స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని బదరి క్షేత్ర మహాత్మ్యము

7వ అధ్యాయము

శివుడు చెప్పెను:- దానికి నైరృతి దిక్కున ఐదుధారలు పడుచుండును. అవి ప్రభాసము, పుష్కరము, గయ, నైమిశము, కురుక్షేత్రము. ఈ ఐదు క్షేత్రములు ఇచట ద్రవరూపమున ఉన్నవి-1. పూర్వము ఈ ఐదు క్షేత్రములు తమ మలినముగు రూపములతో బ్రహ్మ వద్దకు వెళ్ళెను. జనులు నిరంతరము తమ పాపములను పోగొట్టుకొనుటకై ఈ క్షేత్రములను దర్శించుట వారి పాపములన్నియు ఆ క్షేత్రములకంటే అవి మలినములైనవి-2. వారు బ్రహ్మకు నమస్కరించి తాము వచ్చిన కారణము చెప్పిరి-3. అది విని చిరునవ్వు నవ్వి ధ్యానమగ్నుడై బదరికాశ్రమమును తలచికొని ఇట్లు చెప్పెను-4, భయము వలదు మీరు వెంటనే విష్ణువు నివసించు బదరికాశ్రమ మునకు వెళ్ళినచో స్వామి నిర్దేశము చేతనే మీకు పుణ్యము కలుగగలదు.

పిమ్మట వారు ఆనందాతిరేకముచే బ్రహ్మకు నమస్కరించి, విప్పారిన కన్నులతో అమిత ప్రభావముకల ‘విశాల' అను పేరుగల బదరికి వెళ్ళిరి-6. అచట ప్రవేశించినంతనే తమ పాపములన్ని తొలగగా పూర్వ రూపములు పొంది తమ తమ స్థానములకు వెళ్ళిరి-7. ఒక రూపమున ద్రవములుగా మారి పంచతీర్థములుగా బదరియందు వసింపసాగిరి. వాటియందు విధివిదానముగ స్నానము చేసి నిత్యక్రియలు చేసినచో ఆయాక్షేత్రములయందు స్నానము చేసిన ఫలమును ముక్తిని పొందెదరు - 8,9/1. ఐదు దినములు ఉపవాసముచేసి స్వామిని పూజించినచో ఇహలోకమున భోగములనుభవించి విష్ణుసాలోక్యమును పొందెదరు-9/2, 10. అచటనే సోమ కుండములను తీర్థము కలదు. అచట కళానిధియగు చంద్రుడు తపస్సు చేసెను.

స్కందుడు అడిగెను:- ఓ తండ్రీ, నాకు సోమకుండముయొక్క మాహాత్మ్యమును గూర్చి తెల్పుము. నీ అనుగ్రహమువలన దానిని గూర్చి వినగోరుచుంటిని.

శివుడు చెప్పెను:- పూర్వము అత్రీకుమారుడగు చంద్రుడు యౌవనము వచ్చిన పిమ్మట స్వర్గములో ఉండు దేవతల వైభోగమును గంధర్వులనుండి విని తన తండ్రిని ఇట్లు ఆడిగెను.

చంద్రుడు ఆడిగెను:- సర్వ ధర్మములు తెలిసిన , కరుణామృత సముద్రుడవైన ఓ తండ్రీ! ఉత్తమోత్తమగు స్వర్గమును ఎట్లు పొందవలెను -14. గ్రహములకు, నక్షత్రములకు, తారలకు, ఓషధులకు ప్రభువునెట్లగుదునో దయచేసి చెప్పుము.

అత్రి చెప్పెను:- యమనియమములచే గోవిందుని పూజించినచో ఇహపరములయందు పొందలేనిది ఏది కలదు?16. పిమ్మట నారదుని వద్ద బదరీమాహాత్మ్యమును తెలసికొని తండ్రికి నమస్కరించి అచటకు వెళ్ళేను-17. పవిత్రమైన పండ్లతో స్వామిని పూజించి మనోహరమగు అష్టాక్షరీ మంత్రమును జపించెను.

