స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని బదరి క్షేత్ర మహాత్మ్యము

1వ అధ్యాయము

శౌకుడు పలికెను:- మహానుభావుడగు ఓ సూతుడా! అన్ని ధర్మములు తెలసినవాడా అన్ని శాస్త్రముల సారమును ఎరిగినవాడా, పురాణములయందు పరినిష్ఠితమగు జ్ఞానము కలవాడా! -1. సత్యవతీ పుత్రుడగు వ్యాసుడు విష్ణుస్వరూపుడు. అతడికి నీవు ప్రియశిష్యుడవు. నీకంటే తెలసినవాడు లేడు-2. అన్ని ధర్మములను బహిష్కరించు కలియుగము వచ్చినపుడు ప్రజలు దుష్టకర్మలు చేయుచు ధర్మ భ్రష్టులగుదురు- 3. వారు అల్పమగు ఆయుషు, బలము, వీర్యము, తపము, కర్మలు కలిగి అధర్మ పరాయణులై అన్ని వేదములను, శాస్త్రములను వదలి పెట్టుదురు. 4. తీర్థయాత్రలు, తపస్సు, దానము, విష్ణువుయందలి భక్తి వదలి వేయుదురు. ఇటువంటి అల్పులను కొద్దిపాటి ప్రయత్నముచే ఉద్దరించుట ఎట్లు?- 5. తీర్థములలో ఉత్తమమగు తీర్థమేది? క్షేత్రములలో ఉత్తమమగు క్షేత్రమేది? మోక్షము కోరువారికి సిద్ది ఎచట కలుగును? ఋషులు ఎచట నివసింతురు? - 6. ఎచట కొద్దిపాటి ప్రయత్నముచే కూడ తపము, మంత్రములు సిద్ధినిచ్చును? జగన్నాథుడగు హరి ఎచట నివసించును? భక్తులపై అనుగ్రహము చూపగోరు దయాసముద్రుడు స్వామి ఎచట ఉండును?- 7. ఇది అంతయు నేను ఇతరులకు ప్రయోజనము కలుగుటకై అడుగుచుంటిని. కనుక లోకములను అనుగ్రహించుటకై తెలియజెప్పుము- 8.

         సూతుడు చెప్పెను:-ఓ శౌనకుడా! నీవు అడిగినది చక్కగా ఉన్నది. ఇతరుల కొరకై నీవు అడిగితివి. హరి భక్తిచే నీ మనస్సు స్వచ్చమైనది - 9. ఇపుడు విష్ణువు నా మనస్సున నిలచెను. సత్పురుషులతో సమాగమము దుర్లభము కదా!-10. సాధు సంగమము పాపములనుండి ముక్తి నిచ్చును. ఉత్తమగతిని కల్పించును. మిక్కిలి పుణ్యము చేసినవారికి మాత్రమే కాని నిగ్రహము లేనివారికి సాధు సమాగమము” దుర్లభము-11. మనోబంధములను తెంచును. కర్మపాశములచే చిక్కుబడిన వారికి గొప్ప స్థానమును కల్పించును. జననము, మరణము, కర్మలు, అలసట మొదలగు వాటినుండి విశ్రాంతిని కలిగించును. ముల్లోకముల యందలి జనులకు సత్రసంగము దుర్లభము-12.

సూతుడు పలికెను:- నీవు అడిగిన ఈ ప్రశ్నను పూర్వము కుమారస్వామి శివుని అడిగెను. కైలాసశిఖరము పై ఋషులందరు వినుచుండగా మంచివారికి శుభము కలిగించుటకై స్కందుడు ఈశ్వరుని ఇట్లు అడిగెను-13.

 స్కందుడు అడిగెను:- ఓ భగవాన్! నీవు అన్ని లోకములను సృష్టించువాడవు, హరించువాడవు. సమస్తలోకములకు తండ్రివి, గురువువు. సమస్త జీవులకు క్షేమము కలిగించుటకై తపస్సు చేయువాడవు-14. వేదములను, శాస్త్రములను వదలిపెట్టు కలికాలమునందు సాత్త్యికులను రక్షించు విష్ణువు ఎచట నివసించును?-15. ఏ క్షేత్రములయందు, ఏ పుణ్య తీర్థములయందు, నదులయందు నివసించును? ఎటువంటి భక్తులు స్వామిని పొందగలరు? శ్రద్ధ కలిగిన నాకు, దీనిని గూర్చి తెల్పుము-16.

