స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని బదరి క్షేత్ర మహాత్మ్యము

6వ అధ్యాయము

స్కందుడు అడిగెను:- ఓ తండ్రీ! నీ చేతినుండి కపాలము జారిపడిన చోట గల తీర్థముయొక్క మాహాత్మ్యమును . దయతో తెల్పుము-1.

శివుడు చెప్పెను:- ది మిక్కిలి రహస్యమైనది. సురాసురులు నమస్కరించునది. బ్రహ్మహత్యాపాతకమును కూడ పోగొట్టునది-2. కపాలమునందు ఐదు తీరములు కలవు. అచట చేసిన తపము, దానము, స్నానము అన్నియు ఉద్దరింపబడుదురు. తిలతర్పణమిచ్చినచో వారు స్వర్గమును పొందుదురు-5. రాత్రింబవళ్ళు నిష్ఠతో జపము చేసినచో అతడు కోరినది ఆ క్షణమే తీరును-6. కపాలమోచనమునందు పితృకర్మలు చేయుట ఇతర పార లౌకిక కర్మలు చేయుట కంటే అధికము.

          స్కందుడు అడిగెను:- బ్రహ్మతీర్థము ఎచట ఉన్నది? ఎట్టి ఫలము కలుగును. అచట ఎవరు నివసింతురు?

శివుడు చెప్పెను:- ఒకసారి విష్ణువు నాభియందు పుట్టిన పద్మమందున బ్రహ్మవద్ద నుండి మధుకైటభులు వేదములను ఎత్తుకొనిపోయిరి -9, నిద్రలేచిన బ్రహ్మ వేదములు కానరాక సృష్టి క్రమము మరచెను-10. అపుడు బదరికి వచ్చి సనాతనుడగు స్వామికి నమస్కరించి స్తుతించెను-11. అపుడు స్వామి కుండమునుండి గుర్రపుతలతో తన ఆయుధములు ధరించి పట్టు బట్టలు ధరించి, తెల్లని మేనిఛాయతో, నాలుగు చేతులతో మండుచున్న చూపులతో ఉద్భవించెను–12. అత్యద్భుతముగా కఠోరములగు చూపులతో కదలుచు ఉరుముచున్న మేఘములవంటి శబ్దముతో, తన తేజస్సుచే తక్కిన కాంతులను తక్కువ చేయుచు కృపామయుడై బ్రహ్మ ఎదుట నిలచెను-13. బ్రహ్మ మిక్కిలి ఆశ్చర్యము చెంది, నమస్కరించి, స్తుతించి ప్రసన్నుని చేసి కొనెను-14.

బ్రహ్మపలికెను:-ఓ కమలనాభా!, కమలాశ్రయా!, కమలవాసా!, విశాలవనమాలీ నీకు నమస్కారము-15. ఓ విజ్ఞానమాత్రా! గుహావాస నివాసీ! హృషీకేశా, శాంతుడా భగవంతుడా. నీకు నమస్కారము-16. నీ భక్తులను రక్షించుటకు బ్రహ్మనే నీకు నమస్కారము-17. సంసారమందలి వివిధ అసారములను నివృత్తి చేయువాడా, సమస్త జీవులను కాపాడువాడా, ఓ విష్ణు, జిష్ణూ నీకు నమస్కారము -18. విశ్వమందంతట నిండినవాడా! అశేషముగ నివృత్తి పొందిన గుణవృత్తులు కలవాడా, సురాసురులలో ఉత్తముడైనవాడా, సృష్టి స్థితిలయలకు హేతువైన వాడా నీకు నమస్కారము-19. అని బ్రహ్మ ప్రార్థింపగా సమస్త జీవుల మనస్సులలో ఉండు స్వామి దేవతలకు ద్రోహము చేసిన ఆ మధు కైటభులను అవలీలగా చంపి వేదములను రక్షించేను.

         తాను తెచ్చిన వేదములను బ్రహ్మ కిచ్చెను. బ్రహ్మ స్వస్థుడయ్యెను-21. అప్పటి నుండి ఆ తీర్ధము బ్రహ్మకుండమని ముల్లోకములలో ప్రసిద్ధి కెక్కునని బ్రహ్మ ప్రకటించెను-22. దానిని దర్శించినచో మహాపాతకములు చేసిన వారైనను వారి పాపములనుండి ముక్తులై బ్రహ్మలోకమును పొందెదరు-23. అచట స్నానము చేసినచో లేదా వ్రతముల నాచరించినచో బ్రహ్మలోకమును దాటి విష్ణులోకమును పొందెదరు-24.

స్కందుడు అడిగెను:- వేదములను విష్ణువునుండి గ్రహించిన బ్రహ్మ పిమ్మట ఏమి చేసెనో తెల్పుము.

మహాదేవుడు చెప్పెను:- బదరిని చూచిన నాలుగు వేదములు బ్రహ్మతో వెళ్ళుటకు ఇచ్చగింపలేదు-26. అది చూచి బ్రహ్మ ఆందోళన చెందగా అచట నున్న సిద్ధులు బ్రహ్మను విధివిధానముగ సతించి ఇట్లు పలికిరి.

