గరుడ మహా పురాణము - బ్రహ్మ ఖండము
15 - 17 - హరి అవతారాలు - లక్ష్మీ అవతారాలు
హే ఖగశ్రేష్ఠా! హరి పూర్ణానందస్వరూపుడు. ఆయనకు ఏ దేశంలోనూ ఏ కాలం లోనూ సమానులులేరు. ఆ శ్రీహరియే లోక కల్యాణం కోసం సంపూర్ణ సద్గుణ సాగరుడై ఎన్నో రూపాలను ధరించాడు. నేలపైకి వచ్చాడు, నింగిపైనా మెరిశాడు, జలం లోనూ నిలిచాడు. ఆ రూపాలనే అవతారాలుగా సంభావించారు వేదవిదులు, విద్వాంసులు.
(*భగవంతుని అవతారాలు నూటయెనిమిది పై మాటేననీ, వాటిలో మొట్టమొదటిది సనత్కుమారరూపమనీ ఈ రూపంలో ఆయన వేదాన్ని ప్రారంభించాడనీ చాలా గ్రంథాల్లో కనిపిస్తుంది. గరుడపురాణం ఈ విషయాన్ని లోతుగా చర్చింపలేదు.)
ఆ మహావిష్ణువే అన్ని అవతారాలకూ మూలబీజము. అయననే వాసుదేవుడన్నారు. వాసుదేవుడే సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధరూపాలలో ప్రకటితుడైనాడు. ఆయనే స్థూల దేహంనుండి బ్రహ్మాది దేవతలను సృష్టించాడు. ఆ వెన్నుడే సనత్కుమారారూపాలను ధరించి జనులకు తపస్సు, బ్రహ్మచర్యం, ఇంద్రియనిగ్రహాలలో శిక్షణనిచ్చాడు; దైత్యరాజు హిరణ్యకశిపుని బారినుండి భూదేవిని రక్షించడానికై వరాహరూపాన్ని ధరించాడు; నారాయణరూపంలో బదరి కాశ్రమంలో వుండి తపస్వులకాదర్శమైనాడు; కపిలమునిగా అవతరించి కాలకవలిత ఇరువది నాలుగు తత్త్వాలుగల సాంఖ్యశాస్త్రాన్నుపదేశించాడు; అత్రిపత్ని అనసూయగర్భాన దత్తాత్రేయుడై జనించాడు; అలర్కరాజుకు ఆన్వీక్షకీ నామకతర్క విద్యను పదేశించాడు; ఆకూతి గర్భానజనించి సురాజ్య స్థాపన గావించాడు; అలాగే అగ్నీధ్ర పుత్రియైన మేరుదేవికీ నాభికీ అరుక్రమ నామంతో పుత్రునిగా జనించి లోకాలను కాచాడు. క్షీరసాగరమథన వేళ ఆ శ్రీమహావిష్ణువే మందర పర్వతం మునిగిపోకుండా ఆది కూర్మమైవచ్చి ఆదుకున్నాడు. వెనువెంటనే హరితమణి వలె ప్రకాశించు కాంతులు గల ధన్వంతరిగా అవతరించి దేవతలకు అమృతాన్నీ మానవులకు ఆయుర్వేదాన్నీ తీసుకొచ్చాడు. విష్ణువే దైత్యులను మోహితులను చేసి దేవతలకు అమృతాన్నివ్వడానికీ మోహినీ రూపాన్ని ధరించాడు. హిరణ్యకశిపుని చంపి వాని బారినుండి ప్రహ్లాదునీ లోకాలనూ కాపాడడానికి శ్రీ హరి నృసింహావతారాన్ని దాల్చాడు. మహాభక్తుడు, మహాదాతయునగు బలిచక్రవర్తి దానవసహవాసంవల్ల అహంకారియు, లోక కంటకుడు కాబోవుచుండగా అతనినీ లోకాన్నీ కూడా కాపాడడానికి శ్రీహరి అదితి గర్భాన కశ్యపనందనునిగా వామనుడై అవతరించాడు. తరువాత ఆయన జమదగ్నికీ పరశురాముడై పుట్టి దురహంకారులు, దుర్మార్గులునగు రాజులను మొత్తంగా సంహరించి భూమినీ, ప్రజలనూ, ముఖ్యంగా బ్రాహ్మణులను రక్షించాడు. తరువాత ఆ శ్రీహరియే రవికులశశియై రాఘవుడై, రాముడయి, గుణధాముడయి, కౌసల్యా దశరథులకు బిడ్డడై జన్మించాడు. శ్రీరామావతారం లోక విఖ్యాతం. కొన్ని వేల యేళ్ళపాటు, మళ్ళా కల్పమే మారినా, ప్రళయమే వచ్చినా ఆ కరుణాపయోనిధీ దాశరథి చరితాన్ని కవులు పాడుతునే వుంటారు. ఈ అవతారంలో స్వామి రావణ కుంభకర్ణాది కొన్నివేలమంది రాక్షసులను సంహరించి మానవజాతిని కాపాడుటే గాక సంపూర్ణమానవజీవితాన్ని గడిపి ఆదర్శ మానవుడెలా పుండాలో ఆ జాతికీ నేర్పాడు. తరువాత శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో వ్యాసమహర్షిగా అవతరించి వేద సంహితను నాలుగు భాగాలుగా విభజించి సుమంతు, జైమిని, పైలాదశిష్యులచేత వాటిని చదివించిలోకం నలుమూలలా వేద విజ్ఞానాన్ని విరియజేశాడు. అనంతరం ఆ శ్రీ హరియే శ్రీ కృష్ణ వాసుదేవునిగా జనించి స్వయంగానూ, భీమార్జునుల చేతనూ రాక్షసాంశలో పుట్టిన వారందరినీ మడియజేసి భూభారాన్ని తగ్గించాడు. గీతోపదేశాన్ని గావించి భారతజాతికీ జగద్గురువై భాసిల్లాడు. తరువాత కీకటదేశంలో ఋద్ద నామంతో జనించి అసురులను మోహంలో ముంచి సుజనులకు వారి పీడను వదిలించాడు. కలియుగంలో విష్ణువు మరల అవతరిస్తాడు. దస్యుప్రియులైన పాలకులను కల్కి నామరూపాలతో వచ్చి సంహరించి ప్రజలను రక్షిస్తాడు. ఇంకా ఎన్ని అవతారాలెత్తాడో మరెన్ని మార్లు రాబోతున్నాడో స్వయంగా ఆయనకే తప్ప ఇంకెవరికీ తెలియదు.*
(*అందుకే స్వామియే స్వయంగా ఇలా అన్నట్లు ఒక పద్య నాటకంలో చెప్పబడింది.
జంగమ స్థావరాత్మక జగతిలోన నేను వేయని వేషమే కానరాదు
భక్తజనరక్షణార్థము ఏ పనిని గాని సేతునే వేషమైన వేతు.)
కశ్యపాత్మజా! హరిప్రియలక్ష్మీ దేవి జ్ఞాన సంపన్న, జ్ఞానస్వరూప. ఆమె కూడ విభిన్నరూపాలలో అవతరించడం జరిగింది. ఆమె స్వామీ చరణగ్రహణం మాత్రమే జీవితాశయంగా గల దేవత. పురుషపత్ని, ప్రకృతి అభిమానిని దేవత ఆ శ్రీ దేవియే. బ్రహ్మాండ సృజనేచ్ఛ శ్రీహరిలో కదలాడినపుడు గుణాలను సృష్టించడానికనువగు ప్రకృతిగా ఆమెయే ఉద్భవించింది. వాసుదేవపత్ని మాయ, సంకర్షణుపత్ని జయ, అనిరుద్ధపల్ని శాంత, ప్రద్యుమ్నపత్ని కృతి - లక్ష్మీదేవి అవతారాలే. విష్ణుపత్ని సత్త్వరూపి శ్రీదేవి, తమో గుణాధిక దుర్గాదేవి, రజోగుణాభిమానినీ, వరాహ పత్నీయగు భూదేవీ, భగవంతుడు వేదరూపాన్ని ధరించినపుడాయనతోడు అన్నపూర్ణ - లక్ష్మీ స్వరూపాలే. ఆ లక్ష్మీదేవియే యజ్ఞపత్ని దక్షిణగా,శ్రీ రామాంగన సీతగా, శ్రీకృష్ణుని పట్టమహిషులురుక్మిణీ సత్యభామాది మహాదేవులుగా (లక్ష్మియే) అవతరించింది. ద్రౌపదీ, శచీదేవీ లక్ష్మి అవతారాలే.
Summary of chapter 7 of the Garuda Mahā Purana - Brahma Khaṇḍa is as follows:
The Supreme Bhagavān through Brahma reveals the fundamental tripartite classification of embodied souls into Mukti-yogya Sāttvikas, Nitya-samsāri Rājasas, and Tamo-yogya Tāmasas. The text explains that inherent spiritual nature combined with moral choices determines whether a soul ascends to eternal Vaikuṇṭha bliss, remains in perpetual worldly transmigration, or descends into lower realms.