స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని బదరి క్షేత్ర మహాత్మ్యము
3వ అధ్యాయము
స్కందుడు పలికెను:- అన్ని భూతములలో అన్నిధర్మములు తెలిసిన ఓ తండ్రీ, నాకు అన్ని తీర్థముయొక్క మాహాత్మ్యమును గూర్చి తెల్పుము-1.
శివుడు చెప్పెను:- ఇది మిక్కిలి రహస్యమగు తీర్థము. అన్ని తీర్థములచే సేవించబడునది. నీయందలి ఆదరముచేత దానిని గూర్చి సంక్షిప్తముగ చెప్పెదను-2. ఓ కుమారా! ఈ తీర్థస్నానము వలన మహాపాతకములు, అతిపాతకములు చేసినవారు తమ పాపములనుండి ముక్తిని పొందెదరు-3. ప్రాయశ్చిత్తము చేసినను మరణించునంతవరకు ఉపశమించని పాపముకూడ అగ్ని తీర్థస్నానము వలన నశించును-4. మిక్కిలి దోషయుక్తమైన బంగారమును అగ్ని శుద్ధి పరచునట్లు అగ్ని తీర్థము మానవులను అన్ని పాపములనుండి శుద్ది చేయును-5. ప్రతిదినము దర్భకొనతో ఒక్క నీటి బొట్టు త్రాగుచు మూడు సంవత్సరములు ఇతర క్షేత్రములయందు చేసిన ఫలము అగ్నితీర్థ స్నానము వలన కలుగును-6. ఇచట బ్రాహ్మణులకు తమ శక్తి కొలది భోజనము పెట్టినచో వారి కుటుంబమున పేదరికమనునది ఉండదు-7. ఇచట ఉపవాసము చేసి మరణము పొందినచో సూర్యలోకము మున్నగునవి దాటి విష్ణులోకమును పొందును-8. వేయి చాంద్రాయణ వ్రతములు చేసినచో, కోట్లకొలది కష్టములగు వ్రతములు చేసినచో ఎట్టిఫలము కలుగునో అగ్ని తీర్థస్నానము వలన అట్టి ఫలము కలుగును-9.
పంచమహాపాతకములు చేసిన వారైనను ఇచట గాలిని బంధించి జపము చేసినచో శుద్ది పొందుదురు-10. ఇచట తెలసి కూడ మోహవశమున పాపము చేసిన నీచులు పదునాల్గు మన్వంతరములు పిశాచత్వమును పొందుదురు-11. నాలు విధములగు ఆశ్రమములయందున్న వాడైనను, లేనివాడైనను తెలసి ఈ తీర్థమున పాపము చేయకూడదు-12. ఇచట చేసిన స్నానము, దానము, జపము, హోమము, సంధ్య, దేవతాపూజనము అనంతమగు ఫలమునిచ్చును-13. ఎన్నో తీర్థములున్నను అవి అన్ని తీర్థముతో సమానముకావు. అగ్నితీర్థముతో సమానమగు తీర్థము లేదు, ఉండబోదు-14. ఈ తీర్థముయొక్క మహత్తును తెలియజెప్పుటకు బ్రహ్మకు, శివునికి, ఆదిశేషునికి, దేవతలకు శక్యము కాదు-15. పది దినములు ఈ తీర్థమున స్నానము చేసినచో ఇకవారు పెక్కు యజ్ఞములు, దానములు, నియమములు, యమములు చేయుట వ్యర్థము-16.
మూడు దినములు ఉపవాసము చేసి జనార్ధనుని పూజించినచో, అగ్ని తీర్థమందు స్నానము చేసినచో అగ్ని సదృశుడగును-17. ఐదు శిలలమధ్య హరి ఆ క్షేత్రమునందు నివసించును. అగ్నితీర్థము కూడ అచటనే ఉన్నది-18.
స్కందుడు పలికెను:- అచట ఐదు శిలలు ఏల నిర్మింపబడినవి. వాటి వలన ఎట్టి పుణ్యము కలుగును. ఎట్టి ఫలము కలుగును. అంతయు నాకు చెప్పవలసినది-19.
శివుడు చెప్పెను:- నారది. నారసింహి. వారాహి. గారుడి. మార్కండేయి అను పేరు గల ఐదు శిలలు అని కోర్కె లను పరమదారుణమగు తపస్సు చేసెను-21. అరవై వేల సంవత్సరములు వృక్షవృత్తి వహించి ఆ రాతిపై తపస్సు చేయగా అపుడు మహావిష్ణువు బ్రాహ్మణ రూపమున ప్రత్యక్షమయ్యెను-22. ఆ మునిని అనుగ్రహించుటకు అతడి ముందుకు వెళ్ళి ఓ ఋషీ! నీవు ఏ కారణముచే ఇంతటి కష్టము అనుభవించుచుంటివి. తపస్సుచే పాపములన్నియు క్షీణించిన నీ కోరిక తెల్పుము-23.
