భాగవత మహా పురాణము
11 - వివిధ ధర్మముల వర్ణనము
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- వామనావతారములో పెద్ద అడుగులు వేసి జగత్తును కొలిచిన శ్రీహరిని చిత్తమునందు నిలిపియున్న రాక్షసరాజగు ప్రహ్లాదుని చరితము సత్పురుషుల సభలయందు సత్కరించబడును. చాల గొప్పవారిలో కూడ అగ్రేసరుడగు ధర్మరాజు ఆ చరితమును విని ఆనందించెను. ఆయన మరల స్వయంభువుడైన బ్రహ్మగారి పుత్రు డగు నారద మహర్షిని ఇట్లు ప్రశ్నించెను.
యుధిష్ఠిర ఉవాచ ।
ఓ పూజనీయా! వర్ణములు మరియు ఆశ్రమముల ఆచారములతో కూడియున్న మానవుల ధర్మము సనాతనమైనది. దానిని గురించి వినగోరుచున్నాను. ఏలయనగా, దాని వలన మానవుడు పరమపురుషార్థమగు మోక్షమును పొందును.
ఓ మహర్షీ! నీవు సాక్షాత్తుగా సృష్టికర్తయగు బ్రహ్మగారి పుత్రుడవు. తపస్సు, భక్తియోగము మరియు చిత్తెకాగ్రతలను బట్టి నీకు ఆయన పుత్రులలో అధికమగు సమ్మానము గలదు.
నీవంటి వేదవేత్తలకు నారాయణుడే పరమలక్ష్యము. దయామయులు, శాంతస్వభావులు అగు నీవంటి సత్పురుషులు రహస్యమైన పరమధర్మమును తెలియుదురు. ఇతరులకు ఆ రహస్యమగు ధర్మము తెలియదు.
నారద ఉవాచ ।
నారదుడిట్లు పలికెను --- స్వయంభువుడగు బ్రహ్మగారు లోకముల ధర్మమునకు కారణము. ఆయనకు నమస్కరించి నేను నారాయణుని ముఖమునుండి విన్న సనాతన ధర్మమును గురించి చెప్పెదను. .
ఆ నారాయణుడు తన అంశయగు నరునితో గూడి ధర్ముని వలన దక్షపుత్రికయగు మూర్తియందు అవతరించి, లోకముల కల్యాణము కొరకై బదరికాశ్రమమునందు తపస్సును అనుష్ఠించుచున్నాడు.
ఓ ధర్మరాజా! సలకవేదస్వరూపుడగు శ్రీహరి భగవానుడు, వేదవేత్తలగు మహర్షుల స్మృతులు మరియు ఏ కర్మచే అంతఃకరణము ప్రసన్న మగునో అట్టి కర్మ -- ఈ మూడు ధర్మమునకు మూలము (ప్రమాణము).
పాండువంశీయుడవగు ఓ ధర్మరాజా! సత్యము, దయ, తపస్సు, బాహ్యమునందు ఆంతరమునందు శుచిగా నుండుట, సహనశక్తి, ఆత్మా నాత్మ (నిత్యానిత్య) వివేకము, మనోనిగ్రహము, ఇంద్రియనిగ్రహము, అహింస, బ్రహ్మచర్యము, దానము, వేదాధ్యయనము, కుటిలత లేని వ్యవహారము, లభించిన దానితో తృప్తి పడుట, అంతటా సమానముగా ఈశ్వరుని దర్శించే మహాత్ములను సేవించుట, మెల్లగా. ఇంద్రియభోగములకు చెందిన చేష్టలనుండి విరమించుకొనుట, మానవులు చేసే లౌకికములగు ప్రయత్నములన్నియు నిష్ఫలములేననే సత్యమును దర్శించుట, మౌనము, ఆత్మచింతనము, ప్రాణులకు వాటి యోగ్యతకు తగ్గట్లుగా అన్నపానములు మొదలగువాటిని పంచి యిచ్చుట, ప్రాణులను విశేషించి మానవులను ఆత్మస్వరూపులనియు ఈశ్వరరూపులనియు భావించుట, మహాత్ములకు పరమలక్ష్యమగు శ్రీహరియొక్క లీలలను వినుట, కీర్తించుట, స్మరించుట, ఈశ్వరుని సేవించి పూజించుట, నమస్కరించుట, దాస్యము, మైత్రీ, తనను తాను ఈశ్వరునకు సమర్పించుకొనుట -- అనే ఈ ముప్పది లక్షణములు గల ధర్మము సకలమానవులకు సర్వోత్తమమైన ధర్మమని మహా త్ములచే వర్ణించబడినది. ఈ ధర్మమును పాలించుటచే సర్వాత్మస్వరూపుడగు శ్రీహరి ప్రసన్నుడగును.
