స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని బదరి క్షేత్ర మహాత్మ్యము

5వ అధ్యాయము

స్కందుడు ఆడిగెను:- భగవంతుడగు హరి అచట నివసించుటకు హేతువేమి? స్వామిని చూచుటచే తాకుటచే ఎట్టి ఫలము, పుణ్యము కలుగును-1. నైవేద్యమును భుజించిన, మహాపూజ చేసిన, ప్రదక్షిణము చేసిన ఎట్టి ఫలము కలుగునో తెల్పుము-2.

శివుడు చెప్పెను:- పూర్వము కృతయుగమందు స్వామి సమస్త జీవుల హితమునకై మూర్తిమంతుడై అందరకు కనిపించుచు తపో యోగములను ఆశ్రయించియుండెను-3. త్రేతాయుగమందు యోగాభ్యాసము చేయు ఋషులకు, ద్వాపరమున ధ్యాననిష్టులైనవారికి మాత్రమే కనిపించుచుండెను-4, ఋషులకు దేవతలు స్వామి దర్శనము లభింపకపోవుటచే వారు విస్మితులై బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇట్లు పలికిరి-5,6.

         దేవతలు పలికిరి:- సర్వలోకములకు ఆశ్రయమైనట్టి, శరణుకోరినవారి ఆర్తిని హరించునట్టి వృత్తిని ఇచ్చునట్టి, కరుణాపూర్ణుడవైనట్టి ఓ పితామహా. సురేశ్వరా నీకు నమస్కారము. మాకు తండ్రివి కాన మమ్ము ఆపదలనుండి నీవే కాపాడగలవు-7.

బ్రహ్మ పలికెను:- ఓ దేవతలారా! మీరు ఏల ఇచటకు వచ్చితిరి? విస్మయముచే ఆందోళన చెందిన మనస్సుగల మీరు ఈ ఋషులతో ఇచ్చటకు వచ్చిన కారణమును చెప్పుడు-8.

దేవతలు పలికిరి:- ద్వాపరము వచ్చినంతనే స్వామి బదరియంచు ఆదృశ్యుడగుటకు కారణమేమి?-9. స్వామి బదరిని విడచి పెట్టేనా? వేరు చోటకు వెళ్ళినా? మేము ఏదైన అపరాధము చేసితిమా, మాపై అనుగ్రహము ఎట్లు చూపును-10.

బ్రహ్మ పలికెను:- ఓ దేవతలారా! మీరు చెప్పునంతవరకు ఈ విషయము నాకు తెలియదు. ఆ కారణమును తెలిసికొనుటకై మనము పాల సముద్రము వద్దకు వెళ్ళెదము-11. అని పలికి వారిని వెంటబెట్టుకొని, ఋషులతో తపోధనులతో వైకుంఠమునకు వెళ్ళెను–12. అచట జగన్నాథుడు, వృషాకపి, దేవదేవుడు అగు స్వామిని పలురకముల స్తుతించిరి-13.

బ్రహ్మ పలికెను:- ఓ పురుషాధ్యక్షా, సర్వభూతములలో ఉండువాడా! వాసుదేవి, అఖిలమునకు ఆధారమైనవాడా, జగత్తుకు కారణమైనవాడా, జగన్మయా నీకు నమస్కారము-14. నీవే సమస్త జీవులకు కారణము. నాథుడవు. ఆశ్రయమిచ్చువాడవు. మాయశక్తి సాహాయ్యము వలన ఒక్కడవైనను పెక్కు రూపముల సంచరించువాడవు-15. నటునివలె పెక్కు రూపములు ధరించు ఓ అవ్యయా! నీవు అంతట వ్యాపించినవాడవు, దయాలువువు. భక్తుల మనోపద్మములయందు ఉండువాడవు. వివిధ ఆనందములనిచ్చు ఓ జగత్పతి నీకు నమస్కారము-16.

దేవతలు పలికిరి:- ఆపదలు అను అడవిని కాల్చు కార్చిచ్చు వంటివాడా! సమస్త శక్తులు కలవాడా, దేవతలను కాపాడువాడా, చరాచరములకు ఆత్మరూపమైనవాడా, ఓ అనంతా కృపాకటాక్షములతో మమ్ము కాపాడుము-17. ఒక్కసారైనను నీ నామము అను అమృతమును త్రాగినచో మోక్షమును కూడ గడ్డిపోచవలె తలచును. అట్టి నిన్ను భజించెదను-18. అవిద్య యొక్క ప్రతిబింబము వలన జీవునిగా ప్రతిభాసించునట్టి, తెలసినచో ఆ భ్రాంతిని తొలగించునట్టి ముల్లోకములను పావనము చేయునట్టి నీకు నమస్కారము-19.