 సిద్దులు పలికిరి:- చరాచరములన్నియు స్వామి ఆజ్ఞను ఔదలదాల్చవలెను. ఏలననగా స్వామియే సమస్తమునకు కర్త, హర్త, పిత, గురువు-28. మీరు బ్రహ్మ వద్ద ఉండవలెనని స్వామియే కల్పించెను. కనుక మీరు ఆ ఆజ్ఞనను తప్పక పరిపాలింపవలెను-29. మీరు ద్రవరూపమున ఇచట నిలచి రెండవరూపమున బ్రహ్మతో కలసి బ్రహ్మ లోకమునకు వెళ్ళవలెను-30. అని సిద్ధులు ప్రార్ధింపగా వేదములు అందుకు అంగీకరించి రెండు రూపములను పొంది. ఒక రూపములో ద్రవరూపమున బదరి యందున్న వేదముల కొరకు చేసిన స్నానము, దానము, తపము మొదలగు క్రియలు భూత ప్రళయము సంభవించునంతవరకు నిలచును- 32. ఫలమును కోరి మూడు ఉపవాసములు చేసినవారు నాల్గు వేదములకు వ్యాఖ్యాతలు కాగలరు.

         స్వామి వద్ద నాలు వేదములు తమ క్రమములో నిలచియుండును-34. పుణ్యము చేసినవారు, కల్మషము లేక వేదవేదాంగములు నేర్చినవారు కలియుగమందు కూడ స్వామీ సమీపమున వేదఘోషను వినగలుగుదురు-35. ద్రవరూపమున ఉన్న నాలు వేదములకు జలరూపమే సరస్వతీనది. ఆ నదిని గూర్చి జపము చేసినచో మానవుడు జడత్వమును హరించును -36. సరస్వతీనదీ జలములయందు నిలచి నిగ్రహముతో జపము చేసినచో మనువు నుండి వారి వంశమునకు ఎప్పుడును విచ్ఛేదము కలుగదు-37. భగవాన్ వేదవ్యాసుడు కూడ సరస్వతీ నది ప్రసాదము వల్లనే పురాణములను భారతమును రచించేను-38. ముల్లోకములకు హితమును కలిగించుటకై విష్ణువు బ్రహ్మచే వాగ్వైభవమును కలుగజేయు సరస్వతిని సృజింపచేసెను-39. ఆ సరస్వతిని చూచుటచే, తాకుటచే, స్నానము చేయుటచే పూజించుటచే వంశము నిరంతరముగా కొనసాగును.

         సరస్వతి ఒడ్డున జపము చేసినవారికి అచిరకాలమునందే నిస్సంశయముగ మంత్రసిద్ధి కలుగును-41. ఇంత చెప్పుట ఏల, సరస్వతీ నది సాక్షాత్తుగా సరస్వతియే. ద్రవరూపమును ధరించి మానవులను పరిపూర్ణులుగ చేయును-42. ఆ నదికి దక్షిణ భాగమునున్న ప్రదేశమునకు ద్రవధార అని పేరు. అచట ఇంద్రపదము అను తీర్థమున్నది. అచట ఒకప్పుడు ఇంద్రుడు తపస్సు చేసెను-43. తీవ్రమగు తపస్సు చేసి స్వామిని మెప్పించి సురాసురులు నమస్కరించు ఇంద్రపదవిని పొందెను-44. తపము, దానము,జపము, హోమము, వ్రతములు, నియమములు, యమములు ఆ తీర్థమువద్ద అనంతమగు ఫలమునిచ్చును-45. ప్రతిమాసమందు శుక్ల పక్ష త్రయోదశి నాడు స్వామికి సంతోషము కలిగించుటకై ఇంద్రతీర్థమున.

 అచటనే మానసోద్భేదము కలదు. అది అన్ని పాపములను నశింపజేయును. మహర్షులు నివసించు ఆ ప్రదేశమునకు చేరుట మానవులకు మిక్కిలి దుర్లభము-48. మనస్సులో ఉండు చిత్, అచిత్ అను గ్రంథులను ఛేదించునది. కనుక ఋషులు దానిని మానసోద్చేదమందురు-49. హృదయగ్రంథులను భేదించి, పెక్కు సంశయములను భేదించి, కర్మలను నశింపజేయునది కనుక మానసోద్భేదమయ్యెను-50. అచట తన భాగ్యవశమున మానవుడు ఒక్క బిందువు పొందినను తత్క్షణమే ముక్తి పొందును. అంతకు మించి పొందునది ఏమున్నది?- 51. కొండ గుహలలో ఋషులు పండ్లు దుంపలు నీరు మాత్రమే గ్రహించుచు మనో విషయములను జయించి, శుద్ధి పొందిన బుద్ధికలవారై కలికి భయపడునట్లు పాపమునకు భయపడుగురు-52. పండ్లు, గాలి, గుహలు, సెలయేళ్ళు, ఆశ్రమములతో నిండిన ఆ ప్రదేశమున మునులు త్రిషవణ క్రమముచే దుర్జయములగు ఇంద్రియములను కూడ జయించి రాక్రమవంతులగుదురు.