          సమస్త లోకములకు భయము కలుగునట్లు విష్ణువు కొరకు ఎనభై ఎనిమిది వేల సంవత్సరములు ఘోరమగు తపస్సు చేసెను-19. అపుడు భక్త వత్సలుడగు స్వామి వచ్చి చంద్రుని వరము కోరుకొమ్మనెను-20. చంద్రుడు లేచి స్వామికి మరల మరల నమస్కరించి గ్రహ నక్షత్ర తారలకు, ఓషధులకు, బ్రాహ్మణులకు తాను అధినాథుడగునట్లు వరము వేడెను.

స్వామి పలికెను:- నీ వంటి వారికి ఇది దుర్లభము. కనుక వేరు వరము కోరుకొమ్మనెను. కాని చంద్రుడు కోరలేదు22. మిక్కిలి విచారించి దేవమానమున ముప్పైవేల సంవత్సరములు గొప్ప తపస్సు చేసెను-23. కరుణాపూర్ణుడగు విష్ణువు మరల ప్రత్యక్షమై వరమునిచ్చుటకు వచ్చిన తననుండి వరము కోరుకొమ్మని పలుకగా చంద్రుడు తిరిగి ఆ వరమునే కోరుకొనెను. స్వామి ఆ వరమీయక తిరిగి అంతర్థానమయ్యెను.

  చంద్రుడు మిక్కిలి దుఃఖించి తిరిగి నలభై వేల సంవత్సరములు గొప్ప తపస్సు చేసెను-25. స్వామి శంఖచక్ర గదాధరుడై ప్రత్యక్షమై మిక్కిలి అలసిన తపోనిధి అగు చంద్రునితో ఇట్లు పలికెను-26. చక్కని వ్రతమాచరించిన ఓ చంద్రుడా లెమ్ము, నీ తపస్సుచే మిక్కిలి ప్రసన్నుడనైతిని.

చంద్రుడు పలికెను:- ఓ భగవాన్! నీవు తుష్టుడవైనచో నాకు గ్రహనక్షత్రతారాఓషధి బ్రాహ్మణరాత్రులకు అధిపతిగ చేయుము.

స్వామి పలికెను:- వత్సా! నీవు కోరినది దుర్లభము ఐనప్పటికి అనుగ్రహించుచున్నాను. నీవు కోరినట్లు కాగలదు అని పలుకగా అపుడు దేవతలందరు అచటకు వచ్చి చంద్రుని రాజుగా అభిషేకించిరి-29. అపుడు చంద్రుడు చక్కని వస్త్రములు ధరించి దివ్య విమానమెక్కి దేవతలు స్తుతించుచుండగా దీవికి వెళ్ళేను.

          అప్పటినుండి ఆ తీర్థమునకు సోమకుండమని పేరు వచ్చెను. దానిని చూచినంతనే మానవులు తమ పాపములనుండి ముక్తిని పొందెదరు-31. దానిని తాకినచో సోమలోకమును చేరుదురు. స్నానముచేసి పితరులకు తర్పణమిచ్చినచో సోమలోకము దాటి విష్ణులోకమును పొందెదరు-32, 33/1. మూడు దినములు ఉపవాసము చేసి స్వామిని పూజించినచో కోటి కల్పముల కైనను వారికి పునర్జన్మ కలుగదు-33/2, 34/1. మూడురాత్రులు నిలబడి స్వామిని పూజించినచో విశేషమగు జపము చేసినచో మనోవాక్కాయములచే తెలిసి చేసిన పాపముకూడ నశించును-35.అచటనే ఆదిత్య తీర్థము కూడ కలదు. అచట కశ్యపుని కుమారుడగు ఆదిత్యుడు తపమొనరించి సూర్యత్వమును పొందెను-36. ఇటువంటి తీర్థము ముల్లోకములయందు దుర్లభము. ఆదివారమునాడు సప్తమియందు, సంక్రాంతియందు విధి, విధానముగ ఈ తీర్థమున స్నానము చేసినచో ఏడు జన్మలనుండి చేసిన పాపమంతయు నశించును.