గంధర్వులు పలికిరి:- స్వామి పదములనంటిన నీటిని త్రాగినవారు తల్లిపాలను తాగరు. అనగా మరుజన్మ ఉండదు. ప్రసంగవశాత్తు స్వామి నామమును ఉచ్చరించినచో మృతామృతము లేని మోక్ష పదవిని పొందెదరు-20. అని వారు స్తుతించగా స్వామి పాలకడలి నుండి లేచి బ్రహ్మకు మాత్రమే దర్శనమిచ్చెను-21.

         బ్రహ్మ అది తెలిసికొని స్వామికి నమస్కరించి ఓ దేవతలారా, శ్రద్ధగా వినుడు-22. లోకమంతటా చెడు బుద్ధి కలవారు ఎక్కువగుటచే స్వామి అంతర్షితుడయ్యెను. అది విని దేవతలందరు స్వర్గమునకు వెళ్ళిరి-23. పిమ్మట స్వామిని నేను (శంకరుడను) యతి రూపమున అవతరించి నారద తీర్థమునుండి తీసి లోకములకు మేలు కలిగించుటకై ప్రతిష్ఠింతును -24. ఆ స్వామిని చూచినచో పాపములన్నియు సింహమును చూచిన లేళ్ళవలె పారిపోవును-25. ధర్మాధర్మములను జయించి బదరిలో ఉన్న స్వామిని చూచినచో ఎట్టి ప్రయాస లేక ముక్తిని పొందెదరు-26. కలికాలమునందు స్వామి అన్యతీర్థములన్నిటిని వదలి పెట్టినను బదరియందు స్వయముగ నివసించును-27. కలికాలమునందు ముక్తిపొందగోరువారు మిగిలిన తీర్థములను వదలి బదరిని మాత్రమే సేవింపవలయును. అపుడు మాత్రమే వారు ముక్తిని పొందగలుగుదురు-28.

          జ్ఞానము, యోగము లేక, తీర్ధాటనము యొక్క పరిశ్రమ లేక ఒక్క జన్మలోనే జీవుడు కైవల్యమును పొందును29. వేలాది జన్మలలో స్వామిని పూజించిన వాడైనను బదరికి వెళ్ళినచో ముక్తిని పొందును-30. ప్రసంగవశమున బదరి, బదరి అని పలికినచో సంసారమను చీకటి దీపపు వెలుగుకు నశించినట్లు నశించును-31. దీపమును చూచినచో చీకటి వలన బాధ తొలగునట్లు బదరిని చూచినచో మృత్యు భయముండదు-32. బదరిని చూచినంతనే పాపములన్నియు ఏడ్చుచు పారిపోవును. అట్టి ముక్తి మార్గమును ప్రసాదించు హరికి నమస్కారము-33. బదరియందు స్వామికి ప్రదక్షిణము చేసినచో అడుగడుగుకు పర్వతములు, వనములతో కూడిన భూమిని పదిసార్లు దానమిచ్చిన ఫలము కలుగును-34. బదరియందు స్వామికి ప్రదక్షిణము చేసినచో అడుగడుగుకు అశ్వమేధము చేసిన, నూరు వాజపేయయాగములు చేసిన ఫలము కలుగును-35.

బదరియందు స్వామికి ప్రదక్షిణము చేసినచో చాతుర్మాస్యమునందు బ్రహ్మాండదానము చేసిన ఫలము కలుగును -36. బదరియందు స్వామికి ప్రదక్షిణము చేసినచో అడుగడుగుకు మిక్కిలి కష్టములగు వైదిక కర్మలను చేసిన ఫలము కలుగును-37. బదరియందు స్వామి నైవేద్యమును ఒక్క మెతుకైనను తిన్నచో వరిపొట్టుతో మండు అగ్ని బంగారమును శుద్ది చేసినట్లు పాపములన్నియు శుద్ధి అగును-38. స్వామి నైవేద్యము స్వామియే అని నారదాది ఋషులు చెప్పిరి కనుక సత్య శుద్ధి కొరకు ప్రసాదమును భుజింపవలెను-39. దేవతలు కూడ స్వామి నైవేద్యమును తినగోరుదురనగా దాని మాహాత్మ్యం వర్ణించుట ఎట్లు-40. ప్రహ్లాదుడు మొదలగు భక్తులు స్వామి నైవేద్యమును భుజించి తమ ఇండ్లకు వెళ్ళుటచే వారు వైకుంఠమును పొందిరి-41. బాల్యము, యౌవనము, వార్ధక్యములలో తెలిసి చేసిన పాపములన్నియు బదరియందు స్వామి నైవేద్యమును భుజించుటచే నశించును-42.