మోక్షసాధనమునకు లోకమునందు శరీరము కష్టపెట్టు పెక్కు సాధనములు కలవు. కాని సులభమగు సాధనము మానసోద్భేద దర్శనమే-54. ఆ మానసోద్భేదమందు నీటిని ఎప్పుడు తాకునో అప్పుడు వ్యాసునితో, సూర్యునితో సమానుడగును -55. కోరికలున్నవారు ఇచట స్నానము చేసినచో వారి కోరికలు తీరును. కోరికలు లేక స్నానము చేసినచో ముక్తి కలుగును - 56. ప్రమాదశాత్తు ఎవరైన కోరికలు కోరినచో వారు ఆ ఫలమును అనుభవించి పిమ్మట నిస్సంశయముగ ముక్తి పొందుదురు -57. కోరికలను కోరినవారు మహదాది లోకములందు తమ కోరికలు తీరగా అపుడు ముక్తిని పొందుదురు-58. పురుషార్థములను సాధించుటకై సాధారణముగ ప్రయత్నము చేయవలెను. కాని మానసోద్భేదమున స్నానము చేసినచో అవి అప్రయత్నముగనే సిద్ధించును-59, ఈ మానసోద్భేదమునకు తూర్పు దిశగా అందరి మనస్సులను ఆకర్షించు వసుధార అను దుర్లభమగు తీర్థము కలదు.

          ముల్లోకములందలి తీర్థములన్నిటిలో శ్రేష్టమైనది బదరికాశ్రమమని నారదుడు చెప్పగా విని వసువులు అచటకు వచ్చిరి-61. ముప్పై వేల సంవత్సరములు పరమ దారుణమగు తపస్సును కేవలము ఆకులు, నీరు మాత్రము సేవించుచు చేసి సిద్ధిని పొందిరి-62. స్వామిని దర్శించి తమ వైక్లమ్యములని తొలగిపోగా హృదయమునందు ఆనందసందోహముచే ముఖపద్మములు వికసించగా-63. స్వామినుండి మనస్సు రంజింపజేయు వరములను పొంది, హరిభక్తి అను సుఖమును, ఐశ్వర్యమును పొంది, మిక్కిలి ఆనందించిరి-64. కనుక ఇచట స్నానము చేసి నీటిని త్రాగి స్వామిని పూజించినచో ఇహలోకమందు సుఖమనుభవించి చివరకు పరమ పదమును చేరుదురు-65. ఇచట నీటిమధ్యలో పుణ్యాత్ముల జ్యోతి వెలుగుచుండును. దానిని చూచినచో పునర్జన్మ కలుగదు.

          అశుద్ధులగు తండ్రుల వలన జన్మించిన వారిపై, పాపులపై, పాషండ జాతి వలె ప్రవర్తించు వారిపై ఆ తీర్థము యొక్క నీరు పడదు-67. సాధువులు ఇచట మూడు దినములు శుచులై స్వామిని పూజించి, భగవంతుని యందు భక్తితో ఉపవాసముండి సిద్దులను కాంచుదురు-68. చపలమగు బుద్ధికలవారికి, నిజము పలుకనివారికి, విషయ లోలురైనవారికి, పరిహాసము లాడువారికి, పరుల ద్రవ్యమును, స్త్రీలను అపహరించువారికి, కపటముగ ఆగ్రహము చూపు వారికి-69. అశుభ్రములగు వస్త్రములు ధరించువారికి శాంతులు కానివారికి, అశుచులై సర్రియలను వదలినవారికి, మలినమగు చిత్తము కలిగినవారికి ఇచట ఫలము లభింపదు-70. శాంతులై, విమలురై, విధిని అనుసరించుచు జపము, తపము, హోమము, దానము, వ్రతము, జపక్రియలు తమ శక్తి కొలది చేయువారికి అక్షయమగు ఫలము లభించును-71,72. జీవులు ఇచట దేవతలు కూడ ఇచటకు ఫలార్థులై వత్తురు. సంతోషముతో స్వామిని పూజించి తమ ఈప్సితార్థములను పొంది స్వర్గమునకు వెళ్ళేదరు-74.కర్మలకు విఘ్నములు కలిగించు కారణములు బదరియందు స్వామికి భయపడి దూరముగా ఉండుటచే సత్పురుషులు నిరాటంకముగా సత్కర్మలు చేయుచుందురు-75. ఈ పుణ్యతీర్థముల విషయమును పఠించినను, పఠింపచేసినను వారు భక్తి భావముతో సమలంకృతులై వైకుంఠమును చేరుదురు.

ఎనభై ఒక్కవేల శ్లోకములు కల శ్రీ స్కాంద మహాపురాణమందలి రెండవదగు వైష్ణవఖండమున బదరికాశ్రమమాహాత్మ్యమున శివకార్తికేయ సంవాదమందలి వసుధారాతీర్థమాహాత్మ్యవర్ణనము అను ఆరవ అధ్యాయము.