స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని బదరి క్షేత్ర మహాత్మ్యము

4వ అధ్యాయము

స్కందుడు అడిగెను:- వైనతేయ శిలయొక్క మాహాత్మ్యమును, దానివలన కలుగు పుణ్యమును, ఫలమును, ప్రభావమును నాకు తెల్పుము - 1.

శివుడు చెప్పెను:- కశ్యపుని వలన వినతకు గరుడుడు, ఆరుణుడు అను ఇద్దరు గొప్పబలపరాక్రమములు కల పుత్రులు పుట్టిరి. వారిలో అరుణుడు సూర్యుని రథమునకు సారథి. బదరికి దక్షిణ భాగమందున్న గంధమాదన పర్వతముపై విష్ణు వాహనమగుటకై గరుడుడు గొప్ప తపస్సు చేసెను-4. ఇట్లు హరిని చూడగోరి ముప్పై వేల సంవత్సరములు గడచిపోగా స్వామి పట్టు బట్టలు ధరించి, తన ఆయుధములతో-5. తూర్పు దిక్కున పున్నమి చంద్రునివలె ఆవిర్భవించి మేఘ గంభీరమగు కంఠస్వరముతో గరుడుని పిలచెను-6. ఐనప్పటికి అంతః సమాధియందున్న గరుడుడు తన తపస్సును వదలి బహిర్ముఖుడు కాలేదు-7. అపుడు స్వామి గరుడుని లోనికి గాలి రూపమున ప్రవేశించి బహిర్ముఖునిగా చేసి బయటకు వచ్చెను-8. భగవంతుడగు విష్ణువును చూచి గరుడడు తొట్రుపాటును వదలి, ఆనందముతో పులకరించగా స్వామిని చేతులు జోడించి ఇట్లు స్తుతించెను-9.

ముల్లోకములయందలి జనుల మనస్సులలో గల పాపసమూహమును త్రుంచినవాడా, నీకు జయము. సమస్త దేవతలు నమస్కరించు పదకమలముల పరిమళముచే శత్రువులను అడచినవాడా! ప్రకాశించుచున్న సమస్త దేవతల దానవుల కిరీటముల కాంతిచే విలసిల్లుచున్న పాదపీఠము కలవాడా! నిన్ను శరణుకోరిన వారి మనస్సులలోని చీకట్లను తొలగించువాడా! చంద్రుని వలే మూడు విధములగు సంతాప సమూహమును హరించి పదయుగళము కలవాడా! జగత్తు యొక్క సృష్టి స్థితిలయలకు కారణమగువాడా! మూడు మూర్తుల యొక్క కీర్తిచే వ్యాపించిన సమస్త విశ్వము కలవాడా! సూర్యునివలె నీ భక్తుల హృదయములను పద్మములకు తుమ్మెద వంటివాడా! సమస్త వేదములచే తెలియబడు మానసము కలవాడా! నిజజనులు, మునిజనులు నమస్కరించు కాలిగోళ్ళను నమస్కరించు దేవతా సమూహము కలవాడా! ఓ జగన్నాథా నీకు నమస్కారము. 10. మరియు. ఎనిమిది శక్తులతో కూడి వనమాలను ధరించి పట్టు వస్త్రములు, పూలమాలలు ధరించి, లక్ష్మి పాదములొత్తుచుండగా విలసిల్లు ఓ స్వామీ నన్ను రక్షింపుము-11. భక్తుల హృత్పద్మాలపై విలసిల్లు మూర్తితో, దుష్టదానవులను నీర్షించిన కీర్తితో, శరణుకోరినవారిని కాపాడు వారధివైన ఓ భువనేశా నన్ను కాపాడుము-12. చరాచరముల మూడు విధములగు తాపములను హరించు చంద్రునివంటివాడా, వెలుగుచున్న సూర్యునివంటి కాంతి కలవాడా! ఒక్కడవైనప్పటికి పెక్కు రూపములు ధరించువాడా, మహామతీ, ఈశ నీమాయచే నన్ను కాపాడుము-13. భక్తి చింతనము చేయువారికి కోరిన రూపమున మార్గము ననుసరించి గొప్పమేలు చేయువాడా. ప్రభువుయొక్క రీతి ఇది అని చూపు ఓ గుణశాలి నన్ను రక్షింపుము-14.

