భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

1. కథా ప్రస్తావనము

జయతి భువన దీపో భాస్కరో లోక కర్తా జయతి చ శితిదేహః శాత ధన్వా మురారీ :

జయతి చ శశి మౌళీ రుద్ర నామాభిధేయః జయతి చ సతు దేవో భానుమాం శ్చిత్రభానుః

శ్రియా వృతంతు రాజానం శతానీకం మహాబలం అభిజగ్ము ర్మహాత్మాన స్సర్వే ద్రష్టుం మహర్షయః

భృగురత్రి ద్వశిష్ఠశ్చ పులస్త్యః పులహః క్రతుః పరాశర స్తథా వ్యాస సుమంతర్జైమిని స్తథా మునిః పైలో యాజ్ఞవల్యో గౌతమస్తు మహాతపాః భారద్వాజో

మునిర్ధేమాం స్తథా నారద పర్యతౌ

 వైశంపాయనో మహాత్మా శౌనకశ్చ మహాతపాః దక్షోఽగిర స్తథా గర్గో గాలవశ్చమహాతపాః

తాత్పర్యము - సకల లోకాలకు వెలుగు నిచ్చువాడు, లోకకర్త అయిన సూర్యునకు జయమగును. నీలదేహుడును, శార్జమను విల్లును దాల్చిన వాడైన విష్ణువునకు విజయమగును. రుద్రుడను పేరుతో విఖ్యాతుడైన శంకరునకు జయమగును. చిత్ర కిరణములు గలవాడైన అగ్ని దేవునకు జయమగును. ఒకప్పుడు మహాత్ముడైన భృగువు, వశిష్ఠుడు, పులస్త్యుడు, పులహడు, క్రతువు, పరాశరుడు, వ్యాసుడు, సుమంతుడు, జైమిని, పైలుడు, యాజ్ఞవల్క్యుడు, మహాతపస్వి అయిన గౌతముడు, ధీరుడైన భారద్వాజుడు, నారదుడు, పర్వతుడు, వైశంపాయనుడు, మహాతపస్వి అయిన శౌనకుడు, దక్షుడు, అంగిరసుడు, గర్గుడు, గాలవుడు మొదలైన మహర్షులు, తేజస్వి, మహాబలశాలి అయిన శతానీక మహారాజును సందర్శింపగోరి సమీపించిరి.  

తానాగతానృషీన్ దృష్ట్వా శతానీకో మహీపతిః విధివత్పూజయామాస అభిగమ్య మహామతిః

పురోహితం పురస్కృత్య అర్ఘంగాం స్వాగతేనచ పూజయిత్వా తతస్సర్వాన్ ప్రణమ్య శిరసాభృశమ్

 సుఖాసీనాంస్తతో రాజా నితంకాన్ గతక్లమాన్ ఉవాచ ప్రణతో భూత్వా బాహుముద్ధృత్య దక్షిణమ్

 ఇదానీం సఫలం జన్మ మన్యేఽహం భువి సత్తమాః ఆత్మనో ద్విజశార్దులాస్తథా కీర్తిర్యశోబలమ్

 ధన్యోఽహం పుణ్యకర్మాచ యతోమాఁ ద్రష్టుమాగతాః యేషాం స్మరణ మాత్రేణ యుష్మాకం పూయతే నరః  

తా ఆ విధంగా వచ్చిన మునులను చూసి మహామేధావి అయిన శతానీకుడు వారిని సమీపించి యథావిధిగా పూజించెను. ఆ శతానీకుడు పూజ్యుడైన పురోహితుని మరియు గోవును ముందడుకొని ఆ మునులను స్వాగత నమస్కారాలతో సత్కరించెను. ఆ మునులు తమ తమ ఆసనములపై సుఖంగా కూర్చొని విశ్రాంతులైన మీదట ఆ శతానీకుడు తన కుడిచేతిని పైకెత్తి వినయంతో ఇట్లు పలికినాడు. “ఓ బ్రాహ్మాణోత్తములారా! ఇంతకాలానికి నాజన్మ, కీర్తి, ప్రతిష్ఠ మరియు బలము సఫలములైనవని భావిస్తున్నాను. ఏ మునులను తలచినంతనే మానవుడు పవిత్రుడగునో అటువంటి మహరులైన మీరు నన్ను సమీపించుట వలన నేనెంతో పుణ్యము చేసికొన్నవాణ్ణిగా, ధన్యునిగా అనుకొంటున్నాను.”

శ్రోతుమిచ్ఛామ్యహం కించిద్ధర్మశాస్త్రమనుత్తమమ్ ఆనృశంస్యం సమాశ్రిత్య కథయధ్వం మహాబలాః

 యేనాహం ధర్మశాస్త్రం తుశ్రుత్వా గచ్ఛేపరాం గతిం యథాగతో మమపితా శ్రుత్వావై భారతం పురా.

తథోక్త స్తేన రాజ్ఞావై బ్రాహ్మణాస్తే సమన్తతః, సమాగమ్య మిథస్తే తు విమృశ్య చ భృశం తదా

పూజయిత్వాతతో వ్యాసమిదం వచన మబ్రువన్ వ్యాసం ప్రసాదయ విభో ఏష తే కథయిష్యతి.

తిష్ఠత్యస్మిన్మహాబాహో! వయం వక్తుం నశక్నుమ: తిష్ఠమానే గురౌ శిష్యః కథం వక్తి మహామతే.

 అయం గురుస్సదాస్మాకం సాక్ష్యాన్నారాయణస్తథా కృపాళుశ్చ తథాచాయం తథా దివ్య విధానవిత్

తా ఓ మహాతపోబలులారా ! సర్వోత్తమమైన ధర్మశాస్త్రమును వినగోరుచున్నాను. కాన దయతో నాకు చెప్పుడు పూర్వము నా తండ్రి భారతమును విని సద్గతి నే విధముగా పొందెనో అట్లే నేనును ధర్మ శాస్త్రమును విని ఉత్తమగతిని పొందెదను. అట్లు శతానీక మహారాజుచే విన్నవింపబడిన బ్రాహ్మణులు (బ్రహ్మరులు) ఏకాంతముగా సమావేశమై పరస్సరము చర్చించుకొనిన పిదప వ్యాసుని పూజించి రాజుతో ఇట్లు పలికిరి. ఓ రాజా! వ్యాసుని పూజించి సంతోష పెట్టుము. ఈ వ్యాసుడే నీకు ధర్మశాస్త్రమును చెప్పును. ఓ వీరుడా ! వ్యాసుడిచటనుండగా మేము శాస్త్రమును చెప్పుటకు యోగ్యులము కాము. ఏలనన, ఓ ధీశాలీ! గురువు ముందుండగా శిష్యుడెట్లు పలుక శక్తుడగును.? . ఈ వ్యాసుడే సదా మన గురువు. ఇతడు ప్రత్యక్ష నారాయణుడు.

చతుర్ణామపి వర్ణానాం పావనాయ మహాత్మనామ్ ధర్మశాస్త్రమనేనోక్తం ధర్మాద్యైస్సు సమన్వితమ్

బిభేతి గహనాచ్ఛాస్త్రాల్లోకో వ్యాధిరి వౌషధాత్ భారతస్య చ విస్తారో మునినా వ్యాహృత స్స్వయమ్.

 యథాస్వాదుచ పథ్యంచ దద్యాత్స్వం భిషగౌషధమ్ తథా రమ్యంచ శాస్త్రంచ భారతం కృతవానునిః 

ఆస్తిక్యారోహ సోపానమేతద్భారతముచ్యతే తచ్చ్రుత్వా స్వర్గనరకే లోక సాక్షాదవేక్షతే.

దేవతాతీర్థ తపసాం భారతాదేవ నిశ్చయః న జన్యతే నాస్తికతా తస్య మీమాంసకైరపి.

తా దయామయుడును మరియు దివ్య విధానముల నెరిగినవాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను నాలుగు వర్ణముల వారిని పవిత్రము చేయుటకై ధర్మప్రధానాంశములచే చక్కగా పొందుపరుపబడిన ధర్మశాస్త్రము నీతడు చెప్పెను. ఔషధము వలన వ్యాధివలే అతిక్లిష్టమైన శాస్త్రము వలన లోకము భయపడును. సర్వధర్మ సంకలనమైన మహాభారతమును విస్తారముగా వ్యాసముని చెప్పినాడు. వైద్యుడు మంచి రుచికరమైన పధ్యాన్ని ఔషధంగా (రోగికి) ఇచ్చువిధముగా వ్యాసముని మహాభారతమును రమ్యమగు శాస్త్రముగా నిర్మించియిచ్చెను. ఆస్తికత్వమనెడు నిచ్చెనకు భారతము ఒక మెట్టుగా చెప్పబడును. భారతమును వినిన జనుడు స్వర్గనరకముల (మంచి చెడులను) ప్రత్యక్షముగా దర్శించును. దేవతలు, పుణ్యతీర్థములు, తపస్సులు సిద్ధించుట భారతమూలమున నిశ్చితములు. మీమాంసకులుకూడా దానికి నాస్తికతను ప్రతిపాదింపరు .

విష్ణౌ దేవేషు వేదేషు గురుషు బ్రాహ్మణేషుచ భక్తిర్భవతి కళ్యాణి భారతదేవ ధీమతామ్.

ధర్మార్థకామ మోక్షాణాం భారతాత్సిద్ధి రేవహి అజిహ్మో భారతః పంథా నిర్వాణ పదగామినామ్

మోక్ష ధర్మార్థ కామానాం ప్రపంచో భారతే కృతః అనిత్య తాప సంతప్తా భవంతి తస్య ముక్తయే

విపత్తం భారతాచ్చ్రుత్వా వృష్ణి పాండవ సంపదామ్ దుఃఖావసానాద్రాజేంద్ర పుణ్యంచ సంశ్రయద్బుధః

ఏవం విధం భారతం వైప్రోక్తం యేన మహాత్మనా సోఽయం నారాయణ స్సాక్షాద్వ్యాసరూపీ మహామునిః

సతేషాం వచనం శ్రుత్వాప్రతాపీ యోమహీపతిః ప్రసాదయామాస మునిం వ్యాసం శాస్త్రవిశారదమ్

తా II భారత శ్రవణము వల్లనే విష్ణునీయందు, దేవతలయందు, వేదములయందు, గురువులయందు, విప్రులయందు బుద్ధిమంతులకు భక్తిభావము ఘటిల్లుచున్నది. ధర్మార్థ కామమోక్షములయొక్క సిద్ధి భారతము వలననే కలుగును. మోక్షపదగాములకు భారతము ఒక చక్కని మార్గము. ధర్మార్థ కామ మోక్షములగూర్చి భారతమున విస్తారముగ చెప్పబడినది. జనులు ముక్తికై తాత్కాలికములైన తాపములచే కృశించుచున్నారు. పండితుడగువాడు భారతము వలన యాదవ పాండవ వంశసంపదల నాశమును గూర్చి వీని దుఃఖమును తొలగించుకొనుట ద్వారా పుణ్యమునొందును. ఇట్లు భారతమును చెప్పిన మహాత్ముడును, వ్యాసముని రూపమున నున్న సాక్షాన్నారాయణుడును ఈ మహామునియే . ఆ మునుల యొక్క వచనమును విని ప్రతాపవంతుడగు ఆ శతానీక మహారాజు -

అంజలిశ్శిరసా బ్రహ్మాన్ కృతోఽయం పాదయోస్తవ, బ్రూహిమే ధర్మశాస్త్రంతుయే నాహం పూతతాం వ్రజే.

