స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని బదరి క్షేత్ర మహాత్మ్యము

8వ అధ్యాయము

శివుడు చెప్పెను:- బ్రహ్మకుండమునకు దక్షిణమున నరుడు నివసించు పర్వతము కలదు. అచట స్వామి మనోహరమగు మేరు పర్వతమును ప్రతిష్ఠించెను.

స్కందుడు అడిగెను:- నరుని వద్ద స్వామి ఏల మేరు పర్వతమునుంచెను. తెలసికొనవలెనని గొప్ప కుతూహలము కలదు. కనుక చెప్పదలచినచో చెప్పుము.

            మహాదేవుడు చెప్పెను:- స్వామి బదరియందు నివసించుటచే దేవతలు, మహర్షులు, సిద్ధులు, విద్యాధరులు, చారణులు -3. మేరు శృంగములను వదలి స్వామిని చూచుటకై వచ్చిరి. తమనివాసములను వదలి పెట్టిరి- 4. అపుడు స్వామి వారి కొరకు మీరు శృంగములను పెరకి వాటిని ఇచట స్థాపించెను- 5. అపుడు బంగారముతో చేసిన ఆ పర్వత శిఖరములను చూచి అనామయుడగు స్వామిని ఇట్లు స్తుతించిరి.

దేవా ఊచు:

దేవతలు పలికిరి:- మాకు సుఖము కలిగించుటకు సంసారతాపము చల్లార్చుటకు వేరువేరు రూపములు ధరించి, మేరు శృంగములను ఇచటకు తెచ్చి, దానవులను ఆడచి దేవతలకు సహాయపడుచు ఉగ్రమగు తపస్సు చేయు ఓ స్వామీ నీకు నమస్కారము చేయుచున్నాము- 7. దీనుల ఆర్తి అను గడ్డివాముకు అగ్నివంటివాడవై దయచూపువాడా, నీవు చేసిన కర్మచే మాత్రమే సంతృప్తిని పొందుదువు - 8. ఉన్నతమగు బుద్ధికల మా వంటి వారలకు మాపై దయచే తండ్రివలే శిక్షను గర పెదవు. ముల్లోకములను రక్షించు కరుణామయమగు చూపులచే అమృత సముద్రము వలె నున్న ఓ స్వామీ! మమ్ము ఆపదలనుండి కాపాడుము.

 సిద్దా ఊచు:

            ఋషులు పలికిరి:- ఈ జగత్తునంతటిని అధ్యస్తముగ భాసింపజేయునట్టి, బ్రహ్మకు క్రీడాభాండము వలె ప్రతిభాసించునట్టి , అట్టి శాశ్వతుడవగు నీకు నమస్కారము-10.

సిద్దులు పలికిరి:- సంసారమునందుండువారు నీ కృపాలేశమువల్లనే గొప్ప సిద్దులను పొందుచున్నారు. నిన్నాశ్రయించినచో అచిర కాలమందే భయంకరమగు భవాంబోధిని దాటగలరు.

విద్యాధరులు పలికిరి:- సద్గుణములకు స్థానమగు ఓ కల్యాణమూర్తీ! పరమేశా! మిక్కిలి గౌరవము కలిగించువాడా! నీ పాదపద్మములయందు తేనెను గ్రోలినవారు మత్తిల్లి ధన్యులగుట యందు చిత్రమేమున్నది- 12. అప్పుడు స్వామి తుష్టుడై వారిని వరము కోరుకొమ్మనెను -13. ఓ స్వామీ! నీవు తుష్టుడవైనచో ఈ బదరిని, మేరు శృంగములను ఎప్పుడును వదలరాదు- 14. పుణ్యవంతులగు జనులు ఈ మేరు శృంగములను చూచినచో వారికి ఆ శృంగములపై స్థానము కలుగునట్లు అనుగ్రహింపుము - 15. అచట వారు భోగములన్ని చిరకాలము అనుభవించి చివరకు నీ యందు లయమవవలెను. అని వారు వరములు వేడగా ఆస్వామి వల్లెయని అచటనే అంతర్థానమయ్యెను-16. అప్పటినుండి దేవతలు ఆ మేరు శృంగములపై ఆనందముగ విహరించుచు నరనారాయణులచే పాలింపబడుచుండిరి-17. అచట ఋషులు ఎటువంటి ఉద్వేగములేక కొంతకాలము దివియందు మరి కొంతకాలము మేరు పర్వత మధ్యమున సంచరించుచుండిరి-18. స్వామికూడ 'నరుని' రూపమున అచట నిలచెను. ధనుస్సు, బాణములు ధరించి, తపస్సుచే అగ్నివలె ప్రకాశించుచు ఋషుల సమూహమునకు ఆనందము కలిగించుచుండెను.

