.
ఈ విధముగా లేడిపిల్లయందు భరతునకు ఆసక్తి కలిగి, ఆయన హృదయములో ప్రేమపాశము నిర్మాణమయ్యెను. కూర్చుండుట, పరుం డుట, తిరుగాడుట, నిలిచియుండుట, తినుట మొదలగు పనులను ఆయన ఆ లేడిపిల్లతో కలిసియే చేసెడివాడు.
దర్బలు, పుష్పములు, సమిధలు, ఆకులు, పళ్లు, దుంపలను మరియు నీటిని తెచ్చుకొనుటకై తాను అడవిలోనికి వెళ్లినప్పుడు, ఆ లేడిపి ల్లకు తోడేళ్లు, అడవి కుక్కలు మొదలగు వాటి వలన హాని కలుగునేమో యను ఆశంక ఆ భరతునకు ఉండెడిది. కావుననే, ఆయన ఆ లేడిపిల్లను వెంట బెట్టుకొని అడవిలోనికి వెళ్లాడివాడు.
మార్గమధ్యములో అక్కడక్కడ (బురద మొదలగు ప్రదేశములలో) ఆ లేడి తెలివి, అనుభవము లేకుండుటచే ఆగిపోయెడిది. అపుడు అతిశ యించిన ప్రేమతో నిండిన హృదయము గల ఆ భరతుడు దానిని భుజ ముపై పెట్టుకొని ప్రేమపారవశ్యముతో మోసెడివాడు. ఇంతే గాక, దానిని ఒడిలో, లేక గుండెలపై పెట్టుకొని, ముద్దాడుతూ మహానందమును పొందేడివాడు.
ఆ భరత మహారాజు ఏదో పనిలోనున్నప్పుడు ఆ పని మధ్యలో పలు పర్యాయములు లేని ఆ లేడి పిల్లను చూచును. అది సరిగానే ఉన్న దని గమనించిన తరువాతనే ఆయన మనస్సు కుదుటబడును. అట్టి సంద ర్భములలో ఆయన దానిని, ఓ పుత్రా! నీకు అన్ని వైపులనుండియు మంగ ళము కలుగుగాక! అని ఆశీర్వదిస్తూ, దాని క్షేమమును కోరుచుండును.
ఆ సందర్భములో ఆ లేడిపిల్ల కానరానిచో, ధనమును కోల్పో యిన లోభివలె, భరతుడు మనస్సులో చాల క్షోభపడెడివాడు. ఆయన దీన ముగా అతిశయించిన కంగారు పడెడివాడు. లేడిపిల్లయొక్క వియోగముచే ఆయన హృదయము స్వాధీనత తప్పి, చాల భేదముననుభవించెడిది. ఆయన ఆ లేడిపిల్ల గురించి మాత్రమే శోకిస్తూ, అధికమగు మోహమును పొంది, ఇట్లు పలికెడివాడ.
అయ్యో! దీనమగు ఆ లేడిపిల్ల తల్లి లేనిది. దుష్టుడనగు నా మనస్సు మోసపూరితము మరియు క్రూరము. నేను పుణ్యమును చేసిన వాడను కాను. మాయనెరుంగని ఆ లేడి పిల్ల నా ఈ దోషములను సరకు చేయకుండా, నాయందలి విశ్వాసముతో, సత్పురుషుడు వలె తిరిగివచ్చునా?
ఆ లేడిని దేవుడు రక్షించునా? అది క్షేమముగా తిరిగి వచ్చి, ఈ ఆశ్రమముయొక్క ఉద్యానములో లేతగడ్డిని మేయుచుండగా, నేను చూచే దనా?
తోడేలు గాని, కుక్క గాని, గుంపులో తిరిగే అడవి పంది వంటి మరియొక క్రూరమృగము గాని, ఒంటరిగా వేటాడే - పెద్దపులివంటి మృగము గాని, ఈ లేడిపిల్లను భక్షించుట లేదు గదా?
అయ్యో! సకలప్రాణుల క్షేమము కొరకు ఉదయించువాడు, వేద రూపుడు అగు సూర్యభగవానుడు అస్తమించుచున్నాడు. ఈ లేడి పిల్లను దాని తల్లి నావద్ద విడిచి పెట్టి మరణించినది. ఇది ఇంకనూ తిరిగి రాలేదు.
రాజకుమారునివంటి ఆ లేడి తిరిగి వచ్చి, తన అల్లర్లతో తనవాడ నగు నా దుఃఖమును తొలగించి నన్ను సుఖ పెట్టునా? నేను అంత పుణ్యము చేసుకోలేదు. అది చేసే అనేకరకముల లేడి పిల్లల ఆటలు అంద ముగా చూడ ముచ్చట గొల్పును.