యథావిధిగ చేసి స్వామిని పూజింపవలెను. అపుడు సూర్యలోకము భోగములనుభవించి విష్ణులోకమును పొందును -38. మహారోగములు కలవారైనప్పటికి సూర్యతీర్థమున స్నానము చేసి శుచిగ నీటిని త్రాగినచో కొద్దికాలమునందే రోగములనుండి ముక్తి కలుగు ననుటలో ఎటువంటి సందేహము లేదు- 39. అచటనే నాలు ధారలు కల ఒక తీర్థము చూడముచ్చట గొల్పుచుండును. ధర్మము, అర్థము, కామము, మోక్షము అచట ద్రవరూపమున ఉన్నవి-40. ఈ వైష్ణవ క్షేత్రమందు స్వామి ఆజ్ఞపై పురుషార్ధములు నాలుగు ద్రవరూపమున ఉండి జీవులకు ముక్తినిచ్చుచున్నవి- 41. తూర్పునుండి దిక్కు కొకటిగ ఉన్న ఈ పురుషార్థములను క్రమముగ సేవించినచో వారికి ప్రసన్నత కలుగును- 42. ఈ నాలుగు పురుషార్థములను జలరూపమున మరి ఏ ఇతర తీర్థమునందు చూచుటకు వీలుకాదు. పూర్వజన్మమందు ఎంతో పుణ్యము చేసిన వారు మాత్రమే మరుజన్మ త్వరగా పొంది ఆ తీర్థములను దర్శించుకొందురు.


 

 దుర్జనులు, దుర్జనులతో కూడిన వారు, క్షమ, ఆర్జవము, ప్రాణము, జయము మాత్రమే ప్రధానముగా కలవారు, గ్రామ్యస్త్రీలయందు రమింపగోరువారు ఈ పురుషార్ధతీర్థములను చూడలేరు-44. తత్యజ్ఞానము కలిగినచో అచిరకాలమునందే ఈ తీర్థములను చూడవచ్చును-45. పూర్వకాలమందు బ్రహ్మ, దేవతలు, ఋషులు, తపోధనులు ఇచట స్నానము చేయుటకు వచ్చెదరు-46. అచటనే సత్యపదము అను మనోహరమగు తీర్థము కలదు. అది త్రికోణాకారమున ఉండును కల్మషమును నాశనము చేయును. ఏకాదశియందు హరిస్వయముగ పావనమగు ఆ తీర్థమునకు వచ్చును-47. అపుడే అందరు ఋషులు, తపోధనులగు మునులు యథావిధిగ స్నానము చేయుటకు అచటకు వచ్చేదరు- 48. హరివాసరమందు మధ్యాహ్నమున గంధర్వులు, అప్సరసలు సత్యవ్రతపరాయణులై ఇచట గానము చేయుదురు- 49. ఈ తీర్థమును దర్శించినచో మహాపాతకములైనను సింహమును చూచిన లేళ్ళవలె భీతిల్లి పారిపోవును.

తన శాఖకు అనుగుణముగా స్నానము చేసినచో ముందుగా సత్యలోకమును పొంది పిమ్మట ముక్తిని పొందును51. అహోరాత్రము శుచియై ఉపవాసముండి స్వామిని యథాశక్తి పూజించినచో ముక్తికి అర్హత పొందును- 52. ఆ త్రికోణ తీర్థముయొక్క కోణములయందు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు కలరు. కనుక అచట సమస్తలోకములకు సంతోషము కలిగించుటకై తపము చేయవలెను- 53. మూడు కోణములు కల ఆ తీర్థము సత్యపదమును ప్రసాదించును. కనుక మోక్షము కోరువారు ప్రయత్న పూర్వకముగ ఆ తీర్థమును దర్శింపవలెను- 54. అచట జపము, తపము,విష్ణువుకు స్తోత్రము, పూజ, స్తుతి నమస్కారము చేయువారి గొప్పదనమును వర్ణించుట బ్రహ్మకు కూడ శక్యము కాదు-55. అచటనే అతి విమలమను పేరుగల నరనారాయణాశ్రమము కలదు. అచట పరమనిర్మలమగు రెండు దారులు కలవు-56, ఆ రెండు దారులచే నరనారాయణులకు ప్రీతికల్గును. అచట స్నానము చేసి స్వామిని దర్శించినచో అన్ని పాపముల నుండి ఆ క్షణమే నిస్సంశయముగ ముక్తి పొందును.

 పవిత్రమగు నారాయణాశ్రమము వద్దవే ఊర్వశీ తీర్థము కలదు.

స్కందుడు ఆడిగెను:- ఆ శిఖరము పై ఊర్వశి ఎట్లు అభివ్యక్తమగును. దానివలన ఎట్టి పుణ్యము, ఫలము కలుగునో తెల్పుము.