ఈశ్వరుడు చెప్పెను:- ఓ కుమారా! పరమార్థము కోరువారి కొరకు విష్ణువు నివసించు పెక్కు తీర్థములు, క్షేత్రములు కలవు-17. వాటిలో కొన్ని కోరిన కోర్కెలను తీర్చునవి. కొన్ని ముక్తినిచ్చునవి. కొన్ని ఇహపర లోకముల ప్రయోజనములను తీర్చునవి. పుణ్య ప్రదములైనవి-18. గంగ, గోదావరి, రేవా, తపతి, యమున, క్షిప్రా, సరస్వతీ, గౌతమి, కౌశికి-19. కావేరి, తామసరి. చందబాగ, మహేందజ చితోతుల, వేతనతి సరయూ.20 చరణతి శతదు. అతిసంభవ గండిక. బాహుద

          అవి భుక్తిని ముక్తిని కలిగించును. అయోధ్య, ద్వారక, కాశీ, మధుర, అవంతిక-22. కురుక్షేత్రం, రామతీర్థం, కాంచీ, పురుషోత్తమం, పుష్కరం, దద్దురం, బ్రహ్మనిర్మించిన వరాహక్షేత్రం. అన్ని అర్థములను ఇచ్చు బదరి అను మహాపుణ్యక్షేత్రము కలవు-23. ముక్తి నిచ్చు అయోధ్యాపురిని చూచినచో అన్ని పాపముల నుండి విముక్తులై వైకుంఠమును చేరుదురు-24. విష్ణువుకు వివిధ సేవలు చేసి, పూజలు, నర్తనములు, కీర్తనలు మున్నగునవి చేసి, ఇంటిని విడచి ఎల్లప్పుడు స్వామిని సేవించి మృత్యువును జయింతురు-25. స్వర్గధామము వద్ద స్నానము చేసి శుచిగా రామాలయమును చూచినవానికి సాంఖ్యము లేకనే మోక్షము కలుగును-28. అసి, వరుణ నదుల మధ్యకల ఐదు క్రోసుల ప్రదేశము గొప్ప ఫలము నిచ్చునది. దేవతలు కూడ ఇచట మరణింపవలెనని కోరుదురనగా ఇక ఇతరుల కథ చెప్పునది ఏమున్నది-29. మణి కర్ణిక వద్ద, జ్ఞానవాపీ, యందు గంగానదియందు పంచనదసరస్సునందు స్నానము చేసినచో పునర్జన్మ ఉండదు-30. హఠాత్తుగా ఐనను కాశియందు విశ్వనాథుని చూచినచో జన్మమృత్యువు లేని ముక్తి కలుగును-31.

 మరింత చేప్పుట ఏల? ఈ క్షేత్రముతో సమానమగు క్షేత్రము మరియొకటిలేదు. మధురయందు తపస్సు, ఉపవాసము చేయుచు కృష్ణుని జన్మస్థానమును చేరినచో అన్ని పాపములనుండి ముక్తి పొందుమ-32. విశ్రాంతి తీర్ధమునందు యథావిధిగ స్నానము చేసి తిలోదకము వదలివచో తవ పితరులమ నరకమునుండి ఉద్దరించినవాడై విష్ణులోకమును పొందును-33. ఆ ప్రదేశమున ప్రమాదము వలన ఎట్టి పాపము చేసినను విశ్రాంతి తీర్థమున స్నానము చేసినచో ఆ క్షణమే ఆ పాపము బూడిద అగును-34.అవంతి యందు వసంతకాలమున శిప్రానదియందు స్నానము చేసినచో వందలాది జన్మలలో కూడ పిశాచత్వమును పొందరు-35. కోటి తీర్థమునందు స్నానము చేసి బ్రాహ్మణోత్తములకు భోజనము పెట్టి మహాకాలుని రూపమున (న్న శివుని చూచినచో అన్ని పాపములు తొలగిపోవును-36. ఈ క్షేత్రము ముక్తినిచ్చునది, నా లోకమునకు చేరుటకు ఒకే ఒక సాధనము. ఇచట దానము చేసినచో ఇహపరములయందు దారిద్ర్యము సంభవింపదు-37. కురుక్షేత్రము నందలి రామతీర్థమున స్నానము చేసి శక్తి కొలది బంగారమును దానము చేసినచో, సూర్యగ్రహణ సమయమున యథావిధిగ దానమిచ్చినచో ముక్తికి అర్హతను పొందును-38. దానమిచ్చుటయందు లోభము చూపనిచో వారికి నూరుకోట్ల కల్పముల వరకు మానవజన్మ లభింపదు-39. హరి క్షేత్రము నందు హరిని చూచి స్వామి పాదోదకమందు స్నానము చేసినచో పాపములన్ని తొలగి విష్ణువుతో కలసి వైకుంఠమున ఆనందముగా గడపును-40. అచట ఎన్నో పక్షుల గుంపులు, ఋషి గణములు కందమూల ఫలములు తినుచు గడపుచుండును. అచటి మునులు గాలిని మాత్రమే భుజించుచు ఇంద్రియములను జయింతురు- 41. విష్ణుకాంచియందు విష్ణువు, శివకాంచీ యందు శివుడు స్వయముగ నివసించును. వారిద్దరకు భేదము లేదు కనుక వారిరువురి యందు భక్తి కలవారికి ముక్తి అరచేతిలోనిది. వారిరువురి నడుమ భేదమున్నదని భావించినచో దుర్గతి తప్పదు-42.