నేను వినోదము కొరకై సమాధిని నటిస్తూ కళ్లను గట్టిగా మూసుకో నియుండగా, అది ప్రేమతో కోపమును నటిస్తూ, చాల భయపడుతూ నా దగ్గరకు వచ్చి, నన్ను కొమ్ము కొనతో పొడుచును. ఆ కొమ్ము నీటి - బిందువు వలె సున్నితమైనదే గాని, వాడియైనది కాదు.
నేను హవిస్సును పెట్టిన దర్భను అది పాడుచేయగా నేను కోపిం చెదను. అపుడు అది చాల భయమును పొంది, వెంటనే ఆటను మానివేసి కూర్చుండును. అప్పుడు అది ఆటలను విడిచి పెట్టి ఇంద్రియములను అన్నింటినీ నియంత్రించి కూర్చున్న ఋషికుమారుని బోలియుండును.
అరే! తపస్వినియగు ఈ భూమీ ఏమి తపస్సు చేసినదో గదా! ఏలయనగా, చక్కని ప్రవర్తనగల మగ లేడిపిల్లయొక్క మంగళకరములగు పాదముల గురుతులయొక్క వరుసలతో ఈ భూమి నాకు ఆ లేడి వెళ్లిన మార్గమును సూచించుచున్నది. ఆ లేడియొక్క చాల చిన్నవియగు గిట్టలు అందముగా, కోమలముగా నుండును. నాకున్న సంపద అంతా ఆ లేడిపిల్ల యే. ఆ సంపదకు దూరమై దీనుడనై యున్న నాకు ఈ గురుతుల వరు సలు నా సంపద ఉన్న స్థానమును చూపుచున్నవి. లేడి పాదముల గురుతు లతో ఈ నేల అంతటా మంగళమయమైనది. స్వర్గమును గాని, మోక్షమును గాని కోరే వేదవేత్తలు యజ్ఞములను చేయుటకు ఈ స్థానము తగియున్నది.
పూజనీయుడగు ఈ చంద్రుడు దీనజనుల యెడల ప్రేమ గలవా డు. సింహము వలని భయముతో తల్లి మరణించగా, నా ఆశ్రమమునకు చేరిన ఈ లేడి పిల్ల దారి తప్పి ఆశ్రమమునుండి దూరమైనది. దానిని ఈ నక్షత్రములకు ప్రభువగు చంద్రుడు దయతో రక్షించునా?
నేను మగ లేడి పిల్లను పుత్రునితో సమానముగా పెంచుకొంటిని. కాని, ఇప్పుడు ఆ లేడి పిల్లయొక్క వియోగమే కార్చిచ్చుయొక్క జ్వాలలు కాగా, మెట్టతామరపువ్వు వంటి నా హృదయము దుఃఖతాప ముతో ఉడికిపోవుచున్నది. అట్టి నాపై చంద్రుడు రెట్టించిన అనురాగము తో, తన బింబమునుండి నిరంతరముగా వెలువడే చల్లని శాంతమైన అమృ తపూర్ణమగు కిరణములతో అమృతపు జల్లు కురిపించునా? అని కూడ భర తుడు వాపోయెను.
భక్తియోగముననుష్ఠిస్తూ తపస్సు చేసుకొనే ఆ రాజర్షియగు భర తుని మనోరథము సిద్ధించలేదు. దానితో ఆయన హృదయము కల్లోలమయ్యెను. ప్రారబ్ధకర్మయే ఆ విధముగా లేడిపిల్ల రూపములో వచ్చి ఆయన ను యోగాభ్యాసమునుండి, భగవంతుని ఆరాధించే కర్మలనుండి జారిపో వునట్లు చేసినది. అట్లు గానిచో, పరమపురుషార్థమగు మోక్షమునకు సాక్షాత్తుగా ఆటంకములనే భావనతో పూర్వమే తన హృదయమునుండి పుట్టిన పుత్రులను కూడ విడిచి పెట్టిన ఆ భరతునకు మానవజాతికంటే భిన్నమైన పశుజాతికి చెందిన లేడిపిల్లయందు ఇంతటి ఆసక్తి ఏల కలుగవలెను? పుత్రులను విడిచి పెట్టుట ఎంతటివారికైననూ దుష్కరము గదా! ఈ విధ ముగా ఆ భరతుని యోగాభ్యాసము విఘ్నములచే వినష్టమయ్యెను. ఆయన ఆ లేడి పిల్లను పోషించుట, రక్షించుట, దానికి ప్రీతిని కలిగించుట, లాలించుట మొదలగు పనులను చేస్తూ, తన గురించి పట్టించుకొనలేదు. ఇంతలో ఎలుక కలుగులో ప్రవేశించే పాము వలె మరణసమయము వచ్చి పడెను. భయంకరమగు వేగము గల కాలమును అతిక్రమించుట ఎవ్వారికై ననూ శక్యము కాదు.