శివుడు చెప్పెను:- ధర్మునికి మూర్తి అను భార్యయందు నరనారాయణుల రూపమున భగవంతుడు జన్మించెను60. తపము చేయ నిశ్చయించుకొని తండ్రి ఆజ్ఞను పొంది రెండు పర్వత శిఖరములపై మూర్తి కట్టిన తపమువలె వారు ఉండిరి- 61. వారిని చూచి ఆశ్చర్యపడి ఇంద్రుడు వారి తపోభంగమునకై మన్మథుని సపరివారముగ గంధమాదనమునకు పంపెను -62.వారు తమ శక్తి కొలది ప్రయత్నించి నారాయణుని శక్తి ఎదుట బలము చాలని వారి విచారించుచుండగా వారితో స్వామి ఇట్లు పలికెను.

స్వామి పలికెను:- మీరు ఏల ఇచటకు వచ్చితిరి? మా ఆతిథ్యమును స్వీకరించుడు - 64. అని పలికి వారికి పండ్లు, మూలములు ఇచ్చి ఊర్వశిని కూడ ఇచ్చి అందరూ చూచుచుండగనే అంతర్థానమయ్యెను - 65. మన్మథాదులు స్వర్గమునకు తిరిగి వెళ్ళి స్వామి బలమును గూర్చి చెప్పి ఊర్వశిని అర్పించిరి. ఇంద్రుడు మిక్కిలి సంతోషించెను - 66. అప్పటినుండి ఆ తీర్థమునకు ఊర్వశీ తీర్థమని పేరు వచ్చెను. అచట స్వామి స్వయముగ తపోమయుడై నివసించు చుండును - 67. అచట విధి విధానముగ స్నానము చేసి రెండు దినములు ఉపవాసము చేసి నారాయణుని పూజించినచో నరుడే నారాయణుడగును - 68. ఊర్వశి కుండమును చేరి కోర్కెలతో అచట స్నానము చేసినచో ఊర్వశీ లోకమును పొందును.

 ఆ ఊర్వశీకుండము వద్ద స్వామి తపోమూర్తియై నిలచి సమస్త జీవులకు వారు కోరినవి ప్రసాదించుచుండును -70. స్వామి పాదములపై నుండి వీచు సుగంధము తగిలినచో కలికాలమునందు పాపములతో మునిగిన మానవులకు పాపభారము తొలగి పునర్జన్మ నశించును -71. స్వామి పాదములను ఆశ్రయించి కొండ గుహలలో స్వామిని సేవించుచు స్వామి పాదములను మోయుచు వాయువు అందరి పాపములు పోగొట్టుచుండును - 72. మిక్కిలి పాపము చేసి కీటకముగా పుట్టిన జీవికూడ తన పాపములన్నియు తొలగి దేవతలను కూడ ఉపహసించును.అచట నివసించుచు పూవులు అర్పించినచో చిరకాలమునుండి ఉన్న ఆత్మయోగమును విడచి స్వామి పదమును చేరును -73. అచట తపస్సు చేయు మునులు వెలుపలి పదార్థములపై నుండి దృష్టి మరల్చి స్వామి పదములపై చూపు నిల్పెదరు. తన పదములను ఆశ్రయించిన వారిని స్వామియే స్వయముగ రక్షించును -74. నారాయణుడు నివసించు ఆ పర్వతము పై మరిన్ని తీర్థములు కలవు. అవి అన్నియు పాపమును శీఘ్రముగ తొలగించు కలిగినవి -75. సంసారకూపమునందు చిక్కిన మానవులు ఒక్క దినము ఊర్వశీ కుండము వద్ద నివసించినచో విముక్తి పొందెదరు- 76. ఊర్వశీ కుండమునకు దక్షిణ భాగమున స్వామి ఆయుధములు కలవు. వాటిని దర్శించినచో ఎప్పుడును శస్త్ర భయముండదు - 77. దీనిని భక్తితో విన్నవారికి చెప్పినవారికి పాపములన్నియు తొలగి విష్ణుసాలోక్యము కలుగును.

ఎనభై ఒక్కవేల శ్లోకములు కల శ్రీ స్కాంద మహాపురాణమందు రెండవదగు వైష్ణవ ఖండమున బదరికాశ్రమ మాహాత్మ్యమందలి శివకార్తికేయసంవాదమున పంచధారా తీర్థమాహాత్మ్యవర్ణనమను ఏడవ అధ్యాయము.