 సముద్ధర భవాదస్మాత్కీర్తయిత్వా కథాం శుభమ్. యధామమపితా పూర్వం కీర్తయిత్వాతు భారతమ్.

 తస్యై తద్వచనం శ్రుత్వా వ్యాసో వచనమబ్రవీత్, ఏష శిష్యస్సుమంతుర్మే కథయిష్యతి తే ప్రభో.

 యదిచ్ఛసి మహాబాహో ప్రీతిచం చాద్భుతం శుభమ్, శ్రవ్యం భరత శార్దూల సర్వపాప భయాపహమ్

యథావైశంపాయనేన పురాప్రోక్తం పితుస్తవ మహాభారత వ్యాఖ్యానం బ్రహ్మహత్యా వ్యపోహనమ్

తాII శాస్త్రకుశలుడైన ఆ వ్యాసమునిని పూజించి సంతోషపెట్టెను. పిదప శతానీకుడిట్లు పలికెను. ఓ దేవా! నీ పాదములకిదియే శిరస్సువంచి నమస్కరించితిని. దేనిచే నేను పవిత్రతను పొందెదనో అట్టి ధర్మశాస్త్రమును నాకు ప్రవచింపుము. పూర్వము భారతమును స్మరించి ముక్తుడైన నా తండ్రినివలె నాకును శుభమైన ధర్మ శాస్త్ర కథను చెప్పి నన్ను ఈ సంసారమునుండి లేవ నెత్తుము. శతానీకుని ఆ వచనమును విని వ్యాసుడిట్లు పలికెను. ఓ భరతకుల శ్రేష్టా! పూర్వము నీ తండ్రికి వైశంపాయనుడు భారతము చెప్పినట్లుగా నా యీ శిష్యుడైన సుమంతుడు ప్రీతినిచ్చు అద్భుతమైన, శ్రవ్యమైన, సర్వపాపభయనివారకమైన ఏ కథను నీవు కోరుచున్నావో అట్టి బ్రహ్మహత్యాపాతక నివారకమైన భారత కథను నీకు చెప్పును  

అథ తం ఋషయస్సర్వే రాజానమిదమబ్రువన్ సాధుప్రోక్తం మహబాహో! వ్యాసేనామీత బుద్ధినా.

 సుమంతుం పృచ్ఛ రాజర్షే సర్వశాస్త్ర విశారదమ్ అస్మాకమపి రాజేంద్ర శ్రవణే జాయతే మతిః

 అథవ్యాసో మహాతేజా స్సుమంతుమృషీమబ్రవీత్ కథయాస్మై కథాస్తాత యాశ్శ్రుత్వా మోదతే నృపః

భారతాది కథానాంతు యత్రాస్య రమతే మనః

అసావపి మహాతేజాఃశ్రుత్వా భావం మహామతేఃవ్యాసస్య ద్విజశార్దూలో ఋషీణాం చాపి సర్వశః

తా అంత ఆ రాజునుగూర్చి మునులందరు ఈ మాటను పలికిరి. ఓ మహావీరా ! మిక్కిలి ధీమంతుడైన వ్యాసుడు యుక్తముగా పలికెను. ఓ రాజర్షి నీవు సకల శాస్త్రములలో నేర్పరియైన సుమంతుని అడుగుము. మాకు కూడా అట్టి కథను వినుటకై కోరిక కలుగుచున్నది. అంత, మహాతేజస్వియైన వ్యాసముని సుమంతునితో నిట్లు పలికెను. ఓ ఆర్యా! ఈ రాజు ఏ కథను విని ఆనందింపగలడో ఏ కథయందు ఈతని మనస్సు ఉల్లాసమునొందునో అట్టి భారతాదుల యొక్క కథను నీవు చెప్పుము.  

మహాతేజస్వి, విప్రశ్రేష్ఠుడును అగు ఆ సుమంతుడు మహాధరుడైన వ్యాసునియొక్క, మిగతా మునుల యొక్క అభిప్రాయమును విని -

చకార వక్తుం సమనః తస్మై రాజ్ఞే మహామతిః వ్యాసస్య శాసనాద్విప్ర ఋషీణాంచైవ సర్వశః

అథరాజా మహాతేజా ఆజమీఢో ద్విజోత్తమమ్ ప్రణమ్య శిరసాత్యర్థం ప్రవక్తుముపచక్రమే

శతానీక ఉవాచ !!

పుణ్యాఖ్యానం మమబ్రహ్మన్ పావనాయ ప్రకీర్తయ శ్రుత్వాయద్భ్రాహ్మణ శ్రేష్ఠ ముచ్యహం సర్వపాతకాత్.

సుమంతురువాచ !!

నానా విధాని శాస్త్రాణి సంతి పుణ్యాని భారత యాని శ్రుత్వా నరో రాజన్ముచ్యతే సర్వకిల్బిషైః

            తా వ్యాసుని యొక్క, మరియు సర్వ మునుల యొక్క ఆజ్ఞాను సారముగా మహాబుద్ధిశాలియగు శతానీకునకు కథను చెప్పుటకు సమ్మతించెను. అంతట కుమారుడు, గొప్ప తేజస్వియగు శతానీక మహారాజు బ్రాహ్మణోత్తముడైన సుమంతునికి నమస్కరించి అతనితో పలుకుటకుపక్రమించెను. శతానీకుడిట్లు పలికెను. ఓ బ్రాహ్మణ శ్రేషా! ఏ కథాశ్రవణము వలన నేను సర్వపాపములనుండి విముక్తుడనగుదునో అట్టి పుణ్యకథను నన్ను పవిత్రము చేయుటకై ప్రవచింపుము. సుమంతుడిట్లు పలికెను. ఓ భరతకుల సంభవా! రాజా! ఏ శాస్త్రములను వినుటద్వారా మానవుడు సకల పాపములనుండి విముక్తుడగునో అట్టి పవిత్రములైన శాస్త్రములు చాలా ఉన్నవి .