  పురుషోత్తమ క్షేత్రమందు జగన్నాథుని ఒక్కసారైన చూచి మార్కండేయ సరస్సున స్నానము చేసినచో జ్ఞానము, యోగము లేనప్పటికి పునర్జన్మ లేనివాడగును-43. రోహిణీ నక్షత్రమందు సముద్ర స్నానము చేసి ఇంద్రద్యుమ్న ప్రదమున స్నానమాచరించి విష్ణు నిర్మాల్యమును భుజించినచో వైకుంఠమున నివాసము కలుగును-44. శంఖము పై నిలచిన రపదియోజనముల ప్రదేశమున నివసించినచో కీటకములు కూడ విష్ణుత్వమును పొందును-45. కార్తీక మాసమందు పుష్కరమున స్నానము చేసి దక్షిణతో కూడిన శ్రాద్ధము నిర్వర్తించినచో, బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో బ్రహ్మలోకమును చూచినచో పాపములన్నియు నశించును-47. అరవైవేల వత్సరములు యోగాభ్యాసము చేసిన ఎంత ఫలము కలుగునో సౌకరమునందు యధావిధిగ స్నానము చేసి శుచియై హరిని దర్శించినచో కలుగును-48. ఏడు జన్మలలో చేసిన పాపమపుడే నాశనమగును. అన్ని తీర్థములు సేవించు మహా పుణ్యప్రదమగు తీర్థ రాజమున స్నానము చేసినచో అన్ని కోర్కెలు తీరును. వేణియందు స్నానము చేసి శుచియై మాధవుని దర్శించినచో పుణ్యము చేసినవారు అనుభవించు భోగములను అనుభవించి విష్ణువుయందు లీనమగుదురు-49,50.

          మాఘమాసమందు త్రివేణియందు భక్తితో స్నానముచేసి బదరిని కీర్తించినచో పుణ్యము పొందును- 51. దశాశ్వమేధిక తీర్థములో స్నానము చేసినచో పది అశ్వమేధయాగములు చేసిన ఫలము కలుగును. ఇది అంతయు నీకు సంక్షిప్తముగా తెల్పితిని. దీనిలో దేనిని గూర్చి మరల వినగోరుచుంటివి?-52.

స్కందుడు పలికెను:- విష్ణుక్షేత్రమైన బదరివంటి క్షేత్రము ముల్లోకములలో కడు దుర్లభము. ఆ క్షేత్రమును తలచినంతనే మహాపాతకముల నుండి ముక్తిని పొంది వెంటనే మోక్షార్హతను పొందును-53. ఇతర తీర్థముల యందు అతి దారుణమగు తపస్సు చేసిన ఎట్టి ఫలము కలుగునో అట్టి ఫలము బదరీయాత్రను మనసులో చేసినను కలుగును-54. దివియందు, భువియందు, రసాతలమందు ఎన్ని తీర్థములున్నను బదరివంటి తీర్థము లేదు, ఉండబోదు-55. ఇతర క్షేత్రములలో వేయి అశ్వమేధములు,వాయుభక్షణము చేసిన ఫలము ‘విశాల’ అను పేరుకల క్షేత్రము కృతయుగమందు ‘ముక్తిప్రద’ అని త్రేతాయుగమందు ‘యోగసిద్ధిద’ అనియు, ద్వాపరమందు ‘విశాల’ అనియు పిలువబడినది-56,57.

          జీవునికి స్థూలము, సూక్ష్మము అను రెండు శరీరములుండును. వాటిని జ్ఞానమువలన నశింపజేయుటచే ఈ క్షేత్రమునకు ‘విశాల’ అని పేరు కలిగెను-58. రేగు చెట్టు నుండి అమృతము స్రవించుటే ‘బదరి’ అను పేరు కలిగెను. ఆచట బదరిని ఎప్పుడును వదలిపెట్టక నివసించును-60. అన్ని తీర్థములలో మునుగుటచే, అచట తపస్సు, యోగము, సమాధిపొందుటచే కలుగు ఫలము చక్కగ బదరిని దర్శించుటచే కలుగును-61. వారణాసియందు అరవైవేల సంవత్సరములు యోగాభ్యాసము చేసిన ఫలము బదరిని ఒక్కమారు దర్శించిన కలుగును-62. బదరియందు అన్ని తీర్థములు, దేవతలు, ఋషులు నివసించుటచే ‘విశాల’ అని పిలువబడుచున్నది-63.

ఎనభైఒక్కవేల శ్లోకములుకల శ్రీ స్కాంద మహాపురాణమందు రెండవదగు వైష్ణవ ఖండమున బదరికాశ్రమ మాహాత్మ్యమున శివకార్తికేయసంవాదమున బదరికాశ్రమము యొక్క సర్వతీర్థాధిక్య వర్ణనము అను మొదటి అధ్యాయము.