ఎవనియందైతే ఉపనయనము మొదలైన సంస్కారములు ఆగిపోకుండా జరిగినవో, ఎవనిని బ్రహ్మగారు (వేదము ద్వారా) నిర్ధారించిరో, అట్టి వాడు ద్విజుడగును. ద్విజులకు యజ్ఞము, వేదాధ్యయనము, దానములు విధించబడినవి. పుట్టుకచే మరియు కర్మలచే పవిత్రులైన ద్విజులకు బ్రహ్మచర్య-గృహస్థ-వానప్రస్థ-సన్న్యాస-ఆశ్రమములకు చెందిన కర్మలు కూడ విధించబడినవి.
యజ్ఞమును చేయుట, చేయించుట, వేదమును అధ్యయనము చేయుట, బోధించుట, దానమును చేయుట, స్వీకరించుట (ప్రతిగ్రహము) అనే ఆరు కర్మలు వేదవేత్తయగు బ్రాహ్మణునకు విధించబడినవి. వీటిలో ప్రతిగ్రహము క్షత్రియునకు తగదు. ప్రజలను రక్షించే క్షత్రియుడు వేదవేత్తలను మినహాయించి ఇతరుల వద్ద పన్నును తీసుకొనవలెను. అదియే క్షత్రి యునకు జీవిక.
అన్ని కాలములలో వేదవేత్తలకు అనుచరుడై యుండే వైశ్యునకు గోవులను పాలించుట, వ్యవసాయము, వ్యాపారము అనునవి జీవిక. వేదవేత్తలను సేవించుట శూద్రునకు ధర్మము మరియు జీవిక కూడ అగును.
పలువిధములైన వ్యవసాయము మొదలగునవి, శాలీనము (యాచించకుండా లభించినదానితో జీవించుట), యాయావరము (ప్రతిదినము బియ్యము మొదలగువాటిని యాచించి వాటితో జీవించుట), శీలోంచనము (రైతులు ధాన్యమును నూర్చినప్పుడు క్రింద పడే గింజలను ఏరుకొని వాటితో జీవించుట) -- అని వేదవేత్తయగు బ్రాహ్మణుని జీవిక నాలుగు విధములు. వీటిలో ముందుదానికంటే తరువాతిది శ్రేయస్కరము.
క్రింది స్థాయికి చెందిన వ్యక్తి ఆపదలలో తప్ప పై స్థాయికి చెందిన జీవికను చేబట్టవద్దు. ఆపదలలో మాత్రము క్షత్రియుని మినహా యించి అందరు అన్ని రకముల వృత్తులను చేబట్టవచ్చును.
ఋత-అమృతములతో గాని, మృత-ప్రమృతములతో గాని, సత్య -అనృతములతో జీవించవలెనే గాని, శ్వవృత్తితో ఏనాడైననూ జీవించరాదు.
పొలములో క్రిందపడిన గింజలనేరుకొని బ్రతుకుట ఋతమనబడు ను. కోరకుండా లభించిన దానితో బ్రతుకుట అమృతమనియు, నిత్యము యాచించి బ్రతుకుట (యాయావరము) మృతమనియు, భూమిని దున్ని బ్రతుకుట ప్రవృతమనియు చెప్పబడినది.
