స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని బదరి క్షేత్ర మహాత్మ్యము

2వ అధ్యాయము

స్కందుడు పలికెను:- ఈ క్షేత్రము ఎట్లు పుట్టినది? ఎవరు సేవించిరి? దానికి నాథుడు ఎవరు? ఇది అంతయు నాకు సవిస్తరముగ తెల్పుము- 1.

శివుడు చెప్పెను :- విష్ణువు శరీరములవలె ఈ క్షేత్రము కూడ అనాది. దీనికి నాథుడు నారదాదులచే సేవింపబడు హరియే-2. పూర్వము కృతయుగపు ప్రారంభమున బ్రహ్మ తన కుమార్తె రూపము, యౌవనము చూచి మోహించి కామించెను3. అది చూచి కోపము పట్టలేక అతడి శిరస్సును నా కత్తితో ఐదు ముక్కలు చేసితిని. ఆ కపాలము వలన నాకు బ్రహ్మహత్యా పాతకము కలిగినది-4. దానినుండి ముక్తి పొందుటకై ఆ కపాలమును చేత ధరించి దివియందు, భువియందు, పాతాళమందు తపస్సు చేయుచు అన్ని తీర్థములను దర్శించితిని-5.

          ఐనను ఆ కపాలము, పాతకము నన్ను వదలిపెట్టలేదు. అపుడు లక్ష్మీపతి అగు హరిని చూచుటకై వైకుంఠమునకు వెళ్ళితిని6. వినయముతో వంగి మరల మరల నమస్కరించి కరుణాత్ముడగు ఆ హరికి జరిగినదంతయు వివరించితిని-7. అతడి ఆజ్ఞపై బదరికి వచ్చితిని. ఆ క్షణమే బ్రహ్మహత్య వణకసాగెను-8. ఆ కపాలము నా చేతినుండి జారిపడెను. అప్పటినుండి నేను పార్వతితో కలసి అచట సాదరముగ నివసింపసాగితిని-9. ఋషులకు ప్రీతికలిగించుచు తపస్సు చేయుచు గడపుచుంటిని. నాకు వారణాసియందు, శ్రీశైల శిఖరమునందు-10. పార్వతితో కలసి కైలాసమునందు నివసించుట వలన కలుగు సంతోషము కంటే అనంతమగు సంతోషము బదరీ నివాసము వలన కలుగును. మిగిలిన ప్రదేశములయందు తమ విధులు నిర్వర్తించు మరణము పొందినచో కలుగు ముక్తి -11. బదరిని చూచుట చేతనే అందుబాటులో ఉండును. హరిపాదసన్నిధియందు అగ్ని స్వయముగా-12. నా లింగమును కేదారమను పేరుతో ప్రతిష్ఠించెను. ఆ కేదారలింగమును భక్తితో చూచినను, తాకినను, అర్చించినను-13.

  కృతనతి పరనిత్య ప్రార్ధనాశ్చంద్రమౌతా, హరచరణసరోజధ్యానవిజ్ఞానమూర్తి వ్యధిత జనమనోజాః సర్వభావాన్నితాంతమ్ కోటి జన్మలలో చేసిన పాపము ఒక్క క్షణములో నశించును. ఆ క్షేత్రమునందు నేను కళా మాత్రముగ నివసించుదును -14. ఇచట పది హేనవ కళమాత్రమే ఉన్నది-15. శివయోగులు మృత్యువును జయించి ముగాజినములు, ఏనుగు చర్మములు ధరించి, విభూతి, జడలు భూషణములుగా కలిగి జటాధరుడగు శివుని పూజింతు-16. పండ్లు, ఆకులు, నీరు, వాయువు భక్షించుచు, శివుని మనస్సున కలిగిన వారై మృత్యుంజయులై, కొండపై నివసించుచు, ఇంద్రియ నిగ్రహము కలిగి నిర్మలమగు బుద్ది ప్రసరించువారై ఉందురు-17. కమలమువంటి కోమలమగు కాంతి కలిగిన ముఖములు కలవారై, శివుని కృపచే తమ శత్రువులను జయించి, చేతులు జోడించి తల పై పెట్టికొని శివునిపై చూపు నిలపి ఉదయ కాలమందు శివుని ధ్యానింతురు- 18. చేతులయందు జపమాలలు ధరించి, శాంతి సంతోషములు కలిగి, శివుని ఎల్లప్పుడు తమ మనస్సులతో ప్రార్థించుచు, శివుని పాదముల పై దృష్టి నిలపినవారై, మన్మథుని అన్ని విధముల జయింతురు-19.

          వారణాసియందు మరణించినవారు తారక బ్రహ్మను పొందుదురు. అచట జనులు నా లింగమును పూజింతురు - 20. అగ్ని తీర్థమున స్నానము చేసి స్వామి పాదముల వద్ద కేదారేశ్వరుని చూచినచో పునర్జన్మ కలుగదు-21.

స్యందుడు పలికెను:- సమస్త లోకములకు ఏకకారణమగు ఆ అగ్ని ఏ కారణమువలన బదరియందు నివసింపసాగెనో నాకు తెల్పుము- 22.