కిమిచ్ఛసి మహాబాహో శ్రోతుం యత్త్వాం బ్రవీమీవై  భారతాది కథానాం తు యాసు ధర్మాదయస్థితాః

శతానీక ఉవాచ !!

మతాని కాని విప్రేంద్ర ధర్మశాస్త్రాణి సువ్రత యాని శ్రుత్వానరో విప్ర ముచ్యతే సర్వకిల్పి షైః

సుమంతు రువాచ !!

శ్రూయతాం ధర్మశాస్త్రాణి మనుర్విష్ణుర్యమోంఽగిరాః వసిష్ఠ దక్ష సంవర్త శాతాతప పరాశరాః

ఆపస్తంబోఽధ ఉశనా కాత్యాయన బృహస్పతీ గౌతమ శ్శంఖలిఖితౌ హారీతోఽ  త్రిరథాపివా

ఏతాని ధర్మశాస్త్రాణి శ్రుత్వా జ్ఞాత్వాచ భారత బృందారకపురం గత్వా మోదతే నాత్ర సంశయః

తా ఓ మహవీరా! అట్టి నానా ధర్మ శాస్త్ర కథలయందు నీవు దేనిని వినగోరెదవో దానిని చేప్పెదను. శతానీకుడిట్లు పలికెను. ఓ నిష్టాగరిష్ణా ! వేనిని వినుటచే నరుడు. సర్వపాపవిముక్తుడగునో, అట్టి ధర్మశాస్త్రములలో నేవి అభిలషణీయములు?. సుమంతుడిట్లు పలికెను. ధర్మశాస్త్రము లేవి కలవో వినుము. మనువు, విష్ణువు, యముడు, అంగీరసుడు, వసిష్ఠుడు, దక్షుడు, సంవర్తుడు, శాతాతపుడు, పరాశరుడు, ఆపస్తంబుడు, ఉశనుడు, కాత్యాయనుడు, బృహస్పతి, గౌతముడు, శంఖలిఖితులు, హారీతుడు, అత్రిమున్నగు వారు రచించిన ధర్మశాస్త్రములు కలవు. ఓ భారత! ఈ శాస్త్రములను విని తెలిసికొనుట ద్వారా మానవుడు స్వర్గమును పొంది సుఖించుననుటలో ఎట్టి సందేహము లేదు .

 శతానీక ఉవాచ !!

యాన్యేతాని త్వయోక్తాని ధర్మశాస్త్రాణి సువ్రత నేచ్ఛామి శ్రోతుం విప్రేంద్ర శ్రుతాన్యేతానిహిద్విజ.!

 త్రయాణామపి వర్ణానాం ప్రోక్తానామపి పండితైః శ్రేయసే నతు శూద్రాణాం తత్రమే వచనం శ్రుణు.

 చతుర్ణామిహ వర్ణానాం శ్రేయసే యాని సువ్రత భవంతి ద్విజశార్దూల శ్రుతాని భువనత్రయే.

విశేషతశ్చతుర్థస్య వర్ణస్య ద్విజసత్తమ.

 బ్రాహ్మణాదిషు వర్ణేషు త్రిషు వేదాః ప్రకల్పితా: మన్వాదీని చ శాస్త్రాణి తథాంగాని సమంతతః .

 శూద్రాశ్చైవ భృశం దీనాః ప్రతిభాంతి ద్విజప్రభో ధర్మార్థకామ మోక్షస్య శక్తాస్యురవనే కథమ్.

తా ఓ సువ్రతా! విప్రశ్రేషా! నీవు పలికిన ఆ ధర్మశాస్త్రములన్నియు విద్వాంసులచే చెప్పబడిన మొదటి మూడు వర్ణముల శ్రేయమునకే కాని శూద్రుల శ్రేయమునకు కాదని నేను విన్నాను. అందువలన నేను అట్టి వానిని వినగోరుట లేదు. కావున నామాటను వినుడు. ఓ సువ్రతా ! బ్రాహ్మణోత్తమా! ఏ శాస్త్రములు నాలుగు వర్ణముల వారి శ్రేయస్సునకై ప్రసిద్ధములై యున్నవో, అందునా విశేషించి నాలుగవ వర్ణము వారైన శూద్రుల శ్రేయమునకు ఉద్దేశింపబడినవో వానిని వినగోరెదను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను మూడు వర్ణముల సంక్షేమమునకై, ధర్మాది ప్రయోజనముల సిద్ధికై, వేదాలు, వేదాంగాలు మరియు మన్వాది స్మృతులు ఏర్పరుపబడినవి. ఓ ద్విజప్రభూ! మిక్కిలి దీనులైన శూద్రులు ధర్మార్థకామ మోక్షములకు ఎట్లు అర్హులగుదురు? వారిని కాపాడుట ఎట్లు?.

ఆగమేన విహీనాహి కష్టం మతమహోమమ కశ్చై షామాగమః ప్రోక్తాః పురాద్విజమనీషిభిః

త్రివర్గప్రాప్తయే బ్రహ్మాన్ శ్రేయసే చ తథోభయో:

సుమంతురువాచ !!