         యజ్ఞమును భుజించువాడా, హృదయబంధమును ధరించువాడా! విశ్వమూర్తీ, అబలల వస్త్రములను అపహరించినవాడా! పాలించుటయందు గొప్పవారి కొరకు పెక్కు దేహములను ధరించినవాడా! ఇది నీకు విలాసము. మమ్ము కాపాడుము-15. నీ యందు ప్రేమ, భక్తి కల పురుషులకు మాత్రమే లభించువాడా, అంతటా నివసించు విరాట్పురుషా! నిన్ను ఆశ్రయించిన దాసులను సంతోషపెట్టువాడా! చూపుచేతనే కరుణ కురిపించువాడా,ఈ లోకమును కాపాడుము-16. కంఠమున ధరించిన సివంగి కాలిగోటితో గోపరమణీమణుల స్తనములపై గీతలు పెట్టువాడా, ఆ యువతులచే విలాసముగా పెక్కు రూపములతో అలంకరింపబడువాడా, ఈ నమస్కారము నీకు శాంతిని కలిగించుగాక!-17. దండము ధరించిన నీ హస్తమే జనులకు వారి హితమును ఆదేశించునది. గొప్పవారిని కూడా పవిత్రులను చేయునది, అట్టిహస్తము విశ్వముయొక్క దుఃఖమును శమింపజేయునది అగుగాక-18. ఈ విధముగ గరుడుడు స్వామిని స్తుతించి స్వామి పూజకై త్రిపథగామిని అగు గంగను రావించెను-19. అపుడా గంగ ఐదుపాయలుగా కొండపై ప్రత్యక్షము కాగా గరుడుడు ఆ నీటితో స్వామి పాదములను కడిగెను-20.

         స్వామి వరము కోరుకొమ్మనగా గరుడుడు తాను స్వామి వాహనమగునట్లు, అనంతమగు బల పరాక్రమములు కలిగి సురాసురులచే అజేయుడగునట్లు-21. తాను తపము చేసిన శిల అన్ని పాపములను హరించునదై తన పేరుతో ఖ్యాతి కెక్కునట్లు. ఆ శిలను తలచినంతనే అన్ని విషవ్యాధులు నయమగునట్లు వరములు కోరెను-22. తనయందు వినయముగ నిలచిన గరుడునితో స్వామి వల్లె అని పలికి ఇట్లు చెప్పెను-23. నీవు నారదుడు సేవించిన బదరికి వెళ్ళుము. నారదతీర్థము మున్నగువాటిలో స్నానము చేసి మూడు దినములు ఉపవాసము చేయుము. అచట నేను నీకు సులభముగ దర్శనమిచ్చేదను -24. అని పలికి స్వామి మెరుపు తీగవలె అంతర్ధానమయ్యెమ. అపుడు గరుడు త్వరగా బదరికి చేరెను-25. అగ్ని తీర్థమునకు వచ్చి, శిలమ దర్శించి, వారదాదీ తీర్థములయందు స్నానముచేసి వ్రతము మొదలు పెట్టెను-26.

శివ ఉవాచ :-

             పిమ్మట నారదతీర్థమందు భగవంతుడు ఉండుట చూచి యథావిధిగ నమస్కరించి స్వామి ఆజ్ఞపై నగరమునకు వెళ్ళెను-27. అప్పటినుండి అచటి శిలకు ‘గారుడి’ అను పేరు కలిగెను-28.

స్కందుడు ఆడిగెను:- ఓ ఈశ్వరా! ‘వారాహి’ శిలనుగూర్చి, దాని పుణ్యమును గూర్చి , ఫలమును గూర్చి, ఆ పేరు ఎట్లు కలిగెనో వివరముగా చెప్పుము.

శివుడు చే ప్పెను:- స్వామి యుద్దమునందు హిరణ్యాక్షుని చంపి రసాతలమునుండి భూమిని ఉద్దరించి బదరికి వచ్చెను- 30. కల్పాంతము వరకు యోగమునందు ఇచట నిలచెను. బదరియొక్క గొప్పతనము వలననే స్వామి ఇచట నిలచేను-31. శిలారూపమున స్వామి అచట నిలచెను. అచట స్వచ్చమగు గంగానది నీటియందు స్నానము చేయవలెను-32.

         శక్తి కొలది దానమిచ్చి శాంతమగు మనస్సుతో రాత్రింబవళ్ళు ఏకాగ్రచిత్తముతో ధ్యానము చేయవలెను- 33. అపుడు శిలయందు స్వామి కనిపించును. పిమ్మట సాధకుడు కోరిన కోరికలన్నియు దుష్కరములైనను తీరును-34,35.