అచట ఒక గొప్ప తీర్థము కలదు. దానికి లోకపాలకులు కూడ నమస్కరింతురు. స్వామియే లోక పాలకులను అచట స్వయముగా నియమించెను. 

శివుడు చెప్పెను:- ఒకసారి మేరు మధ్యమున ఉన్న దేవతల, ఋషుల స్థితిని చూచుటకు విష్ణువు వచ్చెను -22. అతడిని చూచి దేవతలు వెంటనే లేచి నమస్కరించి వినయముగా దయ చూపుమని ప్రార్థించీరి - 23. కొద్దిసేపు విశ్రమించి స్వామి ఆ ప్రదేశము విరలముగా ఉండుట చూచి ఋషులు, దేవతల మధ్య లోకపాలకులుండుట అసమంజసమని తలచెను -24. అపుడు చిరునవ్వుతో లోకపాలకులను రావించి మీ వంటి వారు ఇచట ఉండరాదు.

ఇచట ఋషులు, తాపసులు, సిద్ధులు తమ స్త్రీలతో కలసి నివసించుచుండిరి. మీ కొరకు మరియొక ప్రదేశము పూర్వమే కల్పించితిని-26. అని పలికి త్వరగా వెళ్ళి రమ్యమగు ఒక పర్వతమును చూచి అచటకు లోకపాలకులను రావించి వారినచట నియమించెను-27. శైలదండముచే ఆ పర్వతము నందు ఒక క్రీడా సరస్సును మనోహరముగా వారి కొరకు నిర్మించెను-28. దేవతలు తమ స్త్రీలతో కలసి యథేచ్ఛగా అచట సంచరించెదరు. పాటలు పాడెదరు. గంధర్వులు, దేవతలు ఆనందించెదరు-29. అచట పూల సువాసనలచే నిండిన వనములు కలవు. అచట జీవులకు దినములు క్షణములవలె గడచిపోవును-30. స్వామికి కూడ ఆ ప్రదేశము మిక్కిలి ఇష్టమైనది అగుటచే ద్వాదశియందు, పౌర్ణమియందు అచటకు వచ్చి స్నానము చేయును - 31. పిమ్మట ఋషులు, తపోధనులగు మునులు మధ్యాహ్న కాలమున అచట స్నానము చేసి నీటియందు అసంగమగు పరమజ్యోతిని కాంచెదరు.

         అన్నితీర్థములయందు స్నానముచేసిన ఫలము దండ పుష్కరిణియందు క్షణమాత్రము స్నానము చేసిన కలుగును -33. కామ్య కర్మలన్నియు అచట సఫలములగును. పిండ ప్రదానములచే గయలో దానము చేసిన దానికి ఎనిమిది రెట్ల ఈ తీర్థము మిక్కిలి రహస్యమైనది. నీయందు ప్రీతిచే దీనిని తెల్పితిని. కనుక దీనిని గూర్చి ఎచటను చెప్పకుము-36. దేవతలచే రక్షింపబడు ఈ తీర్థమును పుణ్యాత్ములు మాత్రమే చూడగలరు. మిగిలిన వారికి ఊహించుటకు కూడా వీలుకానిది ఇది -37. స్వామికి సమస్త కర్మలు అర్పించి స్వాధ్యాయము, అభ్యాసము యథావిధిగా చేయువారికి మాత్రమే ముల్లోకములయందు దుర్లభమగు ఈ తీర్థము కనిపించును. కాని ఇతరులకు కాదు.

            దండపుష్కరిణి వంటి తీర్థము, విష్ణువు వంటి దైవము, బదరి వంటి క్షేత్రములేదు. ఉండబోదు - 39. స్వామి పార్శ్వమున ఉండగోరు బుద్ధిమంతుడు ఎల్లప్పుడు బదరీక్షేత్రమును ప్రయత్నపూర్వకముగా నైనను కొలవవలెను.