సాధుసాధు మహాబాహో శ్రుణు మే పరమం వచః చతుర్ణామపి వర్ణానాం యాని ప్రోక్తాని శ్రేయసే

ధర్మశాస్త్రాణి రాజేంద్ర శ్రుణు తాని నృపోత్తమ విశేషతశ్చ శూద్రాణాం పావనాని మనీషిభి :

అష్టాదశపురాణాని చరితం రాఘవస్య చ రామస్య కురుశార్దూల ధర్మకామార్థ సిద్ధయే

తథోక్తం భారతం వీర పారాశర్యేణ ధీమతా వేదార్థం సకలం యోజ్యం ధర్మశాస్త్రాణి చ ప్రభో

తా II ఓ ద్విజోత్తమా ! అట్టి శాస్త్ర జ్ఞాన విహీనులగు శూద్రుల విషయమున నాకు బాధ కలుగుచున్నదికాన వారి శ్రేయమునకై మరియు ధర్మార్థకామఫలసిద్ధికై విద్వాంసులగు విప్రులు ఏ శాస్త్రమును చెప్పిరో తెలుపుడు.

సుమంతుడు పలికెను!

ఓ వీరా ! నీవు పలికినది మిక్కిలి యుక్తముగానున్నది. నామాటను వినుము. నాలుగు వర్ణముల యొక్క శ్రేయమునకై, విశేషించి శూద్రులకు శ్రేయమును గూర్చుటకై పండితులు ఏ పవిత్రములైన ధర్మశాస్త్రములను చెప్పిరో వానిని వినుము.  ఓ కురూత్తమా! చతుర్వర్ణముల వారికి ధర్మార్థకామఫలసిద్ధి కలుగుటకై పద్దెనిమిది పురాణములు మరియు శ్రీరామ కథయైన రామాయణము చెప్పబడినవి. అట్లే ధీమంతుడైన వ్యాసునిచే సకల వేదార్థ సమన్వితమైన మహాభారతము మరియు ధర్మశాస్త్రములును చెప్పబడినవి.

కృపాళునా కృతం శాస్త్రం చతుర్ణామిహశ్రేయసే వర్ణానాం భవమగ్నానాం కృతం పోతోహ్యనుత్తమమ్

 ఆష్టాదశపురాణాని హ్యష్టౌ వ్యాకరణాని చ జ్ఞాత్వా సత్యవతీసూను శ్చక్రే భారత సంహితామ్

యాం శ్రుత్వాపురుషోరాజన్ ముచ్యతే బ్రహ్మహత్యయా ప్రథమం ప్రోచ్యతే బ్రాహ్మం ద్వితీయం చైంద్రముచ్యతే

 యామ్యం ప్రోక్తం తతోరౌద్రం వాయవ్యం వారుణం తథా సావిత్రం చతథా ప్రోక్తమష్టమం వైష్ణవం తథా

ఏతాని వ్యాకరణాని పురాణాని నిబోధమే బ్రాహ్మం పాద్మం వైష్టవంచ శైవం భాగవతం తథా

తథాన్యన్నారదీయం చ మార్కండేయంచ సప్తమం ఆగ్నేయమష్టమం వీర భవిష్యం నవమం స్మృతమ్

తా II దయామయుడైన వ్యాసుడు, సంసారసాగరమున మునిగిన నాలుగు వర్ణముల వారిని తరింపజేయుటకై పరమోత్తమమైన ఈ భారతమును ఒక పడవగా కల్పించేను. అష్టాదశపురాణాలను మరియు ఎనిమిది వ్యాకరణములను తెలిసికొని వ్యాసమహర్షి బ్రహ్మహత్యా నివారకమైన భారత సంహితను రచించెను. ఓ రాజా! ఎనిమిది వ్యాకరణముల లేవియో తెలిసికొనుము. మొదటిది బ్రాహ్మము, రెండవది ఐంద్రము, మూడవది యామ్యము, నాలుగవది రౌద్రము, ఐదవది వాయవ్యము, ఆరవది. వారుణము, ఏడవది సావిత్రము, ఎనిమిదవది వైష్ణవము ఓ వీరా ! ఇక పద్దెనిమిది పురాణముల గూర్చి తెలిసికొనుము. 1) బ్రహ్మ-పురాణము 2) పద్మ పురాణము, 3) విష్ణు పురాణము 4) శివ పురాణము 5) భాగవతము 6) నారద పురాణము 7) మార్కండేయ పురాణము 8) అగ్ని పురాణము 9) భవిష్య పురాణము 10) బ్రహ్మ వైవర్త పురాణము 11) లింగపురాణము 12) వరాహ పురాణము 13) స్కంద పురాణము 14) వామన పురాణము 15) కూర్మ పురాణము 16) మత్స్యపురాణము 17) గరుడ పురాణము 18) బ్రహ్మాండపురాణము. ఓ కురుశ్రేష్టా! నాలుగు వర్ణాల వారి శ్రేయమునకై ఈ పద్దెనిమిది ధర్మశాస్త్రాలను పండితులు చెప్పిరి. ఓ రాజోత్తమా ! ఇందులో నీవేది వినగోరెదవో చెప్పుము. శతానీకుడిట్లు పలికెను. ఓ విప్రోత్తమా ! నా తండ్రి సమీపములో నేను భారతము వినియున్నాను. అట్లే రామచరితమును మిగతా పురాణములను కూడా విన్నాను. కాని భవిష్య పురాణమును వినలేదు. కాన నాకు విన కుతూహలముగల భవిష్య పురాణమును చెప్పుడు.  