స్కందుడు అడిగేమ:- తండ్రీ! నారసింహ శిలామాహాత్మ్యమును తెల్పుము. నీ వలన దుర్లభమైన విషయములెన్నిటినో తెలుసుకొన గలిగితిని-36.

శివుడు చెప్పెను:- హరి హిరణ్య కశిపుని తన గోళ్ళచే చీల్చి క్రోధాగ్నిచే మండుచు ప్రళయ కాలాగ్నివలె ఉండెను. 37. దేవతలు వచ్చి దూరముగా నిలచి విలాసముగా అట్టి రూపమును ధరించిన స్వామిని స్తుతించిరి-38. ప్రసన్నుడైన స్వామి తన ఉగ్రరూపముచే సురాసురులను భయ పెట్టుచు దేవతలకు సుఖము కలిగించు వరము కోరుకొమ్మని మత్తుడై పలికెను-39.

 

 దేవతలకు అధిపతి అయిన బ్రహ్మ చిరునవ్వుతో ఇట్లు పలికెను. ఓ నారసింహా! ఈ అత్యుగమగు రూపము ప్రాణులందరకు భయము కొల్పునది. కనుక దీనిని ఉపసంహరింపుము-40. స్వామి తన రూపమును అనేకములుగా చేసి పర్వతములపై దివ్యమూర్తులుగ ఉంచి ప్రసన్నుడై ఓ దేవతలారా మీ కొరకు ఇంకను చేయవలసినది ఏమున్నది అని ప్రశ్నించెను -41. ఈ దివ్యమగు రూపముచే విశ్వము నంతటిని సంక్షోభపరచితివి. కనుక ప్రశాంతము, ఆంతరంగమున సుఖమునిచ్చునది అగు నాల్గు భుజములు కల రూపమున దర్శనమిమ్ము. అదియే వరము అని దేవతలు పలికిరి-42. స్వామి దానికి అంగీకరించి ప్రసన్నముగా చూచి బదరికాశ్రమమునకు వచ్చి గంగానది యందు క్రీడించుచుందును అని పలికెను-43. దేవతలు భయము తొలగగా నీటి మధ్య నున్న స్వామిని చూచి, నమస్కరించి, ప్రదక్షిణము చేసి శాంత మనస్కులై తమ తమ పురములకు వెళ్ళిరి-44.

 పిమ్మట తపోధనులగు ఋషులు భక్తి భావముతో తలలు వంచి అచటకు వచ్చి అత్యద్భుతమగు నృసింహరూపమును చూచి, చేతులు జోడించి ఇట్లు స్తుతించిరి-45.

ఋషులు పలికిరి- సమస్త లోకముల అధినాథుడా, ఓ విశ్వేశా నీకు నమస్కారము. విశ్వమునకు అభయమిచ్చువాడా! విశ్వమూర్తీ! దయాసముద్రుడా! కొలువదగు పవిత్రమగు పాదపద్మయుగళము కలవాడా! శ్రీశా, మాపై దయ చూపుము కనిపించినట్లు భక్తుల కోరికపై విచిత్రములగు రూపములను పొందు ఓ విశ్వాననా, విశ్వభావనా కృప చూపుము-47.అపుడు స్వామి ప్రసన్నుడై చక్కని వరము కోరుకొమ్మనెను-48.

ఋషులు పలికిరి:- ఓ జగన్నాథా! నీవు సంప్రీతుడవైనచో ఈ బదరిని ఎప్పుడును వదలి పెట్టకుము. మేము కోరు వరము ఇది మాత్రమే -49. స్వామి దానికి అంగీకరించగా ఋషులు వారి వారి ఆశ్రమములకు వెళ్ళిరి. నృసింహుడు శిలారూపమున జలక్రీడలు ఆడుచుండెను-50. మూడుదినములు ఉపవాసముండి జపము, ధ్యానము చేయుచున్నచో స్వామి నృసింహరూపమును తప్పక చూడవచ్చును-51. ఈ కథను శ్రద్దగా విన్నవారు, శుచిగా వినిపించినవారు పాపములు నశించగా వైకుంఠమున స్థానము పొందెదరు-52.

ఎనభై ఒక్కవేల శ్లోకములు కల శ్రీ స్కాంద మహాపురాణమందలి రెండవదగు వైష్ణవఖండమున బదరికాశ్రమ మాహాత్మ్యమందు శివకార్తికేయసంవాదమున గరుడ, వారాహీ, నారసింహ శిలామాహాత్మ్య వర్ణనమను నాల్గవ అధ్యాయము.