 ప్రాణము పోవువరకు ప్రాయశ్చిత్తము చేయవలసిన పాపమైనను బదరియందు విష్ణువు నైవేద్యమును భుజించినచో తొలగిపోవును-43. ఇతర తీర్థములయందు ప్రయత్నము చేతనే మోక్షము సిద్దుంచును. కాని బదరియందు విష్ణునైవేద్యము భుజించిచో అనాయాసముగ సాలోక్యము కలుగును-44. హృదయమునందు స్వామి రూపము, ముఖమున నామము, ఉదరమున నైవేద్యము, తల పై నిర్మాల్యముతో కూడిన పాదోదకము ఉన్నచో అతడు సాక్షాత్తు విష్ణువే -45. బ్రహ్మహత్య, సురాపానము, దొంగతనము, గుర్వంగనాగమనము అను మహాపాతకములు నైవేద్యస్వీకరణముచే నశించును-46. బదరితో సమానమైన క్షేత్రము, స్వామి నైవేద్యముతో సమానమైన నైవేద్యము, నారదీయ క్షేత్రముతో సమానమగు క్షేత్రము లేదు. ఉండబోదు-47. బదరికి ప్రయత్నపూర్వకముగా వెళ్ళి స్వామి నైవేద్యమును భుజించి, స్వామిని చూచి, అగ్నితీర్థమున స్నానము చేయుట మిక్కిలి కష్టము-48. భూమిపై గల తీర్థములు, అన్ని వ్రతములు, నియమములు చేసిన ఫలము బదరియందు పాదోదకము సేవించిన కలుగును.

         బదరియందు విష్ణుపాదోదకము ఒక్క చుక్క తాగినను ఇక దానములు, తపము, తీర్థాటన పరిశ్రమ అన్నియు వ్యర్థమే అగును-50. బదరియందు విష్ణు పాదోదకము సేవింపనంతవరకు ప్రాయశ్చిత్తములు చేయుచునే ఉండవలెను -51. ఎటువంటి కష్టము లేక ముక్తి పొందగోరినచో వారు తప్పక విష్ణు నైవేద్యమును భుజింపవలెను-52. పాపములను గ్రహించు మానవులకు బదరీయాత్ర చేయుట వలన కలుగు ఫలము కొద్దిపాటి కూడ కలుగదు-53. విష్ణు నైవేద్యమును తమోగుణముచే మోహితులగు వారు మాత్రమే నిందింతురు. నైవేద్యమును భుజించినచో సత్యగుణవృద్ధి కలుగును-54. నైవేద్యమును స్వయముగ తీసికొని వచ్చి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వారు ధన్యులగుదురు. ఆ ఫలముతో పోల్చినచో ! తులాపురుషదానము వలన కలుగు ఫలము కూడ తక్కువ అగును.

            సూర్యగ్రహణము సంభవించినపుడు కురుక్షేత్రమున మహాదానము చేసిన ఫలము బదరియందు నైవేద్యమును భుజించుటచే కలుగును-56. స్వామికి సంతోషము కలిగించుటకు సులభమగు ఉపాయము బదరియందు నైవేద్యమును గ్రహించుటయే. అచట యతులు భోజనము పెట్టినచో విష్ణువుకు అపరాధము చేసినవాడైనను ఇష్టుడగును-57. విష్ణువుతో సమానమగు దైవము, బదరితో సమానమగు నగరము, భిక్షువులతో సమానమగు సత్పాత్రము, ఋషితీర్థముతో సమానమగు తీర్థములేవు-58. అచట చాతుర్మాస్యము చేసినవారి ఫలమును వర్ణించుట బ్రహ్మకు కూడ శక్యము కాదు-59. భిక్షుకులకు భోజనము పెట్టినచో వేదాంతము వినుటవలన కలుగు ఫలమునకు పదిరెట్ల ఫలము లభించును-60. బదరిని చూచినంతనే భిక్షుకులకు అచట నివసించు కోరిక కలుగును-61/1. మూర్చ రోగము కలవారు, ఊబ శరీరము కలవారు బదరిని దర్శించినచో ముక్తి వారి (రచేతి యందుండును-62/2,3. జ్ఞానులైనప్పటికి, అఙ్ఞానులైనప్పటికి సన్యాసము స్వీకరించి, వ్రతములను గ్రహించి బదరిని దర్శించినచో వారు కోరిన కోర్కెలన్నియు తీరును-63. ఈ అధ్యాయమును ప్రసంగవశాత్తు విన్నను పాపములన్నియు నశించి విష్ణులోకమును పొందును.

ఎనభై ఒక్కవేల శ్లోకములు కల శ్రీ స్కాంద మహాపురాణమందలి రెండవదగు వైష్ణవ ఖండమున శివకార్తికేయ సంవాదమున ఐదవ అధ్యాయము.