దశమం బ్రహ్మవైవర్తం లింగమేకాదశం స్మృతమ్ వారాహం ద్వాదశం ప్రోక్తం స్కాందం చైవ త్రయోదశమ్

 చతుర్ధశం వామనంచ కౌర్మం పంచదశం స్మృతం మాత్స్యంచ గారుడం చైవ బ్రహ్మాండం చ తతఃపరమ్

ఏతాని కురుశార్దుల ధర్మశాస్త్రాణి పండితైః సాధారణాని ప్రోక్తాని వర్ణానాం శ్రేయసే సదా.

చతుర్ణామిహా రాజేంద్ర శ్రోతుమర్హిణి సువ్రత కిమిచ్ఛసి మహాబాహో శ్రోతుమేషాం నృపోత్తమ

శతానీక ఉవాచ:

భారతం తు శ్రుతం విప్ర తాతస్యాం కగతే నతు రామస్యచరితం చాపి శ్రుతం బ్రహ్మన్ సమంతతః

పురాణాని చ విప్రేంద్ర భవిష్యం నతు సువ్రత పురాణం వద విప్రేంద్ర భవిష్యం కౌతుకం హిమే  

సమంతురువాచ

సాధుసాధు మహాబాహో సాధు పృష్టోఽస్మి మానద శ్రుణు మే వదతో రాజన్ పురాణం నవమం మహత్.

యచ్చ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే మానవోనృప అశ్వమేథఫలం ప్రాప్య గచ్ఛే ద్భానౌ న సంశయః

ఇదంతు బ్రాహ్మణైః ప్రోక్తం ధర్మశాస్త్రమనుత్తమమ్ విదుషా బ్రాహ్మణేనేదమధ్యేతవ్యం ప్రయత్నతః

శిషేభ్యశ్చైవ వక్తవ్యం చాతుర్వర్ణ్యేభ్య ఏవహి అధ్యేతవ్యం నచాన్యేన బ్రాహ్మణం క్షత్రియం వినా శ్రోత వ్యమేవ శూద్రేణ నాధ్యతవ్యం కదాచన

 దేవార్చాం పురతః కృత్వా బ్రాహ్మణైశ్చ నృపోత్తమ శ్రోతవ్యమేవ శూద్రైశ్చ తథాన్యైశ్చ ద్విజాతిభి :

 శ్రౌతం స్మార్తం హిపై ధర్మం ప్రోక్త మస్మిన్ నృపోత్తమ తస్మాచ్ఛూద్రైర్వినా విప్రాన్ నశ్రోతవ్యం కథంచన

తా ఓ వీరా! నీవు చాలా చక్కగా అడిగితివి. ఏ తొమ్మిదవ పురాణమైన భవిష్యపురాణమును వినుటవల్ల మానవుడు సర్వపాపవిముక్తుడగుచు అశ్వమేథ యాగఫలమును పొంది నిస్సంశయముగా తేజోమూర్తియగు దేవునిలో లీనమగునో అట్టి భవిష్యపురాణమును చెప్పెదను వినుము. సర్వోత్తమమైన ఈ ధర్మశాస్త్రమును గూర్చి బ్రహ్మజ్ఞానులిట్లు చెప్పిరి. విద్వాంసుడైన విప్రుడు ముందు ఈ పురాణమును మిక్కిలి యత్నముతో చదువవలెను. పిదప శిష్యులకు, చతుర్వర్ణముల వారికిని దానిని బోధింపవలెను. ఎందుకనగా బ్రాహ్మణ క్షత్రియులు తప్ప ఇతరుడు దీనిని చదువ యోగ్యుడు కాడు. ఈ పురాణము శూద్రునకెప్పుడూ చదువదగినది కాదు. అతనిచే వినదగినది మాత్రమే. ఓ రాజశ్రేష్టా ! ముందుగా దేవతార్చన చేసి విప్రులు వినవలెను . ఓ రాజా! శౌత స్మార్త ధర్మాలు ఇందు చెప్పబడినవి కాన బ్రాహ్మణుడు లేకుండా శూద్రులు ఈ పురాణాన్ని వినకూడదు.

ఇదం శాస్త్రమధీయానో బ్రాహ్మణ స్సంశ్రితవ్రతః మనో వాగ్ధేహజైర్నిత్యం కర్మదో షెర్న లిప్యతే

శ్రుణ్వంతీ చాపియే రాజన్ భక్తావై బ్రాహ్మణాదయ : ముచ్యంతే పాతకైస్సర్వైర్గచ్ఛంతి చ దివం ప్రభో

శ్రావయేచ్చాపి యో విప్రః సర్వాన్వర్ణాన్ నృపోత్తమ సగురుఃప్రోచ్యతే తాత వర్ణానామిహ సర్వశః

స పూజ్యః సర్వకాలేషు సర్వైర్వర్ణైర్నరాధిప ప్పథివీం చ తథైవేమాం కృత్స్నామేకోఽపిసోఽర్హతి