స్కందుడు అడిగెను:- బదరివద్ద గంగానదిని ఆశ్రయించి ఎన్ని తీర్థములు కలవో వాటిని గూర్చి సంక్షిప్తముగ తెల్పుము.

శివుడు చెప్పెను:- మానసోద్భేదము గంగానదియందు కలియుచోట 'విమలము' అను ఒక పుణ్య తీర్థము కలదు. అది ప్రయాగ కంటే అధికమైనది-42. ముప్పైవేల సంవత్సరములు వాయుభక్షణముచే గడపిన కలుగు ఫలము ఈ తీర్థమునందు స్నానము చేయుట వలన కలుగును- 43. ఆ సంగమమునకు దక్షిణ భాగమున ధర్మక్షేత్రము కలదు. అచటనే మూర్తికి నరనారాయణులు జన్మించిరి- 44. ఆది మానవులకు ఉత్తమోత్తమమైన క్షేత్రము. ధర్మము అచట నాలు పాదములపై నిలచియుండును- 45. అచట చేసిన యజ్ఞములు, తపము, దానము ఏ కొంచెము చేసినను వాటి పుణ్యము, శతకోటి కల్పములకైనను క్షీణింపదు- 46. దానికి దక్షిణముగ ఊర్వశీ సంగమము కలదు. అచట స్నానము చేసినంతనే మానవుల పాపములన్నియు నశించును- 47. అచటనే 'కూర్మోద్ధారము కలదు. విష్ణువు యందు భక్తి కల్గుటకు ఆది ఏకైక సాధనము. అచట స్నానముచే జీవులకు సత్యశుద్ధి కలుగును- 48. అచటనే బ్రహ్మావర్తనము కలదు. బ్రహ్మలోకప్రాప్తి అనది మహావీరములు.

దీనిని విన్నవారుకాని, వినిపించినవారు కాని అన్నిపాపము తొలగగా విష్ణుపదమును పొందెదరు -51. రాజు విజయమును పొందును. సంతానము కోరువాడు సంతానము పొందును. కన్యను కోరినవారు కన్యను పొందుదురు. కన్య చక్కని భర్తను పొందును -52.ధనమును కోరువారు ధనమును పొందును - 53. దీనిని ఒక మాసము పాటు శ్రద్దతో చదివినచో దుర్లభములగు కోరికలు కూడా తీరును- 54, వారి ఇండ్లయందు వ్యాధి, భయము, ఘోరమగు దారిద్ర్యము, కలహము ఉండవు - 55. కల్పాదులవలన అపమృత్యువు కలుగదు. దౌర్భాగ్యము నశించును. దుఃస్వప్నముల వలన భయము, పరరాష్ట్రమునుండి భయము కలుగవు-56. యుద్ధమందు, యాత్ర చేయునపుడు, ప్రయాణమందు దీనిని ప్రయత్నముతో పఠింపవలెను. వివాహమందు, వివాదమందు, శుభకర్మలు చేయునపుడు కూడ ప్రయత్న పూర్వకముగా చదువవలెను- 57. మొత్తముకాని, ఈ అధ్యాయమొకటి కాని దానిలో సగము కాని చదివినచో ఎటువంటి సందేహము లేక సమస్త కార్యములు సిద్ధించును.

ఎనభై ఒక్కవేల శ్లోకములు కల శ్రీ స్కాందమహాపురాణమందు రెండవదగు వైష్ణవఖండమున బదరికాశ్రమ మాహాత్మ్యమున శివకార్తికేయ సంవాదమున బదరికాశ్రమమునందు మేరు సంస్థాపనము, లోకపాలతీర్థము, దండపుష్కరిణీతీర్థము ధర్మక్షేత్రము మొదలైన వివిధ తీర్థముల క్షేత్రములమాహాత్మ్యవర్ణనము అను ఎనిమిదవ అధ్యాయము.

శ్రీ స్కాంద మహాపురాణమందు రెండవదగు వైష్ణవ ఖండమున మూడవదగు బదరికాశ్రమమాహాత్మ్యము సమాప్తము.