నారదుడు పలికెను:- ఈ నిర్జనారణ్యమున నన్ననుగ్రహించుటకు వచ్చిన నీవెవరు? నిన్ను చూచినంతనే మనస్సు ప్రసన్నమైనదీ-24. అపుడు హరి శంఖము, చక్రము, గదలు ధరించి, పట్టుబట్టలతో, పద్మములు, వనమాలలతో ఆలంకరింపబడి-25. శ్రీవత్సము, కౌస్తుభము, లక్ష్మిని హృదయము పై ధరించి సునందుడు మున్నగు వారు స్తుతించుచుండగా 26. తన రూపమును నారదునికి చూపెను. అపుడు నారదుడు ప్రాణములు లేచి వచ్చిన వానివలె-27. చేతులు జోడించి మరల మరల నమస్కరించి ప్రణమిల్లి జగన్నాధుని ఇట్లు స్తుతించెను-28.
నారదుడు పలికెను:- సర్వసాక్షి, జగములకు నాథుడు, భక్తుల కోరిక మేరకు వివిధ శరీరములు ధరించువాడు. ఆశ్రయించిన వారికి దయానిధి, పావనమగు దివ్యమూర్తి కల ఓ స్వామీ నాపై అనుగ్రహము చూపుము-29. లోకములకు హితము కలిగించు సత్పురుషులకు సంతోషము నిచ్చు ప్రసన్నముగ, విలాసముగ నవ్వుచు చూచునట్టి, సత్య స్వరూపమగు ఓ స్వామీ నన్ను అనుగ్రహింపుము-30. మన్మథుని వంటి లావణ్యముచే విలాసమగు సౌందర్యము కలిగినట్టి, ప్రసన్నము గంభీరము అగు వాక్కుచే లక్ష్మికి ఆనందము కలిగించు, నిన్ను ఆశ్రయించినవారికి వరములిచ్చు కల్పవృక్షము వంటి, దీనులపై దయార్దమగు మనసుచూపు ఓ స్వామీ అనుగ్రహింపుము-31. నీ పాదములను పద్మములతో నిరంతరము ఆర్చించినచో జ్ఞానము అను కత్తితో సంసారబంధములను తెంచి బ్రహ్మసుఖమును పొంది, కష్టములకు దూరమగుదురు. అట్టి దీనదయార్ద హృదయుడవగు ఓ స్వామీ అనుగ్రహింపుము-32. సంసారమను సముద్రమునకు వారధివంటి, సృష్టికి, స్థితికి, లయకు కారణమైనట్టి, అనంతమగు నామములు కలిగినట్టి, బ్రహ్మసుఖానుభూతిని కలిగించు ఓ స్వామీ అనుగ్రహింపుము-33. ఇంద్రియములను అధిష్టించిన భూత సూక్ష్మములకు వికాసము కలిగించుట జ్యోతి: స్వరూపములయందు వరిషుడైనట్టి తన మాయచే జీవాత్మత్వమును పొందునట్టి ఏకేశ్వరుడవైనట్టి ఓ స్వామీ నన్ను
నీ చూపులు అను గుణములచే ఈ పాంచభౌతిక శరీరము అలదబడి గొప్ప గుణములకు ఆశ్రయమగుచున్నది. నీవు ఒక్కడివైనను పెక్కు గుణములకు ఆలవాలము. దీనులను రక్షించు ఓ స్వామీ నన్ను అనుగ్రహింపుము-35. నీ మార్గమును అనుసరించు దేవతలు ఆపదలు అను సముద్రమును చిన్నపిల్లవాని ఆడుగువలె సులభముగా దాటి స్వర్గమునందు సుఖులై నివసించుదురు-36. ఓ వాసుదేవా, సంకర్షణా, ప్రద్యుమ్నా, అనిరుద్దా, సమస్త జీవులకు ఆత్మరూపమైన ఓ స్వామీ! నీకు నమస్కారము-37. నేడు నా జీవితము, తపస్సు, జ్ఞానము నీ దర్శనము వలవ సఫలములైనవి-38.
స్వామి పలికెను:- ఓ నారదా నీ ఈ స్తుతిచే సంతుష్టుడనైతిని. నీ కంటే భక్తుడు ముల్లోకములలో లేడు-39. నీకు వరమిచ్చుటకు వచ్చిన నా నుండి వరమును కోరుకొనుము-40.
నారదుడు పలికెను:- ఓ దేవా! నీవు వరమిచ్చువాడవు, నేనా వరము పొందుటకు అర్హుడను ఐనట్లయితే నీ పాదములయందు నిశ్చలభక్తిని అనుగ్రహింపుము-41. నేను తపము చేసిన శిలను నీవు ఎప్పుడును వదలరాదు. నీ తీర్థమును దర్శించినను, తాకినను, స్నానము చేసినను, ఆచమనము చేసినను వారికి ముక్తి కలుగవలెను. ఇది మూడవ వరము-42.
స్వామి పలికెను:- ఓ నారదా! నాకు నీపై గల వాత్సల్యము వలన అట్లే అగును, చరాచరములకు ఇచట నిస్సంశయముగ ముక్తి కలుగును-43. అని పలికి స్వామి అంతర్థానమయ్యెను. నారదుడు కొన్ని దినములచట గడపి సంతుష్టుడై మధుపురికి వెళ్ళెను-44.