ఇదం స్వస్త్యయనం శ్రేష్ఠమిద బుద్ధి వివర్థనం ఇదం యశస్యం సతతమిదం నిశ్స్రేయసం పరమ్

అస్మిన్ధర్మోఽఖిలేనోక్తో గుణదోషౌచ కర్మణాం చతుర్ణామపి వర్ణానాం ఆచారశ్చాపి శాశ్వతః

తా నీయమవ్రతుడై ఈ శాస్త్రమును చదువుచున్న బ్రాహ్మణునకు ఎప్పుడును మనోవాక్కాయములవల్ల కలిగే దోషములు అంటవు. ఓ రాజా! భక్తితో దీనిని వినేడు బ్రాహ్మణాదులును సకల పాపములనుండి ముక్తులై స్వర్గమునకు వెళ్ళెదరు. ఓ రాజోత్తమా ఏ బ్రాహ్మణుడు సకల వర్ణాలకు ఈ శాస్త్రమును వినిపించునో అతడు అన్ని వర్ణాలలోను మిక్కిలి గొప్పవాడుగాను మరియు అన్ని వేళలలోను అన్ని వర్ణాలచేత పూజింపదగిన వాడుగానగును. ఈ భూమి పై యోగ్యుడైన వాడతడేయగును. ఈ శాస్త్రము ఉత్తమమైనది. ఇది శుభానికి ఆస్పదమైనది. ఇదియే బుద్దీని పెంచునది. కీర్తిని కలిగించునది మరియు స్వర్గమును పొందించునది. ఈ శాస్త్రమున సకల ధర్మములు, కర్మల యొక్క గుణదోషములు, నాలుగు వర్ణముల వారి నిత్యాచారములు చెప్పబడినవి.

ఆచారః ప్రథమో ధర్మః శ్రుత్యుక్తశ్చ నరోత్తమ తస్మాదస్మిన్సమాయుక్తో నిత్యం స్యాదాత్మవాన్ద్విజః

ఆచారాద్విచ్యుతో విప్రో న వేదఫలమశ్నుతే ఆచారేణ చ సంయుక్తః సంపూర్ణ ఫల భాక్ స్మృతః

ఏవమాచారతో దృష్ట్వా ధర్మస్య మునయో గతిమ్ సర్వస్య తపసో మూల మాచారం జగృహుః పరమ్

 అన్యేచ మానవా రాజన్నాచారం సంశ్రితాస్సదా ఏవమస్మిన్ పురాణేతు ఆచారస్య తు కీర్తనమ్

వృత్తాంతాని చ రాజేంద్ర తథాచోక్తాని పండితైః త్రిలోక్యాస్తు సముత్పత్తి సంస్కార విధి రుత్తమః

శ్రవణంచేతిహాసస్య విధానం కథ్యతే నృప

తా ఓ రాజశ్రేష్ఠా! ఆచారమే వేదోక్తమైన మొదటిధర్మము. అట్టి నిత్య ఆచారయుక్తుడగు ఆత్మవంతుడు ద్విజుడనబడును. ఆచార రహితుడగు విప్రుడు వేద ఫలముననుభవింపలేడు. ఆచారసహితుడు సంపూర్ణవేద ఫలానుభవమునకు యోగ్యుడగును. ఈ విధముగా ఆచారమువల్లనే ధర్మము ప్రవర్తిల్లునని గమనించిన మునులు సకల తపస్సునకు మూలము ఉత్తమమైన ఆచారమేయని గ్రహించిరి. ఓ రాజా! అందుకే మానవులును ఎల్లప్పుడు ఆచారమునాశ్రయించినారు. ఈ విధముగా ఈ పురాణమున ఆచార ప్రశస్తి, దానికి సంబంధించిన పండితులచే చెప్పబడిన గాథలు ఉత్తమ సంస్కార విధి, త్రిలోకాల ఉత్పత్తిక్రమము, ఇతిహాస శ్రవణ విధానములు చెప్పబడి యున్నవి  

తథాస్మిన్ కథ్యతే రాజన్మాహాత్మ్యం వాచకస్యతు వ్రతచార్యాశ్రమాచారాః స్నాతకస్య పరోవిధిః

దారాదిగమనంచైవ వివాహానాంచలక్షణం పుంసాంచలక్షణం రాజన్ యోషితాంచాత్ర కథ్యతే

మహాయజ్ఞ విధానంచ శాస్త్రకల్పంచ శాశ్వతమ్ పృధివ్యా లక్షణం తాత దేవార్చాయాస్సులక్షణమ్

వృత్తీనాం లక్షణం చైవ స్నాతకస్య వ్రతాని చ భక్ష్యాభక్ష్యం చ శౌచంచ ద్రవ్యాణాం శుద్ధిరేవచ

స్త్రీ ధర్మయోగ స్తాపస్యం మోక్ష స్సన్యాస ఏవ చ రాజ్ఞశ్చ ధర్మోహ్యఖిలః కార్యాణాంచ వినిర్ణయః

మాహాత్మ్యం సవితుశ్చాత్ర తీర్ధానాంచ విశాంపతే నారాయణస్య మాహాత్మ్యం తథా రుద్రస్య కథ్యతే

తా అదే విధముగా ఓ రాజా! ఈ పురాణములో వాక్కు యొక్క మహత్తు బ్రహ్మచర్యవ్రతాది చతురాశ్రమాచారాలు, స్నాతకవిధి, వివాహలక్షణము, భార్యా సంగమ వీధి, పురుష స్త్రీ లక్షణాలు, మహాయజ్ఞ విధానము, శాస్త్ర విధి, భూమి లక్షణము, దేవతా పూజా లక్షణము, సత్ర్పవర్తనా లక్షణము, స్నాతక వ్రతములు, తినదగిన తినగూడని పదార్థములు, త్రికరణ శుద్ధి, వస్తు శుద్ది, స్త్రీల ధర్మాలు, తపోవిధానము, మోక్షము, సన్యాసము, రాజధర్మాలు, కర్తవ్య నిర్ణయము, సూర్యుని మాహాత్మ్యము, పుణ్యతీర్థాల మహత్తు, మరియు శివకేశవుల మాహాత్మ్యములు చెప్పబడియున్నవి .