శివుడు చెప్పెను:- పూర్వము గంగానది యమునతో కలియు ప్రదేశమున ఇంద్రియ నిగ్రహము కలిగిన ఋషుల సమాగమము జరిగెను. 23. అచట దశాశ్వమేధమను తీర్థము ప్రసిద్ధము. అపుడు అగ్ని అచటకు వచ్చి వినయముగా ఆ ఋషులను ఇట్లు అడిగెను-24.

అగ్ని పలికెను:- మీరు బ్రహ్మను కనుగొన్నవారు. దయకలవారు. దీనులపై కరుణ చూపువారు-25, ఎటువంటి చెడు లక్షణములు అంటనివారు, నాకు ముక్తి ఎట్లు కలుగునో చెప్పవలెను- 26. అపుడు వ్యాసుడు ఋషులందరు వెంటరాగా గంగానదియందు స్నానము చేసి ఇట్లు చెప్పెను-27.

వ్యాసుడు చెప్పెను:- నీ పాపము తొలగుటకు ఒక్క ఉపాయము కలదు. సర్వభక్ష్యత్వ దోషము పోవుటకై బదరికి వెళ్ళుము-28. అచట దేవదేవుడగు జనార్దనుడు కలడు. భక్తులు ఐనవారి, కానివారి పాపములను హరి తొలగించును-29. అచట గంగానదిలో స్నానముచేసి, హరికి నమస్కరించి, దండ ప్రణామము చేసినచో పాపములన్నియు నశించును-30. అపుడు అగ్ని ఆ మాటలు విని ఉత్తరాభిముఖుడై గంధమాదనమునకు వచ్చెను- 31. బదరికి వచ్చి గంగానదిలో స్నానము చేసి నారాయణాశ్రమమునకు వెళ్ళి భక్తితో స్తుతించెను-32.

ఆగ్ని పలికెను:- విశుద్ధ విజ్ఞాన రూపము, పురాణము, సనాతనము అగు స్వరూపము కలవాడు, బ్రహ్మకు కూడ గురువు, అనేకము, ఏకము అను రూపము కలవాడు, జగదేకనాథుడు అనంతమగు శుద్దమగు బుద్ధికలవాడు అగు ఓ హరీ! నీకు నమస్కారము -33. మాయామయి అగు శక్తిని పొంది రజోగుణముచే విశ్వమును సృష్టించుచు, సత్యగుణముచే సమస్తలోకములను రక్షించుచు, తమోరూపమున లోకములను హరించు నీకు నమస్కారము-34. అవిద్యచే విశ్వమును మోహింపజేయుచు విద్యారూపమై, విద్యకు ఆశ్రయమగుటచే సకలజ్ఞుడైన నిన్ను అవిద్యచే జీవించు నేను శరణు కోరుచుంటిని35. భక్తుల కోరిన కోర్కెల మేరకు వారికి ఇష్టమగు రూపము పొందువాడా! కౌశేయము, పీతాంబరములు ధరించువాడా! విచిత్రమగు అష్టశక్తులు కలవాడా! నిన్ను స్తుతించుచుంటిని-36. సమస్త జీవుల హృదయములో ఉండు హరి ఆ స్తుతిని విని సంతుష్టుడై పావనము కాగోరిన ఆ అగ్నితో మధురమగు వాక్యము నిట్లు పలికెను-37.

నారాయణుడు పలికెను:- వరమునిచ్చుటకు వచ్చితిని. కనుక వరమును కోరుకొనుము. నీ స్తుతిచే, వినయముచే నేను ప్రసన్నుడనైతిని-38.

అగ్ని పలికెను:- సర్వజ్ఞుడవగు నీకు నేనిచట ఏల వచ్చితినో తెలియును. కానీ ఈశ్వరాజ్ఞననుసరించి చెప్పుచుంటిని39. నేను సర్వభక్షకుడనైతిని. విముక్తి ఎట్లు కలుగును. దీనివలన నాకు మిక్కిలి భయము కలుగుచున్నది-40.

నారాయణుడు పలికెను:- క్షేత్రమును చూచినంతనే జీవుల పాతకములు నశించును. నేను నిన్ననుగ్రహించుటచే నిన్ను ఎట్టి పాతకము అంటదు-41. అప్పటి నుండి అగ్ని అన్ని దోషములు తొలగినవాడై తన కళారూపమున అచట నివసించుచుండెను-42. ప్రతిదినము ఉదయమే లేచి ఈ కథను ఎవరు విందురో, వినిపింతురో వారికి అగ్ని తీర్థమున స్నానము చేసిన ఫలము కలుగును.

ఎనభై ఒక్కవేల శ్లోకములు కల శ్రీ స్కాందమహాపురాణమందలి రెండవదైన వైష్ణవఖండమునందలి బదరికాశ్రమ మాహాత్మ్యమున శివకార్తికేయసంవాదమున బదరికాశ్రమము యొక్క సర్వతీర్థాధిక్య వర్ణనము అను రెండవ అధ్యాయము.