స్కందుడు అడిగేను:- మార్కండేయ శిలను గూర్చి చెప్పుము. దానివలన ఎట్టి పుణ్యము, ఎట్టిఫలము కలుగును. ఆ పేరెట్లు కలిగెను-45.
శివుడు చెప్పెను:- పూర్వము త్రేతాయుగపు అంతమున మృకండు మహర్షి కుమారుడు తాను అల్పాయుష్కుడనని తెలసికొని గొప్ప తపస్సు చేసెను-46. ద్వాదశాక్షరిచే హరిని పూజింపగా ఏడు కల్పముల ఆయుష్సును ప్రసాదించి అంతర్థానమయ్యెను-47. పిమ్మట మార్కండేయుడు తీర్థాటనము చేయుచు మధురానగరమునందు నారదుని దర్శించెను48. నారదుని పూజించి ప్రణమిల్లగా విష్ణువు నివసించు బదరీ ఆశ్రమము గూర్చి, దాని మాహాత్మ్యమును గూర్చి తెల్పెను-49.
నారదుడు చెప్పెను:- నీవు వ్యర్థముగా తీర్ణాటనము చేసి శ్రమపడుచుంటివి. బదరీక్షేత్రమును దర్శింపుము-50. అచట నీవు విష్ణువును స్వయముగ చూడగలవు. అని చెప్పగా మార్కండేయుడు బదరికి వచ్చేను-51. స్నానముచేసి రాతిపై కూర్చుని అష్టాక్షరిని జపించెను. మూడు రాత్రులు గడచిన తరువాత స్వామి ప్రత్యక్షమయ్యెను-52. శంఖము, చక్రము, గద, పద్మము, వనమాల ధరించిన స్వామిని చూచి దిగ్గునలేచి ప్రేమతో గద్గదమైన వాక్కులతో ప్రణమిల్లి స్వామిని స్తుతించెను-53.
మార్కండేయుడు పలి కెను:- ఈ అశాశ్వతమగు సంసారమున నీ చరణకమలములే సారము కలవి. మానవులు ముక్తిని పొందుట ఎట్లు? ఓ పరమేశ్వరా నన్ను రక్షింపుము-54. తాపత్రయముచే అలసిన, అనేక అజ్ఞానములచే ముసురుకొనబడిన, సంసారమను కూపమునందు భ్రాంతి పొందిన నన్ను రక్షింపుము-55.
పెక్కు యోనులయందు జన్మించి గర్భవాసదుఃఖమును అనుభవించిన నన్ను కాపాడుము-56. శరీరమును కృములు భక్షించుచుండగా, ఆకలి, దాహముచే అల్లాడుచు ఆంత్రపులోపలి భాగమున గర్భమున పడి ఉండు నన్ను రక్షింపుము-57. అమేధ్యము మొదలైనవి పూసికొని కదలలేక శ్రమపడుచు, చేసిన కర్మలు తలచుకొని కుములుచుండు నన్ను కాపాడుము -58. నిఃశ్వసించుటకుకూడ శక్తిలేని, భయపడుచున్నట్టి, గర్భవాసదుఃఖము అనుభవించుచున్నట్టి నన్ను కావుము-59. ముసలితనము, మరణము, బాల్యము, మొదలగు దు:ఖములచే పీడింపబడు, దుఃఖసాగరమునందే సుఖమున్నదని తలచు నన్ను రక్షింపుము-60. ఒకప్పుడు కృమిగా, స్వేదజముగ, ఉద్భిజముగ మానవునిగ పుట్టితిని-61. అన్ని యోనులయందు పుట్టి ఆపదలవలన తేజస్సు కోల్పోయి అనాథనైన నన్ను కృపతో కాపాడుము-62. అని కృష్ణుని స్తుతించగా, స్వామి తుష్టుడై ఇష్టమగు వరము కోరుకొమ్మనెను-63.
మార్కండేయుడు పలికె ను:- ఓ దీనవత్సలా! వాపై దయ కలిగినచో నీపై నిశ్చల భక్తి కలుగునట్లు అనుగ్రహింపుము, ఈ శిలయందు ఎల్లప్పుడు నివసింపుము-64.
సూతుడు చెప్పెను:- మహావిష్ణువు వల్లె అని పలికి అచటనే అంతర్ధానమయ్యెను. మార్కండేయుడు తుష్టుడై తండ్రి ఆశ్రమమునకు వెళ్ళెను-65. కనుక ఈ స్థానము పరమ పుణ్యమైనది. సమస్త పాపములను హరించునది. విన్నవారికి, వినిపించినవారికి స్వామి యందు స్థానము కల్పించునది-66.
ఎనభై ఒక్కవేల శ్లోకములు కల శ్రీ స్కాంద మహాపురాణమందలి రెండవదైన వైష్ణవఖండమున శివకార్తికేయ సంవాదమున అగ్నితీర్థము, నారదశిలమార్కండేయశిల
మాహాత్మ్యమును వర్ణించు మూడవ అధ్యాయము.