వర్తకము సత్యానృతమనబడును. బ్రదుకు దెరువుకై నీచుని సేవించుట శ్వవృత్తి యనబడును. ఏవగించుకొనదగిన అట్టి శ్వవృత్తిని వేదవేత్త గాని, క్షత్రియుడు గాని ఆశ్రయించరాదు. ఎందుకంటే, సకలవేదములు వేద వేత్తయగు బ్రాహ్మణునియందున్నవి. రాజు సకలదేవతాస్వరూపుడు.
మనస్సు వశములో నుండుట, ఇంద్రియనిగ్రహము, తపస్సు, బాహ్యమునందు ఆంతరములో స్వచ్ఛత, ఉన్నదానితో తృప్తిపడుట, సుఖ దుఃఖములను సహించుట, కుటిలత లేని స్వభావము, వివేకజ్ఞానము, దయ, శ్రీహరియందు లగ్నమైయుండే బుద్ధి, సత్యము అనునవి బ్రాహ్మ ణుని లక్షణములు.
యుద్దములో ఉత్సాహము, ప్రభావము, ధైర్యము, దానము, మనస్సు పై విజయము, సహనశక్తి, వేదవేత్తలగు బ్రాహ్మణుల యెడల భక్తి, ప్రజలను అనుగ్రహించి రక్షించుట అనునవి క్షత్రియ లక్షణములు.
దేవతలయందు గురువునందు శ్రీహరియందు భక్తిని కలిగియుండుట, ధర్మము అర్థము కామము అనే మూడు పురుషార్థములను చక్కగా సేవించుట, ఈశ్వరుడు గలడు అనే విశ్వాసము, అన్ని కాలములలో కార్య శూరత, పనిని చేయుటలో నేర్పు అనునవి వైశ్యుని లక్షణములు.
వినయము, బాహ్యమునందు ఆంతరమునందు స్వచ్ఛత, యజమానిని నిష్కపటముగా సేవించుట, మంత్రములు లేకున్ననూ ఈశ్వరుని ఆరాధించుట, పరధనమును అపహరించకుండుట, సత్యము, గోవులను విప్రులను రక్షించుట అనునవి శూద్ర లక్షణములు.
స్త్రీలకు పతియే దైవము. భర్తను సేవించుట, భర్తకు అనుకూలముగా నుండుట, భర్త వైపు బంధువులను సేవించుట, అన్ని కాలములలో భర్తయొక్క నియమములను పరిరక్షించుట అనునవి స్త్రీల ధర్మములు.
సాధ్వి ఇంటిలోనే ఉంటూ ఇంటిని తుడిచి సుగంధద్రవ్యములను చల్లి రంగవల్లులను దిద్దవలెను. నిత్యము తనను కూడ తాను అలంకరించుకొని, ఇంటి సామగ్రిని శుచిగా ఉంచుకొనవలెను. ఆమె వినయముతో భర్తయొక్క చిన్న పెద్ద ఇచ్చలను పూర్తి చేయవలెను. ఆమె ఇంద్రియనిగ్రహము గలదియై, సత్యము మరియు వినుటకు సొంపైన వాక్యములతో ప్రేమపూర్వకముగా భర్తను ఆయా సమయములయందు సేవించవలెను.
ఆమె లభించిన దానితో తృప్తి జెంది, దేనియందైననూ తీవ్రమగు ఆసక్తిని విడనాడవలెను. ఆమె ధర్మము తెలిసిన సమర్థురాలు కావలెను. ఆమె సత్యమును వినుటకు ఇంపుగా చెప్పవలెను. ఆమె సావధానముగా ఉంటూ బాహ్యమునందు ఆంతరములో స్వచ్చతను కలిగియుండవలెను. తన భర్త పతితుడు కానిచో, ఆమె ఆతనిని ప్రేమతో సేవించవలెను.