మహాభాగ్యం చ విప్రాణాం మాహాత్మ్యం పుస్తకస్యచ దుర్గాదేవ్యాస్తథాచోక్తం సత్యస్య చ మహామతే 

సంక్షిప్తం సంవిధానం చ ధర్మం స్త్రీ పుంసయోరపి విభాగం ధర్మద్యూతం చ కథకానాం చ శోధనమ్

వైశ్య శూద్రోపచారం చ సంకీర్ణనాంచ సంభవమ్ ఆపద్ధర్మంచ వర్ణానాం ప్రాయశ్చిత్త వీధిం తథా

సంధ్యావిధిం ప్రేత శుద్ధిం స్నానతర్పణయోర్విధిం వైశ్యదేవ విధించాపి తథా భోజ్యవిధిం నృప

 నైశ్రేయసం కర్మణాంచ గుణదోష పరీక్షణమ్ దారాణాం లక్షణం ప్రోక్తం తథా పాత్ర పరీక్షణమ్

తా అట్లే ఓ మహామతీ ! బ్రాహ్మణ మహాభాగ్యము, పుస్తక మాహాత్మ్యము, దుర్గా మాహాత్మ్యము, సత్య మహత్తు, స్త్రీ పురుషుల ధర్మము, ధర్మద్యూతము, దాని విభాగము, కథకుల శోధనము, వైశ్యశూద్రుల యొక్క ఆచారము సంకీర్ణ జాతుల పుట్టుక, వర్ణాల యొక్క ఆపద్ధర్మము, ప్రాయశ్చిత్తవిధి, సంధ్యానుష్టానము, ప్రేతశుద్ధి, స్నానతర్పణ విధి, వైశ్వదేవ విధానము, భోజన విధానము, దంతకాష్ఠ లక్షణము, చరణ వ్యూహము, సంసారమున వర్తించు పద్ధతి, త్రివిధమైన కర్మ సంభవము, మోక్షప్రాప్తి, కర్మల యొక్క గుణదోషముల పరీక్షణము, సతుల లక్షణము, పాత్ర పరీక్షణము ఈ పురాణమున ప్రకృష్టముగా చెప్పబడినవి.

ప్రసూతిం చాపి గర్భస్య తథాకర్మఫలం నృప జాతి ధర్మాన్కుల ధర్మాన్వేద ధర్మాంశ్చ పార్థివ

వైతాన ప్రతికానాంచ తథాసౌ ప్రోక్తవాన్విభుః బ్రహ్మాకురుకుల శ్రేష్ఠ శంకరాయ మహాత్మనే

శంకరేణ తథా విష్ణోః కథితం కురునందన విష్ణునాది పునఃప్రోక్తం నారదాయ మహీపతే

నారదాత్ర్పాప్త వాఞ్చక్రః శక్రాదపి పరాశరః పరాశరాత్తతో వ్యాసో వ్యాసాదపీ మయావిభో

ఏవం పరంపరా ప్రాప్త పురాణమిదముత్తమమ్ శ్రుణుత్వమపి రాజేంద్ర మత్సకాశాత్పరం హితమ్

గర్భప్రసవమును, అట్లే కర్మఫలమును, జాతి, కుల, వేద ధర్మలను, వైతాన ప్రతధర్మాలను గూర్చియు ఈ పురాణమున వ్యాసభగవానుడు చెప్పియున్నాడు. ఓ కురుకుల శ్రేష్టా ! ఈ పురాణము బ్రహ్మనుండి శంకరునకు, శంకరుని నుండి విష్ణువునకు, విష్ణువునుండి నారదునకు, నారదుని నుండి ఇంద్రునకు, ఇంద్రుని నుండి పరాశరునకు ప్రవచింపబడగా పరాశరుని నుండి వ్యాసుడు, వ్యాసుని నుండి నేను పొందినాము  

ఇట్లు పరంపరా గతముగానగు ఈ ఉత్తమమైన, హితకరమైన పురాణమును నీవునూ నానుండి వినవలసినది .

 సర్వాణ్వేవ పురాణాని సంజ్ఞేయాని నరర్షభ ద్వాదశైవ సహస్రాణి ప్రోక్తానిహ మనీషిభిః

పునర్వృద్ధిం గతానీహ ఆఖ్యానైర్వివిధై ర్నృప యథా స్కాందం తథాచేదం భవిష్యం కురునందన

 స్కాందం శతసహస్రంతు లోకానాం జ్ఞాతమేవహి భవిష్యమేత దృషిణా లక్షార్థం సంఖ్యయా కృతమ్

 తచ్ఛృత్వా పురుషో భక్త్యా ఇదం ఫలమవాప్నుయాత్ బుద్ధిర్వృద్ధిస్తథా శ్రీశ్చ భవంతి తస్యనిశ్చితమ్

 ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధసాహస్ర్యం సంహితాయాం బ్రాహ్మేపర్వణి

కథాప్రస్తావనే ప్రథమోZధ్యాయః

 ఓ నరశ్రేష్ఠా! పన్నెండు వేలుగా చెప్పబడిన పురాణములన్నియును బుద్ధిమంతులు తెలిసికొనదగినవైయున్నవి. స్కాందము మరియు భవిష్యపురాణము వలెనే పురాణములన్నియు వివిధ అఖ్యానములచే పెంపు చేయబడినవి. స్కాందపురాణము ఒక లక్షశ్లోక పరిమితి గ్రంథమని లోకులకు తెలిసినదే. ఇక నీ భవిష్య పురాణమును వ్యాసముని లక్షార్థశ్లోక సంఖ్యగల గ్రంథముగా నిర్మించేను. ఈ పురాణమును భక్తితో విన్న నరుడు సత్ఫలమును పొందగలడు. దీని వినుట వలన నతనికి మేథాభ్యుదయ సంపదలు నిశ్చయముగా కలుగును.

భవిష్య పురాణమందలి బహ్మ పర్వములోని ప్రథమాధ్యాయము సమాప్తము.