మరణించే వ్యక్తి తన ప్రక్కనే శోకిస్తూ ఉన్న పుత్రుని మీదనే మనస్సు పెట్టి మరణించును. అదే విధముగా భరతుని మనస్సు మరణించే సమయములో కూడ లేడిపిల్లయందు మాత్రమే తగుల్కొని యుండెను. అపుడాయన ఆ లేడితో బాటుగా దేహమును కూడ విడిచి పెట్టి, అజ్ఞాన ముతో మరణించే జనుల వలె, పశుశరీరమునే పొందెను. సాధారణముగా వ్యక్తి మరణించుట తోడనే పూర్వజన్మస్మృతి లుప్తమగును. కాని, లేడియై పుట్టిన భరతునకు మాత్రము పూర్వజన్మస్మరణము లుప్తము కాలేదు.
ఆ లేడి జన్మయందు ఆయనకు తాను లేడియే పుట్టుటకు గల కారణము స్పష్టముగా తెలియుచునే యుండెను. అది ఆయన పూర్వజ న్మలో చక్కగా చేసిన భగవదారాధనయొక్క మహిమయే. అట్టి స్మృతిచే మిక్కిలి తాపమును పొందియున్న ఆ భరతుడు తనలో ఇట్లు అనుకొనెను.
అయ్యో! కష్టము వచ్చినది. ధీరులై తపస్సును చేసే మునుల మార్గమునుండి నేను జారిపోయినాను. నేను ధైర్యముగా అన్ని ఆసక్తులను విడిచి పెట్టి, పవిత్రమగు అరణ్యమును ఆశ్రయించి ఏకాంతములో వాసుదేవ భగవానుని మహిమలను వింటూ, వాటిని మననము చేస్తూ, ఆ భగవానునే చక్కగా కీర్తిస్తూ, ఆరాధిస్తూ, ఆయన స్మరణమునందే పూర్తిగా పట్టుదలను కలిగియుంటిని. ఆ విధముగా కాలముయొక్క జాములనన్నింటినీ సార్థ కము చేసుకుంటూ, నేను మనస్సును ఏకాగ్రము చేసి, సకలప్రాణుల అంతఃకరణములో ఆత్మరూపముగా విరాజిల్లే భగవానునిపై స్థిరముగా నిలి పితిని. కాని, నాయందు వివేకము లేకుండుటచే, అట్టి నా మనస్సు దానికి విరుద్దముగా భగవానునకు పూర్తిగా దూరమై, లేడిపిల్ల వెంట పడి లక్ష్యము నుండి జారిపోయినదీ.
భరతుడు ఈ విధముగా ఉదయించిన తన వైరాగ్యమును దాచిపె ట్టి, తనను కన్న ఆడు లేడిని విడిచి పెట్టెను. అపుడాయన (లేడి రూపము లో) తాను పుట్టిన కాలంజర పర్వతమునుండి పులస్త్య పులహ మహర్షుల ఆశ్రమమునకు తిరిగి వచ్చెను. ఆ ఆశ్రమము శాలగ్రామము అనే భగవానుని క్షేత్రమునందు గలదు. శాంతస్వభావము గల మహర్షుల గుంపులకు ఆ క్షేత్రము చాల ప్రియమైనది.
ఆ ఆశ్రమములో కూడ లేడి రూపములో నున్న భరతుడు ఆత్మయే తోడు కాగా (ఒంటరిగా, ఆత్మనిష్ఠుడై) కాలమును ప్రతీక్షించుచుం డెను. ఇతరమృగములతో తనకు స్నేహము ఏర్పడునేమో యని ఆయన చాల భయపడెను. ఆయన ఎండు ఆకులను, గడ్డిని, కొమ్మల కొనలను మాత్రమే తింటూ ప్రాణములను నిలబెట్టుకొనెను. ఆయన తనకు లేడి జన్మ నిచ్చిన కర్మయొక్క అంతమును మాత్రమే పరిగణించెడివాడు. సమ యము రాగానే, ఆయన గండకీ నదియొక్క నీటిలో నిలబడి ప్రాణములను విడిచి పెట్టెను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి పంచమస్కంధములో భరతుడు లేడి జన్మను పొందుటను వర్ణించే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).
Summary of chapter 8 of the Bhāgavata Mahā Purana is as follows:
While engaged in intense austerities at Pulahāśrama, King Bharata developed a deep emotional attachment to a helpless newborn deer whose mother died jumping across a river. Gradually, Bharata became so absorbed in caring for the young deer that his spiritual practices were neglected. Because his mind was entirely focused on the deer at the moment of death, he was reborn in his next life in the physical body of a deer, demonstrating the subtle and unyielding laws of karma.