ఏ స్త్రీయైతే తన భర్త సాక్షాత్తుగా శ్రీహరియే అనే భావనతో, శ్రీహరియే ఏకైకలక్ష్యముగా గల లక్ష్మీదేవి శ్రీహరిని సేవించు విధముగా సేవించునో, ఆమె శ్రీహరియొక్క లోకము (వైకుంఠము) లో శ్రీహరిరూపుడగు తన భర్తతో గూడి లక్ష్మీదేవి వలెనే ఆనందించును.
చోరులు కాకుండా పాపములను చేయకుండా పౌరసమాజమునకు దూరముగా గ్రామములకు నగరములకు బయట నివసించే సంకరజాతుల జీవిక ఆయా కులములను బట్టి నిర్ధారితమగును.
ఓ ధర్మరాజా! ప్రతియుగమునందు మంత్రద్రష్టలగు మహర్షులు మానవులకు వారి వారి స్వభావమును బట్టి ధర్మమును స్మృతుల రూపములో విధించిరి. ఈ ధర్మమునాచరించువారలకు ఇహమునందు మాత్రమే గాక, పరమునందు కూడ సుఖము లభించును.
స్వభావమును బట్టి నిర్ధారించబడిన బ్రదుకు దెరువుతో స్వధర్మమును అనుష్టించి జీవిస్తూ మానవుడు మెల్లగా ఆ స్వభావసిద్దమగు కర్మను కూడ విడిచి గుణాతీతుడై జీవన్ముక్తుడు కావలెను.
అతిగా నాట్లు వేసిన క్షేత్రము తనంత తానే నిస్సారమగును. ఆ తరువాత దానిలో పంట పండకపోవుట మాత్రమే గాక, నాటిన విత్తు కూడ నష్టమగును.
ఓ ధర్మరాజా! ఈ విధముగా కోరికలకు నిలయమైన మనస్సు కామనలను కొంత కాలము సేవించగా విరక్తిని పొందును. అంతే గాని, ఒక్కసారిగా విరక్తిని పొందదు. ఏవో కొద్దిపాటి కామనలను మాత్రమే సేవించినచో, కొద్ది నేతిచుక్కలను వేసిన అగ్నివలే, ఉపశమమును పొందదు (అనగా, స్వధర్మానుష్ఠానమును చేస్తూ మానవుడు ఏవో కొన్ని కామనలను గృహస్థాశ్రమములో అనుభవించుటయే మంచిది; స్థాయీగా ఉండే వైరా గ్యము ఆ విధముగనే వర్ధిల్లును అని అభిప్రాయము).
ఆయా వర్ణముల వారికి ఆయా అసాధారణ లక్షణములు చెప్పబడినవి. ఒక వర్ణమునకు చెందిన లక్షణములు మరియొక వర్ణమునకు చెందిన వ్యక్తియందు కానవచ్చినచో, ఆ వ్యక్తికి వర్ణమును ఆ లక్షణములను బట్టియే నిర్ధారించవలెను (జన్మను బట్టి వర్ణమును నిర్ధారించరాదు).
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో వివిధధర్మములను వర్ణించే పదునొకండవ అధ్యాయము ముగిసినది (11).
Summary of chapter 11 of the Bhāgavata Mahā Purana is as follows:
Following the narrative of Prahlāda Mahārāja, King Yudhishṭhira inquired from Devarshi Nārada regarding the principles of Sanātana-dharma and the structural organization of human society (*Varṇāśrama-dharma*). Nārada Muni outlined thirty fundamental moral virtues essential for all civilized human beings, including truthfulness, mercy, cleanliness, austerity, simplicity, and self-control. He then detailed the specific characteristics, duties, and occupational responsibilities of the four social orders (*Varṇas*): Brāhmaṇas (characterized by wisdom, sense control, and scriptural mastery), Kshatriyas (characterized by heroism, protection of citizens, and leadership), Vaiśyas (characterized by agriculture, cow protection, and trade), and Śūdras (characterized by service, obedience, and honesty), emphasizing that social standing is determined by actual character and qualities rather than mere birth lineage.